సమీక్ష : నీజతగా నేనుండాలి – మ్యూజికల్ లవ్ స్టొరీ.!

సమీక్ష : నీజతగా నేనుండాలి – మ్యూజికల్ లవ్ స్టొరీ.!

Published on Aug 23, 2014 1:00 PM IST
nee-jathaga-nenundali-revie విడుదల తేదీ : 22 ఆగష్టు 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : జయ రవీంద్ర
నిర్మాత : బండ్ల గణేష్
సంగీతం : మిథూన్ – జీత్ గంగూలీ – అంకిత్ తివారి
నటీనటులు : సచిన్ జోషి, నజియా హుస్సేన్…

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మాణ సారధ్యంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఆషికి 2’ సినిమాని తెలుగులో ‘నీజతగా నేనుండాలి’ టైటిల్ తో రీమేక్ చేసారు. ‘మౌనమేలనోయి’, ‘ఓరేయ్ పండు’ ఫేం సచిన్ జోషి హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా నజియా హుస్సేన్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. ‘బంపర్ ఆఫర్’ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న జయ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ లవ్ స్టొరీ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

రాఘవ్ జయరాం అలియాస్ ఆర్.జె(సచిన్ జోషి) ఒకప్పుడు ఇండియాలోనే ది బెస్ట్ సింగర్.. కానీ తను తాగుడుకి బానిస అవడంవల్ల తన స్టార్డం రోజు రోజుకీ పడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో రాఘవ్ ఓ బార్ లో పాటలు పాడుతున్న గాయత్రి నందన(నజియా హుస్సేన్) ని చూస్తాడు. గాయత్రి వాయిస్ లో ఓ మేజిక్ ఉందని రాఘవ్ గుర్తిస్తాడు. దాంతో రాఘవ్ గాయత్రిని ఇండియాలోనే టాప్ సింగర్ చేయాలనుకుంటాడు..

రాఘవ్ అనుకున్నట్టుగానే కొద్ది రోజులకి గాయత్రి ఫేమస్ సింగర్ అవుతుంది. ఈ జర్నీలో రాఘవ్ – గాయత్రి ప్రేమలో పడతారు. ఇదంతా జరుగుతున్నా రాఘవ్ మాత్రం రోజురోజుకీ తాగుడుకి మరింత బానిస అయిపోతుంటాడు. ఇలా రాఘవ్ మందుకు బానిస అవడం వల్ల తన లైఫ్ లో ఏం కోల్పోయాడు.? అసలెందుకు తాగుడుకి బానిస అయిపోయాడు.? గాయత్రి రాఘవ్ ని తాగుడు ప్రపంచం నుంచి బయటకు తీసుకురావడానికి ఏమేమి చేసింది.? చివరికి రాఘవ్ ఏమయ్యాడు? అనేది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా కాబట్టి కథలో పెద్దగా మార్పులు లేదు.. కావున కథ అనేది ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్.. కథ తర్వాత ముందుగా చెప్పుకోవాల్సింది హీరో సచిన్ జోషి గురించి.. మందుకు బానిస అయిపోయిన స్టార్ సింగర్ పాత్రలో సచిన్ నటన బాగుంది. ముఖ్యంగా కొన్ని డిప్రెషన్ సీన్స్ చాలా బాగా చేసాడు. సంగీతం చుట్టూ తిరిగే ఈ కథలో పాటల్లో, డైలాగ్ డెలివరీలో అతని లిప్ సింక్ బాగా కుదిరింది. తన గత సినిమాలతో పోల్చుకుంటే నటనలో ఎంతో మెచ్యూరిటీ కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా సచిన్ కి హేమచంద్ర ఇచ్చిన వాయిస్ బాగా సెట్ అయ్యింది.

ఇక హీరోయిన్ గా పరిచయమైన నజియా హుస్సేన్ గురించి చెబుతా.. ఇదొక మ్యూజికల్ సినిమా, అంటే ఇందులో డైలాగ్స్ కంటే ఎక్కువగా పాటలకి, ఎక్స్ ప్రెషన్స్ కి ప్రాధాన్యం ఉంటుంది. నజియా ముంబై భామ అయినా పాటల్లో మాత్రం లిప్ సింక్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంది. కానీ ఎక్స్ ప్రెషన్స్ మిస్ అయ్యాయి. ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ లో మాత్రం బాగా చేసింది. నటిగా నజియా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్య పాత్రలు పోషించిన శశాంక్, రావు రమేష్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసాడు.

సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ కాస్త వేగంగా ఉంటుంది. వీటన్నిటి తర్వాత చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి.. మిథూన్ – జీత్ గంగూలీ – అంకిత్ తివారి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. టెక్నికల్ గా చాలా గ్రాండ్ గా ఉండేలా సినిమాలు తీసే బండ్ల గణేష్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉండడం ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్.

మైనస్ పాయింట్స్ :

లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ విత్ మ్యూజిక్ టచ్ అనగానే అందరూ సినిమా స్లోగా ఉంటుంది అనుకుంటారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమా స్లోగా సాగుతుంది. డైరెక్టర్ ఎక్కడా ఎమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లాలని ప్రయత్నించలేదు. అలా ప్రయత్నించి ఉంటే మూవీ ఇంకాస్త బెటర్ గా ఉండేది. అలా చేయని కారణంగా కొన్ని చోట్ల ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ ఇంకా స్లోగా అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే పరంగా ట్విస్ట్ లు ఏమీ ఉండవు అందరూ ఊహించినదే జరుగుతుంది. ఒక వేల ఊహించని వాళ్లున్నా వారి కోసం సెకండాఫ్ లో ఏమి చెప్పబోతున్నాను అనేది డైరెక్టర్ ఇంటర్వెల్ బ్లాక్ లో క్లియర్ గా చెప్పేసాడు.

బాలీవుడ్ లో ‘ఆషికి 2’ బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం ఆడియన్స్ ని కట్టి పడేసే ఎమోషన్స్, హార్ట్ టచింగ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ.. కానీ మన తెలుగు రీమేక్ లో అవే మిస్ అయ్యాయి. ఎమోషన్స్ ఎక్కడా ఎలివేట్ అవ్వలేదు, అలాగే ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా ఎక్కడా హీరో – హీరోయిన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కోరుకునే ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చదు, ఎందుకంటే ఇందులో జీరో ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరూ ఎంత వద్దనుకున్నా ఈ సినిమాని చూస్తున్నప్పుడు హిందీ మూవీతో పోల్చుకుంటారు. అలా పోల్చితే ఈ సినిమా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. చివరి మైనస్ పాయింట్ దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకు నచ్చని పాయింట్ ని ఈ మూవీ క్లైమాక్స్ గా ఎంచుకోవడం..

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా మెచ్చుకోవాల్సింది అంటే అది కచ్చితంగా మ్యూజిక్ గురించే.. హిందీలో మిథూన్ – జీత్ గంగూలీ – అంకిత్ తివారి కంపోజ్ చేసిన ట్యూన్స్ ని యాస్ ఇట్ ఈజ్ గా తెలుగులో పెట్టేసినా ఆ ట్యూన్స్ కి చంద్రబోస్ వినసొంపైన సాహిత్యం అందించడం వల్ల సాంగ్స్ ఇక్కడ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఇకపోతే వసంత అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి లొకేషన్ ని చాలా రిచ్ గా, చాలా క్లాస్ గా చూపించాడు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బండ్ల గణేష్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించే.. ఆయన ఎప్పుడూ ఖర్చుకి వెనకాడకుండా క్వాలిటీ సినిమాలను అందించాలనుకుంటారు. ఎప్పటిలానే ఆయన పెట్టిన ప్రతి రూపాయి సూపర్బ్ విజువల్స్ గా మనకి స్క్రీన్ పై కనిపిస్తాయి.

ఇక కథ – స్క్రీన్ ప్లేని హిందీ సినిమా నుంచే తీసుకున్నారు కావున కథ గురించి చెప్పడానికి యీమీ లేదు.. కానీ తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే ని కాస్త మార్చుకొని ఉంటే బాగుండేది. ఇక డైరెక్టర్ జయ రవీంద్ర మొదట మాస్ సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ కథ తన మొదటి సినిమాకి పూర్తి భిన్నంగా ఉంటుంది. నటీనటుల నుంచి మంచి నటనని రాబట్టుకోగలిగినా, ఒరిజినల్ కంటెంట్ లో ఉన్న ఎమోషన్స్ ని మాత్రం తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో ఫెయిల్ అయ్యాడు. ఎం.ఆర్ వర్మ ఉన్నంతలో ఎడిటింగ్ ఇంకాస్త బాగుంటే సినిమాకి హెల్ప్ అయ్యేది.

తీర్పు :

హిందీ సూపర్ హిట్ మూవీ ‘ఆషికి 2’ కి రీమేక్ గా వచ్చిన ‘నీ జతగా నేనుండాలి’ సినిమా వినసొంపైన సంగీతంతో సాగిపోయే మ్యూజికల్ లవ్ స్టొరీ. ఈ సినిమా మల్టీ ప్లెక్స్ మరియు ఎ సెంటర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. బాలీవుడ్ ఆషికి 2 తో పోల్చుకుండా చూడగలిగితే మీకు కాస్త నచ్చే ఛాన్స్ ఉంది. మ్యూజిక్, నటీనటుల పెర్ఫార్మన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే కంటెంట్ లోని ఎమోషన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోవడం, స్లో నేరేషన్, నో ఎంటర్టైన్మెంట్ చెప్పదగిన మైనస్ పాయింట్స్.. సూపర్ హిట్ మూవీకి రీమేక్ సినిమా కావడం, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మార్క్ మరియు బాక్స్ ఆఫీసు వద్ద వేరే సినిమా లేకపోవడం వలన ఈ మ్యూజికల్ లవ్ స్టొరీకి మొదటి వారం మంచి ఓపెనింగ్స్ రాబట్టుకునే అవకాశం ఉంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు