సమీక్ష : లవ్ యు బంగారమ్ – ఇదొక ‘భూతు బంగారమ్’

సమీక్ష : లవ్ యు బంగారమ్ – ఇదొక ‘భూతు బంగారమ్’

Published on Jan 25, 2014 4:20 AM IST
Love_U_Bangaram_movie విడుదల తేదీ : 24 జనవరి 2014
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : గోవి
నిర్మాత : మారుతి – కె. వల్లభ
సంగీతం : మహిత్ నారాయణ్
నటీనటులు : రాహుల్, శ్రావ్య, రాజీవ్..

హ్యాపీ డేస్, రెయిన్ బో, ముగ్గురు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న రాహుల్ హీరోగా, శ్రావ్య హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘లవ్ యు బంగారమ్’. ప్రేమలో పడిన ఒక ఐటి ప్రొఫెషనల్ లైఫ్ ఎలా మలుపు తిరిగింది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి కుమారుడు ఓ కీలక పాత్ర పోషించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.వల్లభ – మారుతి కలిసి నిర్మించిన ఈ సినిమా ద్వారా గోవి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న రాహుల్ ఆశలు తీర్చేలా ఈ సినిమా ఉందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఆకాష్(రాహుల్) సెల్ కాన్ మొబైల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. ఆకాష్ చూడటానికి ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించినా కాస్త ఆత్మ నూన్యత భావం (ఇన్సెక్యూర్ ఫీలింగ్) కలిగిన వ్యక్తి. ఆకాష్ వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన ఆలోచనలు ఉన్న అమ్మాయి మీనాక్షి(శ్రావ్య). ఆకాష్ మీనాక్షిని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి మీనాక్షి కూడా రాహుల్ ని ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమని పెద్దవాళ్ళు అంగీకరించకపోవడంతో పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత సాఫీగా సాగిపోతున్న వారిద్దరి జీవితంలోకి మదన్(రాజీవ్) ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత రాహుల్ – మీనాక్షి మధ్య ఏం జరిగింది? వారిద్దరి మధ్య వచ్చిన సమస్యలు ఏంటి? అసలు ఈ మదన్ ఎవడు? అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

సినిమా క్లైమాక్స్ లో ట్విస్ట్ లన్నీ రివీల్ చేయడం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే సినిమా మొదట్లో జబర్దస్త్ ఫేం షకలక శంకర్ తో శ్రీకాకుళం యాసలో చేసిన కామెడీ, కథకి అవసరం లేకపోయినా సినిమాలో పెట్టిన ఎఫ్.బి అనే పాత్ర కొద్దిసేపు నవ్విస్తాయి.

హీరోయిన్ శ్రావ్య మాత్రం మొదటి నుంచి చివరి దాకా తన గ్లామర్, ఎక్స్ పోజింగ్ తో ముందు బెంచ్ వారిని ఆకట్టుకోవడానికి బాగా ప్రయత్నించింది. ముందు బెంచ్ వారిని మాత్రం టార్గెట్ చేసి తీసిన భూతు సీన్స్ సి సెంటర్స్ లో వర్కౌట్ అవ్వొచ్చు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో హీరోయిన్ శ్రావ్యని ఎక్స్ పోజింగ్ కి తప్ప మిగతా దేనికీ వాడుకోలేదు. నటనా పరంగా తనకి జీరో మార్కులు పడ్డాయి. రాహుల్ కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు. డైరెక్టర్ ఎలాగో మారుతి – వల్లభ లాంటి వాళ్లకి కథ చెప్పి ఒప్పించాడు, కానీ సెట్స్ పైకి వచ్చేసరికి చెప్పాలనుకున్నది వదిలేసి రొమాన్స్, గ్లామర్, భూతు అనే వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో అనుకున్న పాయింట్ కాస్త గంగలో కలిసిపోయింది. చివరికి కూడా తను అనుకున్న కాన్సెప్ట్ కి జస్టిఫికేషన్ ఇవ్వకుండానే కథని ముగించేయడంతో ఆడియన్స్ భూతు కాకుండా ఇందులో ఏం చెప్పడానికి ప్రయత్నించాడా బుర్రలు బద్దలు కొట్టుకుంటారు.

ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా సాగుతోందని అనుకుంటున్న తరుణంలో ప్రేక్షకులని ఇంకా చిరాకు పెట్టడం కోసం వరుస బెట్టి పాటలు దాడి చేస్తుంటాయి. ఫస్ట్ హాఫ్ అయిపొయింది కదా సెకండాఫ్ అన్నా బెటర్ గా ఉంటుందా అని అనుకున్న ఆడియన్స్ కి చివరి పది నిమిషాల వరకూ చిరాకే కలిగించాడు. కథ మొట్ట ఒకటే పాయింట్ ని ని డీల్ చెయ్యాలి అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే ని ఆసక్తికరంగా ప్లాన్ చేసుకోవాలి. కానీ స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా ఉంది.

అలాగే సినిమాలో సాఫ్ట్ వేర్ రంగం మొత్తం భూతుమాయం అని చూపించిన విధానం మాత్రం చదగినది కాదు. ప్రతి చోటా మంచి చెడులు ఉంటాయి, కానీ ఇందులో సాఫ్ట్ వేర్ వర్గాన్ని మొత్తం భూతు అని చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది డైరెక్టర్ ఛాయస్ కే వదిలేస్తున్నాం. సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది ఒకటి రెండు సీన్స్ లో తప్ప ఎక్కడా కనిపించదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పుకోదగినది జెబి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సీన్స్ కి అంత అవసరం లేదు కానీ ఏదో తన తాపత్రయం కొద్దీ ఏదో చెయ్యాలి అన్న తపనతో సీన్స్ లో కంటెంట్ లేకపోయినప్పటికీ ఎలివేట్ చెయ్యడానికి బాగా ట్రై చేసాడు. మహిత్ నారాయణ్ అందించిన పాటలు వినడానికి పరవాలేధనిపించినా వరుసగా రావడంతో చిరాకుగా ఫీల్ అయిన ఆడియన్స్ పాటలని పక్కకి తోసేసారు. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ చాలా వరకు కత్తిరించవచ్చు. కానీ ఆయన ఒకసారి కత్తిరించడం మొదలు పెడితే చివరికి ఏ 10 లేదా 15 నిమిషాల సినిమా మాత్రమే బయటకి వెళుతుంది. అందుకే ఆయన పెద్ద రిస్క్ తీసుకోకుండా డైరెక్టర్ తీసింది జాయింట్ చేసి ఇచ్చేసాడు.

కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – డైరెక్షన్ విభాగాలను డీల్ చేసింది గోవి అలియాస్ గోవింద్ రెడ్డి. ఈయన డీల్ చేసిన అన్ని విభాగాలకు సరిగ్గా సరిపోయే పదం అంటే అది ‘భూతు..భూతు…భూతు’ మాత్రమే. ఎందుకంటే ఆయన అన్నిట్లోనూ చూపించింది అదే కాబట్టి. మారుతి లాంటి డైరెక్టర్స్ కొత్త వారిని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఆఫర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాని ఉపయోగించుకోలేకపోవడం కాస్త బాధాకరం. అలాగే ఈ సినిమాతో మారుతి చాన్స్ ఇచ్చే వాళ్ళందరూ భుతు కాన్సెప్ట్ నే ఎంచుకుంటారు, అది తప్ప వారికి ఇంకేమీ రాదేమో అనే అనే ముద్ర కూడా పడిపోయే అవకాశం ఉంది. నిర్మాణ విలువలు ఓకే.

తీర్పు :

‘లవ్ యు బంగారమ్’ సినిమా భూతుతో ఆడియన్స్ ని టార్చర్ పెట్టే సినిమా. ఇష్టమైన స్వీట్ అయినా ఎక్కువగా తింటే అయిష్టంగా మారిపోతుందంటారు. సినిమాకి గ్లామర్ అనేది అవసరమే కానీ అదే గ్లామర్ శృతిమించితే చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాకి ప్లస్ అంటే ముందు బెంచ్ వారిని మెప్పించే గ్లామర్, రొమాన్స్, మైనస్ అంటే శృతిమించిన గ్లామర్, శృతిమించిన శృంగారం. ఈ సినిమాలో భూతు అనేది తప్ప ఇంకేమీ లేదు. ఒకవేళ మీకు భూతే కావాలనుకుంటే అది ఈ సినిమాలో కాకుండా ఎక్కడ దొరుకుతుందో అనేది మేం మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా..!

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు