సమీక్ష : శత్రువు – కాలం చెల్లిన కథ

సమీక్ష : శత్రువు – కాలం చెల్లిన కథ

Published on Jan 24, 2013 11:00 PM IST
Shatruvu1 విడుదల తేదీ : 24 జనవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
దర్శకుడు : ఎన్.ఎస్ ఆర్ ప్రసాద్
నిర్మాత : వి.ఎస్ రామిరెడ్డి
సంగీతం : గణ
నటీనటులు : శ్రీ కాంత్, అక్ష

ఫామిలీ స్టార్, ఎమోషనల్ స్టార్ ఇలా సినిమాకో బిరుదు పెట్టుకుంటూ వస్తున్న శ్రీకాంత్ 20 రోజుల కిందట సేవకుడు అని వచ్చి నెల తిరగకుండానే శత్రువు అని మరో సినిమాతో రెడీ అయిపోయాడు. మూడు నెలల్లో అతను నటించిన నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. ఇక శత్రువు విషయానికి వస్తే శ్రీకాంత్ జోడీగా (?) అక్ష నటించిన ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. మరి ఈ శత్రువు ఎవరికి శత్రువో ఒకసారి చూద్దాం.

కథ :

హైదరాబాద్ మేయర్ అరవింద్ (రెహమాన్) భార్య చనిపోవడంతో తల్లి లేని కూతురు అని అనూష (అక్ష) ని అల్లారు ముద్దుగా పెంచుతాడు. అనూష,  పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంది. అక్కడే ఎంబీఏ చేస్తూ టెన్నిస్ నేర్చుకుంటున్న కార్తీక్ (?) మీద మనసు పడుతుంది. టెన్నిస్ ప్లేయర్ కావాలనుకున్న కార్తీక్ గోల్ నెరవేర్చడానికి తన తండ్రి దగ్గరికి పంపిస్తుంది. ఇక్కడ కథ అనుకోని మలుపులు తిరగడంతో అనూష ఇండియాకి వచ్చి కిరాయి రౌడీ శంకర్ (శ్రీకాంత్) సహాయం కోరుతుంది. అనూషకి శంకర్ సహాయం చేసాడా? ఇండియాకి వచ్చిన కార్తీక్ ఏమయ్యాడు? అసలు అనూషకి వచ్చిన సమస్య ఏమిటి అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

శ్రీకాంత్ నటనలో అస్సలు మార్పు లేకుండా రొటీన్ గా చేసుకుంటూ వెళ్ళాడు. రఘు బాబు, దువ్వాసి మోహన్ కామెడీ నవ్వించకపొయినా ఇబ్బంది మాత్రం పెట్టలేదు. ఇంతకు మించి ఇంక చెప్పుకోవడానికి ఏమీ లేవు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు సినిమాని లేడీ ఓరియెంటెడ్ సినిమా అనుకుని కథ రాసుకుని అందులో శంకర్(హీరో) పాత్రని ఇరికించాడు. అసలు శ్రీకాంత్ పాత్రకి ఏ మాత్రం ప్రాధాన్యత లేకపోవడం భాధాకరం. సాధారణంగా ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రని కేవలం పాటలకి, స్కిన్ షో కోసం వాడుకున్నట్లు శంకర్ పాత్రని 4 పాటల, 4 ఫైట్స్ కోసం మాత్రమే పెట్టారు. అంతకు మించి ఆ పాత్రకి ప్రాధాన్యత లేదు. పోనీ అక్ష ఏమైనా చేసిందా అంటే సత్యం, ధర్మం గెలిచి అధర్మం ఓడుతుంది అంటూ కాలం చెల్లిన డైలాగులు చెబుతూ సహనాన్ని పరీక్షించింది. ఇంక విలన్ పాత్ర వేసిన రెహమాన్ విషయానికి వస్తే ఆయన ఇబ్బంది పెట్ట లేదు కానీ ఆయనకి రాసిన డైలాగులు, సన్నివేశాలు భయపెట్టాయి. “భయం వాసన చూసే శక్తి నాకుంది, అది నీ కళ్ళల్లో చూసాను”, “నన్ను చూస్తే రాక్షసులే వణుకుతారు నువ్వెంత” ఇలాంటి డైలాగులు రాసి నవ్వుకునేలా చేసారు.

హీరోయిన్ స్కిన్ షో చాలదన్నట్లు లేడీ ఏసీపీ ఆఫీసర్ తో స్కిన్ షో చేయించడం వెనక దర్శకుడి ఉద్దేశం ఏమిటో ఆయనకే తెలియాలి. డాక్టర్ తమ హాస్పిటల్ జాయిన్ అయిన పేషెంట్స్ పరిస్థితి ఎలా ఉందని అడిగితే అతను చెప్పే సమాధానం “ఇంక వారికి తద్దినం పెట్టుకోవడమే ఆలస్యం”. పోలీస్ ఆఫీసర్ అర్ధ రాత్రి తాగి అనూషతో అసభ్యంగా ప్రవర్తించే సన్నివేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ అవుట్ డేటెడ్ అయితే కథనం ఇంకా దారుణం. కథని పక్కదారి పట్టించి అనవసరమైన కమర్షియల్ అంశాల జోలికి పోయాడు. కమర్షియల్ సినిమా అంటే ఇవి కచ్చితంగా ఉండాలనే భావనలో ఉన్నాడు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గణ సంగీతం అయితే ఒక్క పాట కూడా గుర్తు లేదు.

తీర్పు :

శ్రీకాంత్ ఇకనైనా ఇలాంటి ఇంపార్టెన్స్ లేని అవుట్ డేటెడ్ సినిమాలు మానేసి తనకు బాగా కలిసి వచ్చిన ఫామిలీ, కామెడీ సినిమాలు చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది. 20 ఏళ్ళ కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా తీసిన శత్రువు మనకి శత్రువులా అయ్యాడు

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

అశోక్ రెడ్డి .ఎమ్

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు