సమీక్ష : రంగం 2 – మరో ‘రంగం’ అనుకుంటే మోసపోయినట్టే!

సమీక్ష : రంగం 2 – మరో ‘రంగం’ అనుకుంటే మోసపోయినట్టే!

Published on Nov 26, 2016 3:45 PM IST
Jayammu Nischayammu Raa review

విడుదల తేదీ : నవంబర్ 25, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : రవి కే చంద్రన్

నిర్మాత : ఏ.ఎన్.బాలాజీ

సంగీతం : హరీస్ జయరాజ్

నటీనటులు : జీవా, తులసి నాయర్..

తెలుగులో ఘన విజయం సాధించిన డబ్బింగ్ సినిమా ‘రంగం’తో పాటు పలు ఇతర డబ్బింగ్ సినిమాలతో ఇక్కడా మంచి క్రేజ్ తెచ్చుకున్న జీవా నటించిన ‘యాన్’ అనే సినిమాను తెలుగులో ‘రంగం 2’ పేరుతో డబ్ చేశారు. తమిళంలో 2014లో విడుదలైన ఈ సినిమా తెలుగులో ఇప్పటికి విడుదలయింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి.కే చంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

చందు (జీవా).. చదువైపోయి అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండే ఓ యువకుడు. తల్లీ, తండ్రి లేని అతడు ముంబైలో తన బామ్మతో కలిసి జీవిస్తూంటాడు. ముంబైలో మాలిక్ షా అనే గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసే సమయంలో చందుకి, శ్రీల (తులసి నాయర్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అయితే ఏ పనీ లేని చందు అంటే శ్రీల తండ్రి (నాజర్)కి మాత్రం నచ్చదు. దీంతో వీరిద్దరి ప్రేమకు అడ్డు చెబుతాడు.

దీంతో ఎలాగైనా తన ప్రేమను గెలిపించుకోవాలని బజిలిస్తాన్ అనే అరబ్ దేశంలోని ప్రాంతంలో చందు ఉద్యోగం సంపాదిస్తాడు. బజిలిస్తాన్‌లో దిగగానే తనకు తెలీకుండానే ఓ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ డ్రగ్స్ కేసుకు కారణం ఏంటి? డ్రగ్స్ సరఫరా చేస్తే ఉరి తీసే ప్రాంతంలో చందు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నదే మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్ :

స్టోరీలైన్ వినడానికి చాలా బాగుంది. ఒక సాధారణ యువకుడు ఎవ్వరూ తెలియని దేశంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, దాన్నుంచి బయటపడడం అన్న కాన్సెప్ట్‌ను చెప్పాలన్న ఆలోచన బాగానే కనిపించింది. ఓపెనింగ్ సీక్వెన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అదే సీన్‌లో హీరో, హీరోయిన్లు కలుసుకోవడం కూడా బాగుంది. టైమ్‌స్లైస్ టెక్నిక్‌తో వచ్చే సన్నివేశాలన్నింటినీ బాగా తెరకెక్కించారు. ఆ సన్నివేశాలన్నీ మంచి ఫీల్ ఇచ్చాయి.

జీవా తన పరిధిమేర బాగానే నటించాడు. తులసి నాయర్ ఇటు లుక్స్ పరంగా బాగుండడమే కాక, మంచి నటన ప్రదర్శించింది. నాజర్, జయప్రకాష్ తమ తమ పాత్రల్లో బాగానే నటించారు. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్‌లో అక్కడక్కడా వచ్చే కామెడీ బాగుంది. కథను మలుపు తిప్పే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఒక్క చిన్న స్టోరీలైన్ బాగుందన్నది తప్పిస్తే, ఒక సినిమాకు సరిపడే స్థాయి కథనం లేకపోవడమే ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్. ఫస్టాఫ్‌నంతా ఇంటర్వెల్ ట్విస్ట్ వరకూ లాక్కొచ్చి, సెకండాఫ్‌నంతా క్లైమాక్స్ వరకూ లాక్కొచ్చి ఈమధ్యలో సన్నివేశాలను బోరింగ్‌గా నడిపించారు. కథలో పెద్దగా ఎమోషన్ పండించే బలమైన సన్నివేశాలేవీ లేకపోవడంతో సినిమా అంతా అలా నడుస్తుందంతే అన్నట్లు తోచింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో లాజిక్ అన్నదే లేకపోవడం ఏమాత్రం ఆకట్టుకోలేదు.

ఇక హారీస్ జైరాజ్ అందించిన పాటలన్నీ వినడానికి అస్సలు బాగోకపోగా, సినిమాలో అవి వచ్చే సందర్భాలు కూడా విసుగు తెప్పించాయి. దీంతో అద్భుతమైన లొకేషన్స్‌లో తీసిన పాటలు కూడా ఎందుకూ పనికి రాకుండా తయారయ్యాయి. హీరో, హీరోయిన్ల మధ్యన ప్రేమ పుట్టే సన్నివేశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రెండున్నర గంటల పాటున్న సినిమా నిడివి కూడా ఓ మైనస్‌గానే చెప్పుకోవాలి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, సినిమాటోగ్రాఫర్ మనుష్ నందన్ పనితనాన్ని సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఆయన అందించిన విజువల్స్ వల్లే కథలో బలంలేని సినిమా కాస్త చూడగలిగేలా ఉందనిపించింది. సెకండాఫ్‌లో సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. హరీస్ జైరాజ్ అందించిన్ పాటలు, బ్యాంక్‌గ్రౌండ్ స్కోర్.. రెండూ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ స్టైల్ బాగున్నా, లెంగ్త్, పాటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కు వంక పెట్టడానికి లేదు.

సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయి సంపాదించుకున్న రవి కే చంద్రన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ఒక మంచి కథాంశాన్నే ఎంచుకున్న ఆయన, దాన్ని పూర్తి స్థాయి సినిమా కథగా మార్చడంలో తేలిపోవడంతో రచయితగా ఆయన పనితనం నిరాశపరిచింది. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ అన్నదే లేకుండా, రెండున్నర గంటల పాటు ఇలా వచ్చి పోయే సన్నివేశాలను రాసుకొని నిరుత్సాహపరిచాడు. దర్శకుడిగా మాత్రం మేకింగ్ స్టైల్‌లో రవి చూపిన కొత్తదనం మెచ్చుకోదగ్గది. అయితే బలమైన సన్నివేశాలు లేనప్పుడు అవన్నీ వృథా అయిపోయాయి.

తీర్పు :

హీరో జీవా పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చే సినిమా ‘రంగం’. తమిళంతో పాటు, ఇక్కడా అతడికి హీరోగా మంచి గుర్తింపు తెచ్చిన ఈ సినిమా పేరును వాడుకొని సంబంధం లేకున్నా, ‘రంగం 2’ అంటూ ‘యాన్’ అనే డబ్బింగ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కథాంశం వినడానికి బాగుండడం, అదిరిపోయే ప్రొడక్షన్, మేకింగ్ వ్యాల్యూస్ లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మిగతా అంశాలేవీ లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే, ‘రంగం’కి సీక్వెల్ అయి ఉంటుందని ఈ సినిమాకు వస్తే మోసపోయినట్టే; అలా కాదని మామూలు సినిమాగా చూసినా నిరుత్సాహం తప్పదు!

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు