సమీక్ష : ఓ మల్లి – మంచి ప్రయత్నమే కానీ..!

సమీక్ష : ఓ మల్లి – మంచి ప్రయత్నమే కానీ..!

Published on Apr 16, 2016 1:53 AM IST
O Malli review

విడుదల తేదీ : ఏప్రిల్ 15, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : బి. రమ్యశ్రీ

నిర్మాత : బి. యస్. ప్రశాంత్‌ కుమార్

సంగీతం : సునీల్ కశ్యప్, బి.ఎస్.కృష్ణమూర్తి

నటీనటులు :రమ్యశ్రీ, ఆకాష్, రఘుబాబు..

దాదాపు రెండు సంవత్సరాల క్రితమే సినిమా పూర్తి అయినా విడుదల వాయిదా పడుతూ వచ్చిన సినిమా ’ఓ మల్లి’. నటిగా, ఐటం గాళ్‌గా, వ్యాంప్‌ పాత్రల్లో నటిస్తూ దాదాపు దశాబ్దం పైగా సినిమాల్లో ఉన్న రమ్యశ్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం..

కథ :

ఈ కథ మొత్తం మల్లి (రమ్యశ్రీ) అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇక కథలోకి వెళితే.. అరకులోయలోని ఓ గూడెంలో ఉండే మల్లి తండ్రి పెంపకంలో పెరుగుతుంది. తండ్రి నారిగాడు (యల్. బి. శ్రీరాం) ఓ తాగుబోతు. అయినా కూతురు అంటే ప్రేమ ఉన్నోడు. తనకి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటాడు. అదే గూడెంలో ఉన్న సింగడు అనే వాడి కన్ను మల్లిపై పడుతుంది. నారిగాడికి బాగా సారా తాగించి తన ఇంటికి పెళ్లి పెత్తనం కోసం వెళతాడు. మత్తు దిగిన నారిగాడు సింగడిని అవమానించి పంపించివేస్తాడు. అవమానంతో అక్కడిని నుండి వెళ్ళిపోయినా సింగడు అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. ఓ సారి మల్లిపై అత్యాచారయత్నం చేయబోగా అందరూ కలిసి పట్టుకుని గూడెంలో పంచాయితీ పెట్టి సింగడికి గుండు గీయించి గూడెం నుంచి వెలివేస్తారు.

కల్తీసారా తాగి నారిగాడు మరణిస్తాడు. మల్లి ఒంటరిదైపోతుంది. మల్లిని చూసిన పక్కనే ఉండే మరో గూడెంకి చెందిన రాములయ్య(రఘబాబు), మల్లిని పెళ్లి చేసుకోవాలనుకుని తన తల్లికి ఇష్టం లేకపోయినా ఒప్పించి గూడెం పెద్దల సహాకారంతో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటాడు. అనుకోకుండా కల్తీసారా త్రాగడంతో రాములయ్యకు పక్షవాతం వచ్చి కాళ్ళు, చేతులు పడిపోవడంతో మల్లి చిన్నచిన్న కొయ్యబొమ్మలు తయారుచేసుకుని తన భర్తను చూసుకుంటుంది. ఆ ప్రయత్నంలోనే రైల్వేటికెట్ కలెక్టర్ అయిన రవి (ఆకాష్) మల్లిని చూస్తాడు. మల్లిని ఇష్టపడతాడు. ఆ తరువాత ఏం జరిగింది? అనేది మిగతా కథ. రవి కారణంగా మల్లి జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది? తనవల్ల అవమానానికి గురైన సింగడు ఏమయ్యాడు? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు అందులో ప్రధాన పాత్ర అయిన మల్లిగా నటించిన బి. రమ్యశ్రీనే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ఇటువంటి కథతో సినిమా చేయడం పూర్తిగా సాహసం అనే చెప్పాలి. మల్లిగా తనని తాను పూర్తిగా మార్చుకుని నటించడంతో పాటు, ఇతర నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో కూడా దర్శకురాలిగా రమ్యశ్రీ మంచి మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు. ఇక సినిమాలోని

మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. మల్లి తండ్రి పాత్రలో నటించిన యల్ బి శ్రీరాం ఉన్నది కొద్దిసేపే అయినా ఆకట్టుకుంటాడు. తరువాత మల్లి భర్తగా నటించిన రఘుబాబు పక్షవాతం వచ్చిన వాడి పాత్రలో మెప్పించాడు. ఆకాష్ ఉన్నంతలో పర్వాలేదు. జయవాణితో సహా మిగతా నటీనటులు తమదైన శైలిలో నటించి అకట్టుకున్నారు. సినిమా పరంగా చూస్తే సెకండాఫ్ బాగుంది. ఈ పార్ట్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

కథ ఎక్కడో చూసినట్టు అనిపించినా కొత్తగా తీయడానికి దర్శకురాలు ప్రయత్నించకపోవడం, అలాగే అక్కడక్కడా వచ్చే కొన్నిసన్నివేశాలు ఇది వరకు ఎప్పుడో చూసినట్లు అనిపించడం మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. కథనంలో అస్సలు ఊపు లేకపోవడం వలన ఊహించిందే జరుగుతోంది అని ప్రేక్షకులు అనుకుంటారు. అలాగే సందర్భం లేకుండా వచ్చే పాటలు చూడటానికి బాగున్నా, అసహనానికి గురిచేస్తాయి.

ఆర్థిక లేమి వలన అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న స్త్రీల గురించి హాస్యంగా చిత్రీకరించడంతో సన్నివేశ ఔచిత్యంతో పాటు, దర్శకురాలు చెప్పాలనుకున్న అంశం కూడా పక్కదారి పట్టింది. అలాగే ఈ సినిమాకి ఇచ్చిన పబ్లిసిటీ వలన ఏదో ఊహించుకుని థియేటర్లలోకి వచ్చే ప్రేక్షకులకు అటువంటి అంశాలు కాకపోవడంతో అసహనానికి గురి అవుతారు. ఇక ఓ ప్రత్యేక కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడం, పబ్లిసిటీని అందుకు విరుద్ధంగా చేయడం లాంటివి ఈ సినిమాకు మైనస్‌గా చెప్పుకోవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా ఈ సినిమాకి బాగా తోడ్పడిన విభాగాలు కొన్ని ఉన్నాయి. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా ఏ సాంకేతిక అంశాల పరంగా సినిమా బాగుంది. ఒక్కొక్కదాని గురించి మాట్లాడుకుంటే.. రమ్యశ్రీ ఎంచుకున్న కథాంశం, దానికి తగ్గ నేపథ్యం చాలా బాగున్నాయి. కానీ పూర్తి కథను రాసుకున్న విధానం మాత్రం చాలా సాధారణంగా ఉంది. కథ సాధారణంగా ఉన్నా ఎక్కడా విసిగించకపోవడం దర్శకురాలు రమ్యశ్రీ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన వాటిల్లో కె.దత్తు సినిమాటోగ్రఫీ బాగుంది. అరకులోయ అందాలను అద్భుతంగా చూపించాడు.

సునీల్ కశ్యప్, బి.ఎస్.కృష్ణమూర్తి అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాలోని చాలా సన్నివేశాలకు ప్రాణం పోసింది. వి. నాగిరెడ్డి ఎడిటింగ్ బావుంది. ఈ సినిమాలో మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కళా దర్శకత్వం గురించి.. కళాదర్శకుడి పనితనం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. సహజత్వానికి దగ్గరగా ఉండేలా ప్రతీ లొకేషన్ కి తీర్చిదిద్దారు. ఇక మాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి… చాలా సాధారణంగా ఉంటూనే హృదయానికి హత్తుకునే విధంగా మాటలు రాశారు. సహజత్వానికి దగ్గరగా భాష, యాసలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆకట్టుకునే అంశం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

స్త్రీ ఆలోచనా విధానంతో, అర్థం చేస్కోవడం, అపార్థం చేసుకోవడం లాంటి అంశాలను ప్రస్తావిస్తూ స్త్రీలను సమాజం ఏ కోణంలో చూస్తుందే చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ‘ఓ మల్లి’. కమర్షియల్ సినిమా పంథాకు దూరంగా, సమాంతర సినిమాలకు దగ్గరగా ఉన్న సినిమా ఇది. రమ్యశ్రీ నటన, చెప్పాలనుకున్న అసలు కథ, ఆకట్టుకునే ఓ ఎమోషనల్ జర్నీ తదితర అంశాలను హైలైట్స్‌గా నింపుకొని వచ్చిన ఈ సినిమాలో పూర్తి కథను ఆకట్టుకునేలా చెప్పలేకపోవడం, సినిమాకు సంబంధం లేని తరహా అంశాలతో ప్రచారం చేయడం, సెకండాఫ్‌లో కథను కాస్త పక్కదారి పట్టించడం లాంటివి మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రమ్యశ్రీ చెప్పాలనుకున్న ప్రధాన అంశం కోసం, రియలిస్టిక్ సినిమాలను బాగా ఇష్టపడివారు ఈ సినిమా చూడొచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు