సమీక్ష : మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు – ఫీల్ గుడ్ లవ్ స్టొరీ

సమీక్ష : మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు – ఫీల్ గుడ్ లవ్ స్టొరీ

Published on Feb 7, 2015 2:45 PM IST
Malli-Malli-Idi-Rani-Roju-m విడుదల తేదీ : 6 ఫిబ్రవరి 2015
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : క్రాంతి మాధవ్
నిర్మాత : వల్లభ
సంగీతం : గోపి సుందర్
నటీనటులు : శర్వానంద్, నిత్యా మీనన్…


‘రన్ రాజా రన్’ సినిమాతో కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శర్వానంద్ హీరోగా మలయాళ కుట్టి నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన లవ్ ఎంటర్టైనర్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. ‘ఓనమాలు’ సినిమాతో విమర్శకుల మెప్పు పొందిన క్రాంత్ మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పైన కెఎ వల్లభ నిర్మించాడు. ఒక అందమైన ప్రేమకథగా రూపొందిన ఈ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ప్రేమలో పడేసిందో ఇప్పుడు చూద్దాం..

కథ :
రాజారాం(శర్వానంద్) నేటితరం కుర్రాళ్ళలా కాకుండా ఒక లక్ష్యం ఉన్న కాలేజ్ కుర్రాడు. ఎప్పటికైనా నేషనల్ లెవల్లో రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తుంటాడు. అదే టైములో తన కాలేజ్ లో చేరిన ముస్లీం అమ్మాయి అయిన నజీర(నిత్యా మీనన్) కళ్ళు చూసి ప్రేమలో పడతాడు. నజీర రోజూ తన మొహం చూపించకుండా రాజారాంని పలు విధాలుగా ఆటపట్టిస్తూ, తన ప్రేమని తెలియజేస్తూ, తన లక్ష్యం చేరుకోవడానికి కావాల్సిన సపోర్ట్ ని ఇస్తుంటుంది. ఈ సపోర్ట్ తో రాజారాం తను అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడమే కాకుండా తను ఎన్నో రోజులుగా చూడాలనుకుంటున్న నజీరని చూస్తాడు. కానీ అప్పుడే కథలో ట్విస్ట్.. రాజారాం – నజీర ఇద్దరూ విడిపోతారు. అలా విడిపోయిన వీరిద్దరూ ఎప్పుడు కలిసారు.? అసలు అంతలా ప్రేమించుకున్న వీరిద్దరూ విడిపోవడానికి ఎవరు కారణం.? విడిపోయిన వీరిద్దరినీ కలపడానికి ఎవరన్నా ట్రై చేసారా.? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ముందుగా చాలా రోజుల తర్వాత మనసుకు హత్తుకునేలా అనిపించిన ఓ అందమైన, స్వచ్చమైన ప్రేమకథని తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రాంతి మాధవ్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక ఈ సినిమాకి హెల్ప్ అయిన ప్లస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. అందులో ముందుగా చెప్పాల్సింది ఈ సినిమా హీరో – హీరోయిన్ అయిన శర్వానంద్ – నిత్యా మీనన్ గురించే చెప్పాలి.

శర్వానంద్ ఈ సినిమాలో తను ఇప్పటి వరకూ చేయని ఒక డిఫరెంట్ మిడిల్ క్లాస్ కాలేజ్ కుర్రాడి పాత్ర చేసాడు. ఇందులో తను చూపించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ సింప్లీ సూపర్బ్. ఇక ముస్లీం అమ్మాయి పాత్రలో నిత్యా మీనన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. తను కూడా తన కళ్ళతో హావభావాలను పలికిస్తూ, తన క్యూట్ క్యూట్ లవ్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను ప్రేమలో పడేసింది. ఎమోషనల్ సీన్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శర్వానంద్ – నిత్యా మీనన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే మనం వెంటనే ప్రేమలో పడాలి, ప్రేమలో పది ఈ మాధుర్యాన్ని ఆస్వాదించాలి అనిపించేంతలా ఉంటుంది. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ లేకపోతే ఈ సినిమానే లేదు. వీరి తర్వాత యంగ్ హీరోయిన్స్ అయిన పునర్నవి, తేజస్విలు చేసింది చిన్న చిన్న పాత్రలే అయినా వారి పెర్ఫార్మన్స్ కథకి బాగా హెల్ప్ అయ్యింది.

శర్వానంద్ కి మదర్ గా చేసిన ఆమె పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అటు బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫీలింగ్ ని మీలో కలుగజేస్తూనే, మీ పెదవుల పైన చిరునవ్వు ఉండేలా ఓ హ్యూమర్ టచ్ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఈ ఫీల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. సెకండాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి. వీటన్నిటికీ మించి సాయి మాధవ్ బుర్రా రాసిన వండర్ ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్ డైలాగ్స్, గోపి సుందర్ వినసొంపైన మ్యూజిక్, కళ్ళకు ఒక దృశ్య కావ్యంలా అనిపించే జ్ఞానసేఖర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణం పోశాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది.. ఈ సినిమా కథ. కథలో చెప్పుకోదగిన క్రేజీ లవ్ స్టొరీ లేదా కొత్తగా అనిపించే పాయింట్ ఏమీ లేదు.. మనకు తెలిసిన పరిచయం ఉన్న ఒక సింపుల్ లవ్ స్టొరీని చాలా అందంగా చూపించడానికి ట్రై చేసాడు. అందంగా చూపించడం నచ్చినప్పటికీ సినిమా కథ సింపుల్ అవడం వలన కథ ముందుకు వెళ్తున్న ఫీలింగ్ ఆడియన్స్ కి కలగదు. చాలా స్లోగా నెరేట్ చెయ్యడం అక్కడక్కడా బోర్ కొడుతుంది. సింపుల్ స్టొరీ అయినప్పుడు దాన్ని షార్ట్ అండ్ స్వీట్ గానే చెబితే బాగుంటుంది. కానీ ఈ సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువవ్వడం వలన కథా పరంగా అస్సలు ముందుకు వెళ్ళడం లేదేంటి అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇదే సినిమాని 2 గంటల్లో చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.

ఇక స్క్రీన్ ప్లే ని ఫస్ట్ హాఫ్ లో బాగా రాసుకున్నా సెకండాఫ్ లో ఎక్కడో ఆ ఫ్లో మిస్ అయినట్టు అనిపిస్తుంది. దానికి కారణం సెకండాఫ్ లో ఎక్కువ ఎమోషనల్ సన్నివేశాలే రాసుకోవడం. వాటిల్లో కొన్ని బాగా కనెక్ట్ అయినా కొన్ని మాత్రం మనకు క్లాస్ పీకినట్టు అనిపిస్తాయి. ఇకపోతే సినిమాలో హీరో ఒక రన్నర్, అతను నేషనల్ లెవల్ లో జరిగే పోటీలలో పాల్గొంటున్నాడు. అంటే ఆ పోటీలు కాస్త రియలిస్టిక్ గా ఉండాలి, అలాగే ఈ పోటీలు ఆడియన్స్ లో ఆసక్తిని పెంచాలి కానీ ఈ రెండు ఆ రన్నింగ్ ఎపిసోడ్స్ లో మిస్ అయ్యాయి. అలాగే సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లను మీరు ముందే ఊహించేయవచ్చు. అలాగే చాలా చోట్ల సెకండాఫ్ లో అలా మొదలైంది సినిమా ఫ్లేవర్ కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ దొరికితే దానికి మంచి టెక్నీషియన్స్ పనితనం తోడవుతుంది అంటారు. అలాంటి సందర్భమే ఈ సినిమాకి జరిగింది. నటీనటుల్లాగానే మంచి టెక్నికల్ టీం కూడా ఈ సినిమాకి సెట్ అయ్యింది. ముందుగా డైరెక్టర్ రాసుకున్న సన్నివేశాలకి అందమైన విజువల్స్ గా మలచి ప్రేక్షకుల కళ్ళకి నేత్రానందాన్ని కలిగించిన క్రెడిట్ మాత్రం సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ కి దక్కింది. జ్ఞానశేఖర్ అందమైన విజువల్స్ కి గోపి సుందర్ సున్నితమైన, వినసొంపైన సంగీతాన్ని అందించి హీరో – హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీకి ప్రాణం పోసాడు. పాటలు కూడా చాలా బాగున్నాయి. వీరిద్దరికీ సమానంగా సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ ఉన్నాయి. ఆయన రాసిన ప్రతి పదంలోనూ ఓ అర్థం, పరమార్ధం ఉంది. మచ్చుకి ఒకటి రెండు చెబుతా.. ‘ఓడించాలి అనుకునే వాడు ఎప్పుడూ వెనకే ఉంటాడు, గెలుపే లక్ష్యంగా సాగేవాడు ముందుంటాడు, బిడ్డ ఆకలి తీరాకే అమ్మకి ఆకలి మొదవుతుంది’. సాయి మాధవ్ డైలాగ్స్ లేకుండా ఈ లవ్ స్టొరీ చూడటం కష్టమే సుమీ.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది కానీ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ లెంగ్త్ ని కట్ చేసి ఉండాలి.

ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి రెండవ ప్రయత్నం చేసిన క్రాంతి మాధవ్ కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసాడు. కథ – పాత హిందూ ముస్లీం ప్రేమకథే కొత్త అని చెప్పుకునే పాయింట్ ఏమీ లేదు. కథనం – లెంగ్త్ ఎక్కువ అవ్వడం వలన కథనం సాగదీసినట్టు ఉంటుంది. దర్శకత్వం – నటీనటుల నుంచి నటనని రాబట్టుకోవడంలో, కథలో లవ్ మేజిక్ ని ప్రేక్షకులకి కనెక్ట్ చెయ్యడంలో మాత్రం క్రాంతి మాధవ్ సక్సెస్ అయ్యాడు. ఈ ఒక్క దానివల్ల కథ పాతది అయినా పెద్దగా తెలియదు. ఇక కెఎ వల్లభ నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి. అందుకే ఈ సినిమా ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ చూస్తున్నాం అనే ఫీలింగ్ ని మీకు కలుగ జేస్తుంది.

తీర్పు :

శర్వానంద్ – నిత్యా మీనన్ జంటగా నటించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా మీ మనసుకి నచ్చే ఓ ఫీల్ గుడ్ లవ్ స్టొరీ. ఈ సింపుల్ లవ్ స్టొరీలోని ఫీల్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో క్రాంతి మాధవ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ ఈ సినిమా మరీ క్లాస్ గా ఉండడం వలన ఎక్కువగా మల్టీ ప్లెక్స్ మరియు ఎ సెంటర్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బి,సి మెచ్చే రెగ్యులర్ ఫార్మాట్ కామెడీ, స్టొరీ ఇందులో లేకపోవడం వలన వాళ్ళకి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. శర్వానంద్ – నిత్యా మీనన్ కెమిస్ట్రీ, సాయి మాధవ్ డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్స్ అయితే పాత కథ, స్లోగా సాగే కథనం చెప్పదగిన మైనస్ పాయింట్స్. సినిమా నిదానంగా ఉన్నా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ కాబట్టి ఈ సినిమాని మీరు హ్యాపీగా చూడొచ్చు..

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు