సమీక్ష : శంకర – పూర్తిగా ‘పాత’బడిపోయింది..!

సమీక్ష : శంకర – పూర్తిగా ‘పాత’బడిపోయింది..!

Published on Oct 21, 2016 1:01 PM IST
Shankara review

విడుదల తేదీ : అక్టోబర్ 21, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : తాతినేని సత్య ప్రకాష్

నిర్మాత : ఆర్.వీ.చంద్రమౌళి ప్రసాద్

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : నారా రోహిత్, రెజీనా..

’జ్యో అచ్యుతానంద’ సినిమాతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న మంచి హిట్ కొట్టేసిన నారా రోహిత్, ఎప్పట్నుంచో విడుదలకు నోచుకోకుండా ఉన్న ‘శంకర’ అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు. రోహిత్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

శంకర్ (నారా రోహిత్) ఒక సాధారణ మధ్య తరగతి యువకుడు. తన అన్నయ్య చిన్నా(చిన్నా) పంపించే డబ్బులతో హాస్టల్‌లో ఉంటూ చదువుకునే శంకర్‌కు, సమాజంలో జరిగే అవినీతిపై పోరాడాలని ఉంటుంది. అలాంటి ఆలోచనలున్న శంకర్, కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఓ ఏసీపీ (జాన్ విజయ్)కి సంబంధించిన అవినీతి వ్యవహారంలో చిక్కుకుంటాడు. ఈ గొడవలోనే చావు దాకా వెళ్ళొచ్చిన శంకర్‌కు ఆ తర్వాత సమాజంలో పిచ్చోడు, డ్రగ్స్‌కు బానిస అనే ముద్ర పడిపోయేలా ఏసీపీ కారణమవుతాడు. అసలు శంకర్ ఏ అవినీతి వ్యవహారంలో చిక్కుకొని ఇబ్బందుల పాలయ్యాడు? దాన్నుంచి బయటపడేందుకు ఏమేం చేశాడు? తనపై పడ్డ డ్రగ్స్‌కు బానిసనే ముద్రను ఎలా పోగొట్టుకున్నాడు? ఈ కథలో అనన్య (రెజీనా) ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఉన్నంతలో పెద్ద ప్లస్ పాయింట్ అంటే మూలకథ అని చెప్పాలి. ఒక సాధారణ యువకుడు తనకు తెలీకుండానే పెద్ద అవినీతికి సంబంధించిన వ్యవహారంలో ఇరుక్కోవడం, ప్రాణాలు పోయేదాకా తెచ్చుకోవడం, తిరిగి పోరాడడం.. ఇలా ఒక పూర్తి స్థాయి సినిమాకు సరిపడా ఎమోషన్ ఉందీ కథలో! అసలు కథలోకి ఎంట్రీ ఇస్తూ వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్‌ను సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవాలి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

నారా రోహిత్ మరోసారి తన స్థాయికి తగ్గ నటనని ప్రదర్శించాడు. ఇటు కుర్రాడిగా సాదాసీదాగా కనిపిస్తూనే, అవసరమైనప్పుడల్లా యాంగ్రీ మ్యాన్‌గా మారిపోయి బాగా ఆకట్టుకున్నాడు. రెజీనా పూర్తి స్థాయి డీ గ్లామర్ రోల్‌లో బాగానే చేసింది. విలన్‌గా జాన్ విజయ్ మంచి ప్రతిభనే కనబరిచాడు.

మైనస్ పాయింట్స్ :

అసలు కథలో బలమైన ఎమోషన్ ఉండడాన్ని అటుంచితే, దానికి తగ్గట్టుగా అదే స్థాయి స్క్రీన్‌ప్లే కానీ, కట్టిపడేసే సన్నివేశాలు కానీ లేకపోవడమే ఈ సినిమాకు మేజర్ మైనస్. ఎంతో మంచి యాక్షన్ థ్రిల్లర్ కాగల కథను నీరసంగా, ఒక్కో సన్నివేశం సంబంధం లేకుండా వచ్చేలా డిజైన్ చేసి విసుగు తెప్పించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మొదలయ్యే వరకూ సినిమాలో ఎప్పుడు ఏ సీన్ వస్తుందో తెలియనట్టుగా స్క్రీన్‌ప్లే ఉంది. హీరో ఇంట్రడక్షనే ఒక అర్థం లేని పాటతో మొదలుపెట్టడం అస్సలు బాలేదు.

విడుదలకు చాలాకాలం నోచుకోని ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ తేలిపోవడంతో ఏదో 90ల్లోని సినిమాను థియేటర్లలో చూసిన ఫీలింగ్ కనిపించింది. నారా రోహిత్ లుక్ కూడా సినిమా మొత్తం ఒకేలా లేకపోవడం కంటిన్యూటి దెబ్బతీసేలా తయారైంది.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు తాతినేని సత్య ప్రకాష్ గురించి మాట్లాడుకుంటే, ఒక సినిమాకు సరిపడా మంచి కథనే ఎంచుకున్న ఆయన, దాన్ని సినిమాగా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. ఎంతో ఇంటెన్సిటీతో సాగాల్సిన సినిమాను, సన్నివేశాలను, నిస్సారంగా నడిపి చాలాచోట్ల సాదాసీదా ప్రతిభ కూడా చూపలేకపోయాడు. ఓపెనింగ్ సీన్‌ను ఇంటర్వెల్ బ్యాంగ్‌కు కలిపిన విధానంలో మాత్రం దర్శకుడి పనితనం చూడొచ్చు. అంతకుమించి దర్శకుడిగా సత్య ప్రకాష్ చేసిందేమీ లేదు.

సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనేలా ఉంది. ఎడిటింగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. అనవసరమైన ట్రాన్సిషన్స్ సినిమా మూడ్‌నే దెబ్బతీసేలా తయారయ్యాయి. సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్ కూడా అంతంతమాత్రమే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

తీర్పు :

ఒక మంచి కథతో అన్నిసార్లూ మంచి సినిమాలే చేయలేమని ఇప్పటికే ఎన్నో సినిమాలు ఋజువు చేసి చూపాయి. ‘శంకర’ ఒక మంచి కథతో వచ్చిన బాలేదనిపించే సినిమా. నారా రోహిత్ హానెన్స్ట్ పర్ఫామెన్స్, కథలో ఉన్న ఎమోషన్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఛేజ్, ఇలా అక్కడక్కడా ఫర్వాలేదనిపించే అంశాలను కొన్ని నింపుకున్న ఈ సినిమాలో మిగతావేవీ గుర్తింపుకు కూడా నోచుకోలేని స్థాయిలో ఉండడమే అతిపెద్ద మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. శంకర, థియేటర్ల ముందుకు రావడం లేట్ అవ్వడం అటుంచితే, వచ్చి చేసేది కూడా ఏం ఉండదన్నది రిలీజ్ తర్వాతే తెలుసుకునే విషయం!

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు