సమీక్ష : సాహసం సేయరా డింభకా – నిరుత్సాహపరిచే హర్రర్ మూవీ.!

సమీక్ష : సాహసం సేయరా డింభకా – నిరుత్సాహపరిచే హర్రర్ మూవీ.!

Published on Jul 25, 2015 6:20 PM IST
Sahasam-Cheyara-Dimbaka

విడుదల తేదీ : 24 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : తిరుమలశెట్టి కిరణ్

నిర్మాత : ఎం.ఎస్ రెడ్డి

సంగీతం : శ్రీ వసంత్

నటీనటులు : శ్రీ, హమీద, సమత, షకలక శంకర్..

‘ఈ రోజుల్లో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీ హీరోగా నటించిన సినిమా ‘సాహసం సేయరా డింభకా’. సమత, హమీద హీరోయిన్స్ గా పరిచయం అయిన ఈ సినిమాలో జబర్దస్త్ ఫేం షకలక శంకర్ ఓ ముఖ్య పాత్రలో పోషించాడు. తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎంఎస్ రెడ్డి నిర్మించాడు. కాస్త గ్యాప్ తీసుకొని శ్రీ చేసిన ఈ హర్రర్ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :
బాలరాజు(శ్రీ) స్వతహాగా చాలా అమాయకుడు, పిరికివాడు మరియు భయస్తుడు. తను ఏ పని చేయలన్నా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రాంబాబు(షకలక శంకర్)ని అడిగి చేస్తుంటాడు. బలరాజుని తన మేనమామ కూతురైన కృష్ణవేణి (హమీద) ప్రేమిస్తుంటుంది. ఉద్యోగంలేని బాలరాజుకి తన మామ ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం వేయిస్తాడు. భయస్తుడైన బాలరాజు రోజూ రాత్రి ఫారెస్ట్ కి వెళ్లి రావాలి. అలా ఓ రోజు బాలరాజుకి అడవిలో వాసంతి(సమత) కనిపిస్తుంది. తన అడవి జాతి పిల్లనని, తను అడవిలోనే ఉంటుందని చెబుతుంది. తనతో బాలరాజుకి పరిచయం ఏర్పడుతుంది. రోజువారి వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.

వాసంతి తనని పెళ్లి చేసుకోమని అడిగితే రాంబాబు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. అప్పుడే మన రాంబాబు ఎంటర్ అవుతాడు. అప్పుడే కథలో ఓ ట్విస్ట్. అదేమిటంటే బాలరాజుని ఇష్టపడుతున్న వాసంతి అండ్ ఫ్యామిలీ మొత్తం ఆత్మలు. అక్కడి నుంచి ఆ ఆత్మల నుంచి తప్పించుకోవడం కోసం బాలరాజు అండ్ రాంబాబు ఏం చేసారు.? ఆ ఇద్దరికీ ఆత్మలు ఎలాంటి నరకాన్ని చూపాయి.? అసలు ఈ ఆత్మల కథ ఏంటి.? ఎందుకు వాసంతి బాలరాజునే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.? మరి బాలరాజుని ప్రేమించిన కృష్ణవేణి ఏమైంది.? అనే అంశాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

సినిమా మొదట్లో పాతాళభైరవి సినిమాలోని కొన్ని ఎన్.టి.ఆర్ సీన్స్ చూపడం ఫస్ట్ ప్లస్. ఇక సినిమా విషయానికి వస్తే హర్రర్ కామెడీ థ్రిల్లర్ అయిన ‘సాహసం సేయరా డింభకా’ సినిమాలో హర్రర్, థ్రిల్స్ అనే వాటిని పక్కన పెడితే కామెడీ మాత్రం ఓ మోస్తరుగా ఉందని చెప్పవచ్చు. ఆ కామెడీ చేసింది మరెవరో కాదు జబర్దస్త్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన షకలక శంకర్. సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చే షకలక శంకర్ చాలా వరకూ ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. తను చేసిన అన్ని సీన్స్ నవ్వించకపోయినా ఎక్కువ భాగం నవ్వించాయి. షకలక శంకర్ – ఆత్మలకి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని బాగానే నవ్విస్తాయి.

ఇక అమాయకుడు, భయస్తుడి పాత్రలో శ్రీ పెర్ఫార్మన్స్ బాగానే చేసాడు. ఆ పాత్ర మనస్తత్వానికి తగ్గట్టు పాత్రని ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకొని ఉండాల్సింది. హీరోయిన్స్ లో రౌడీ రాణిగా సమత ఓకే అనిపిస్తే, అడవి అమ్మాయిలా హమీద బాగానే చేసింది. వీరు మధ్య మధ్యలో గ్లామర్ తో కూడా ఆకట్టుకున్నారు. గీతాంజలి అందాల అరబోతతో ఆకట్టుకుంది. ఇకపోతే జ్యోతి ఫస్ట్ హాఫ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరియు ఎక్స్ పోజింగ్ తో ముందు బెంచ్ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా పరంగా మైనస్ పాయింట్స్ లో చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. టీం చెప్పిన ఈ సినిమా జానర్ ప్రకారం చూసుకుంటే.. ఇదొక హర్రర్ కామెడీ థ్రిల్లర్.. సెకండాఫ్ లో షకలక శంకర్ చేత చేయించిన కొన్ని కామెడీ బిట్స్ తప్ప ఇంకేమీ లేని సినిమా ఇది. కనీసం ఒకటి రెండు హర్రర్ సీన్స్ అన్నా ఉండాలి, అలాగే ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా రెండు మూడు థ్రిల్స్ అన్నా ఉండాలి. కానీ భయపెట్టే సీన్స్, థ్రిల్ చేసే సీన్స్ ఒకటి కూడా లేకపోవడం పెద్ద మైనస్. సినిమాలో చూపిన కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ చూసి చిన్న పిల్లలు కూడా భయపడరు.

ఇక కథా పరంగా తన దగ్గర ఉన్నది ఒకే ఒక్క చిన్న పాయింట్.. ఆ ఒక్క పాయింట్ చెప్పడం కోసం సినిమా మొదటి నుంచి చివరి దాకా కథని సాగదీస్తూనే ఉన్నాడు. అంతే కాకుండా అనవరసపు కామెడీ సీన్స్, మరియు స్పెషల్ ట్రాక్స్ ని యాడ్ చేసారు. జ్యోతి – అప్పారావు సీన్స్ కథకి అవసరం లేదు. ఏదో కమర్షియాలిటీ కోసం వాళ్ళని పెట్టి కామెడీ, ఒక స్పెషల్ సాంగ్ చేయించారు. అలాగే ఇందులో వచ్చే పాటలు కూడా సినిమాకి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అని చెప్పాలి. సెకండాఫ్ లో వచ్చే కొన్ని గ్రాఫిక్ సీన్స్ చాలా నాశిరకంగా ఉన్నాయి.

ఇలా కథ లేకపోయినా కథనంతో కూడా ఆకట్టుకోలేకపోయాడు డైరెక్టర్. చాలా సీన్స్ లో డైరెక్టర్ కి ఏం కావాలనుకున్నాడో ఆ విషయాల పైన అవగాహన లేదనే విషయం మనకు ఆన్ స్క్రీన్ తెలిసిపోతుంది. ఇక ఆత్మలు అనే దాని పరంగా లాజిక్స్ అనేదే ఫాలో అవ్వలేదు. ఉదాహరణకి షకలక శంకర్ ఆత్మల్ని కొట్టినప్పుడు వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, అలాగే ఆత్మలు శంకర్ ని టచ్ చేస్తాయి, కొడతాయి, కోరుకుతాయి, కూడా. కానీ హీరోకి మాత్రం ఆత్మ కనపడుతుంది కానీ టచ్ చేయలేడు. ఇలాంటి లాజిక్స్ చాలా వదిలేసారు. సినిమా రన్ టైం 129 నిమిషాలే అయినా ఆడియన్స్ కి గంటలు తరబడి ఆ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పుకోదగిన అంశాలు ఏమీలేవు. శ్రీ వసంత్ సంగీతం కొన్ని చోట్ల పరవాలేదని పిస్తుంది. పాటలు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. యోగి – శివ కె నాయుడు కలిసి చేసిన సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ ఓకే. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అస్సలు బాగాలేదు. ఎందుకంటే ప్రతి సీన్ లోనూ చాలా లాగింగ్ ఉంది, కానీ ఆయన సింపుల్ గా ఎడిట్ చేసి ఇచ్చేయడం సినిమాకి హెల్ప్ కాలేదు. ఇక ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది తిరుమల శెట్టి కిరణ్. ఒక్క మాటలు మాత్రం పరవాలేదనిపించాయి. మిగతా మూడు డిపార్ట్ మెంట్స్ లో ఏ ఒక్క దానికి కిరణ్ న్యాయం చేయలేకపోయాడు. అన్నింటిలోనూ తన ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎంఎస్ రెడ్డి నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి.

తీర్పు :

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో హిట్ అయిన హర్రర్ కామెడీ జానర్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సాహసం సేయరా డింభకా’. ఇలాంటి జోనర్ సినిమాల్లో హర్రర్ కి కామెడీ తోడైతేనే హిట్. ఈ రెండింటిలో ఏది మిస్ అయినా సినిమా విజయాన్ని అందుకోవడం కష్టం. శ్రీ నటించిన సాహసం సేయరా డింభకాలో కూడా అదే మిస్ అయ్యింది. హర్రర్ అనేది జీరో, కామెడీ అనేది ఒక 30% మాత్రమే ఉంది. దాంతో సినిమా థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. సెకండాఫ్ లో షకలక శంకర్ పై వచ్చే రెండు మూడు కామెడీ ఎపిసోడ్స్, పలువురి అందాల ఆరబోత తప్ప చెప్పుకోదగిన ప్లస్ లు ఏమీ లేవు. మిగతా అన్ని విషయాలు ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని నిరుత్సాహపరుస్తుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు