సమీక్ష : రథావరం – ఆరంభం బాగుంది కానీ..

సమీక్ష : రథావరం – ఆరంభం బాగుంది కానీ..

Published on Sep 1, 2017 7:00 PM IST
Rathavaram movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 1, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : చంద్రశేఖర్ బండియప్ప

నిర్మాత : మంజునాథ్. ఎస్

సంగీతం : ధర్మ విష్

నటీనటులు : శ్రీమురళి, రచిత రామ్

రథావరం (శ్రీమురళి) అనే రౌడీ తనను చేరదీసిన మణికంఠన్ అనే రాజకీయనాయకుడి కోసం గుడ్డిగా ఏమైనా చేస్తుంటాడు. మణికంఠన్ కూడా తన స్వార్థం కోసం రథావరం చేత ఎన్నో రకాల నేరాలను, హత్యలను చేయిస్తాడు. ఒకానొక సందర్బంలో మణికంఠన్ తాను ముఖ్యమంత్రి అవడం కోసం ఒక ముఖ్యమైన పని చేయమని రథావరంను అడుగుతాడు.

రథావరం కూడా ఆ పనిచేయడానికి ఒప్పుకుని, రంగంలోకి దిగుతాడు. కానీ ఆ పని చేసేప్పుడు రథావరానికి తాను చేస్తోంది తప్పని అర్థమై, మణికంఠన్ కుఎదురు ఎదురుతిరుగుతాడు. దాంతో మణికంఠన్ కోపంతో రథావరాన్ని చంపాలనుకుంటాడు. అసలు మణికంఠన్ కోసం ఎన్నో తప్పుల్ని చేసిన రథావరానికి కళ్ళు తెరిపించిన సంఘటన ఏమిటి ? మణికంఠన్ రథావరానికి అప్పజెప్పిన పని ఏంటి ? వీరిద్దరి మధ్య పోరులో చివరికి ఎవరు గెలిచారు ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో అన్నిటికన్నా బాగా ఆకట్టుకునే అంశం హీరోగా చేసిన శ్రీమురళి పెర్ఫార్మెన్స్. ఒక రౌడీగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. రఫ్ లుక్ తో, ఎవ్వరికీ భయపడని యాటిట్యూడ్ తో కనిపిస్తూ అప్పుడప్పుడు తనలోని మంచి తనాన్ని కూడా చూపే వ్యక్తిగా శ్రీమురళి బాగానే నటించాడు. అలాగే తాను చేస్తోంది తప్పని గ్రహించి ప్రశ్చాత్తాపపడే సన్నివేశాల్లో కూడా శ్రీమురళి మెప్పించాడు.

ఇక కథలో విలన్ మణికంఠన్ తాను సిఎం అవడం కోసం హీరోకి అప్పజెప్పే పని కూడా కొంచెం ఆసక్తికరంగానే ఉంది. దీంతో సినిమా చూస్తున్నప్పుడు ఆ పనిని హీరో ఎలా చేస్తాడు అనే కుతూహలం కలిగింది. దర్శకుడు చంద్రశేఖర్ కథను మంగళముఖి సముదాయం (ట్రాన్స్ జెండర్ సమూహం) చుట్టూ అల్లిన విధానం కొద్దిగా మెప్పించింది. ఇక హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఆరంభంలో కొద్దిగా పర్వాలేదనిపించింది.

మైనస్ పాయింట్స్ :

కథ కొద్దిగా ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ చాలా వరకు తెలుగు నేటివిటీకి దూరంగా ఉండటంతో సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది. దర్శకుడు విలన్ చెప్పిన పనిని హీరో ఎలా చేస్తాడో చూడాలనే ఆసక్తిని అయితే కలిగించగలిగాడు కానీ ఆ తర్వాత హీరో ఆ పనిని చేయడాన్ని ఆసక్తికరంగా చూపడంలో మాత్రం తేలిపోయాడు. ఇక కథను ట్రాన్స్ జెండర్ ఆధారంగా రాసుకోవడం అనే అంశం ఆరంభంలో కొద్దిగా బాగానే ఉన్నా కథనంలో మాత్రం వాళ్లను కేవలం విజువల్స్ కే పరిమితం చేసి కథనంలో ఇన్వాల్వ్ చేయకపోవడంతో సెకండాఫ్ మొత్తం నీరుగారిపోయింది.

అంతేగాక లవ్ ట్రాక్ ఆరంభంలో కొద్దిగా పర్లేదు అనిపించినా ఆ తర్వాత తర్వాత తలనొప్పి ఫీలింగ్ కలిగించింది. ఇక సెకండాఫ్ చివర్లో కథ అసలు ట్రాక్ నుండి పూర్తిగా పక్కదారి పట్టి స్నేహం అనే కొత్త మలుపు తీసుకోవడంతో సినిమా చూడాలనే ఆసక్తి చాలా వరకు ఎగిరిపోయింది. వీటికి తోడు మధ్యలో వచ్చే డబ్బింగ్ పాటలు అస్సలు బాగోలేవు. సంగీతం కూడా లో క్వాలిటీతో ఉండటంతో మరింత నిరుత్సాహం కలిగింది. కన్నడలో 2015లో రిలీజైన సినిమాను ఏమాత్రం డెవలెప్మెంట్ లేకుండా ఇప్పుడు తెలుగులోకి యధావిథిగా డబ్ చేయడంతో క్వాలిటీ చాలావరకు మిస్సై చూడటానికి ఇబ్బంది కలిగింది. పాత్రల డబ్బింగ్ కూడా సరిగా కుదరలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప రాసిన కథ కథనాలు సినిమా ఆరంభంలో కొద్దిగా బాగానే ఉన్నా ఒక 40 నిముషాల తర్వాత పూర్తిగా నిరుత్సాహంలోకి తీసుకెళ్లిపోయాయి. కథలో ప్రేక్షకుడు ముఖ్యమైంది అనుకున్న ట్రాన్స్ జెండర్ అంశాన్ని సినిమా చివర్లో వదిలేసి వేరే అంశాలను పట్టుకోవడం ఇక్కడ పెద్ద ఫైల్యూర్.

ధర్మ విష్ రెండేళ్ల క్రితం అందించిన సంగీతం ఇప్పుడు వింటుంటే అస్సలు బాగోలేదు. వాటికి తోడు డబ్బింగ్ పాటలు మరీ మరీ ఇబ్బంది పెట్టాయి. సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా చూడదగిన విధంగా లేదు. శ్రీకాంత్, శివ శంకర్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు మూడేళ్ళ క్రితం నాటివి కావడంతో ఏమంత గొప్పస్థాయిలో అనిపించలేదు.

తీర్పు :

2015 లో కన్నడలో మంచి హిట్టై ఇప్పుడు తెలుగులోకి అనువాదంగా వచ్చిన ‘రథావరం’ చిత్రంలో కొద్దిగా కథ, హీరో పాత్ర, నటన, కొంత ఫస్టాఫ్ కథనం బాగున్నాయని అనిపించినా అసలు కథ సైడ్ ట్రాక్ తీసుకోవడం, ప్రేక్షకుడు ఆశించిన అంశాన్ని మధ్యలోనే వదిలేయడం, సాగదీయబడిన లవ్ ట్రాక్, అంతగా ఆకట్టుకోని సెకండాఫ్ కథనం, టెక్నికల్ గా సినిమాలో క్వాలిటీ లేకపోవడం నిరుత్సాహానికి గురిచేసే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే ఈ సినిమా ఆరంభం బాగున్నా ఆ ఆతర్వాత అస్సలు ఆకట్టుకోలేదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు