ఆడియో సమీక్ష : శ్రీమంతుడు – మహేష్ బాబు – దేవీశ్రీల మరో సూపర్ హిట్ ఆల్బమ్!

ఆడియో సమీక్ష : శ్రీమంతుడు – మహేష్ బాబు – దేవీశ్రీల మరో సూపర్ హిట్ ఆల్బమ్!

Published on Jul 20, 2015 8:30 AM IST

Sreemanth
సూపర్ స్టార్ మహేష్ బాబు – యంగ్ తరంగ్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ఇంతకుముందు కేవలం ‘1 నేనొక్కడినే’ అనే ఒక్క సినిమాయే రాగా, ఆ సినిమాకు దేవిశ్రీ అందించిన పాటలన్నీ మంచి హిట్‌గా నిలవడమే కాక, మహేష్ కెరీర్లో ఓ సరికొత్త స్టైలిష్ ఆల్బమ్‌గా నిలిచింది. మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ తాజాగా దర్శకుడు కొరటాల శివ రూపొందించిన సినిమా ‘శ్రీమంతుడు’. భారీ అంచనాలున్న ఈ సినిమా ఆడియో నేడు హైదరాబాద్ లోని శిల్పకళవేదికలో గ్రాండ్ గా జరిగింది, దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం 6 పాటలని అందించాడు. అన్ని పాటలూ రామజోగయ్య శాస్త్రి రాయడం విశేషం. మహేష్ – దేవీశ్రీ – కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ ఆడియో అంచనాలను అందుకుందా.? లేదా.? అనేది చూద్దాం..

11. పాట : రామ రామ
గానం : సూరజ్ సంతోష్, రనీనా రెడ్డి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

‘రామ రామ రామ…’ అంటూ సాగే ఈ పాట ఆల్బమ్ లో వచ్చే సోలో సాంగ్. సూరజ్ సంతోష్ మొత్తం పాడే ఈ పాట మధ్యలో వచ్చే రవీనా రెడ్డి వాయిస్ బాగుంది. సూరజ్ సంతోష్ గొంతులో వినడానికి బాగుండడమే కాకుండా, చాలా ఫ్రెష్ ఫీల్ ని కూడా కలిగిస్తుంది. ఈ పాట వినగానే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని అర్థమవుతోంది. ఈ పాటలో శ్రీ రాముడి లోని మంచి గుణగుణాలను, మంచి వైపు ఆయన వేసిన అడుగులను మరియు ఆయన అందాన్ని మన హీరో పాత్రకి సింక్ చేస్తూ ఆ రామయ్య నే మన హీరో అనేలా రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం అదుర్స్. దేవిశ్రీ ప్రసాద్ డ్రమ్స్, గజల్స్, సన్నాయి వాయిద్యాలతో కంపోజ్ చేసిన ఈ పాట వినడానికి ట్రెడిషనల్ గా ఉండడమే కాకుండా నేటితరం మాస్, క్లాస్ ని ఆకట్టుకునేలా ఉంది. మహేష్ కెరీర్లో ఇంట్రో పాటలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆ పాటల మాదిరిగానే ఆన్ స్క్రీన్ ఈ సాంగ్ కూడా విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా ఉంటుందని సమాచారం. ఈ పాటతో పాటు పాట మధ్యలో వచ్చే ‘రామ రామ రామ.. రామదండు లాగ అందరూ ఒక్కటవుదామా’ అని వచ్చే లైన్ సాంగ్ కి హైలైట్ అవ్వడమే కాకుండా, త్వరలోనే అందరి నోళ్ళలోనూ మారుమోగుతుందనడంలో సందేహం లేదు.

2. పాట : జత కలిసే..2
గానం : సాగర్, సుచిత్ర
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

‘జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే..’ అంటూ వచ్చే ఈ పాట ‘శ్రీమంతుడు’ ఆల్బమ్‌లో వచ్చే కూల్ మెలోడీ సాంగ్‌గా చెప్పుకోవచ్చు. హీరో హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమని, ఆ ప్రేమలోని భావాలను మనకు సీన్స్ లో చూపిస్తూ వారి భావాలను బ్యాక్ రౌండ్ లో మనకు తెలిపే ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఫీల్ గుడ్ అనే ఫీలింగ్ ని మనకు కలిగించేలా ఉంది. ముఖ్యంగా సాగర్ – సుచిత్ర కలిసి ఈ పాటకి ప్రాణం పోశారు. ఇద్దరి వాయిస్ లోని సాఫ్ట్ అండ్ మాధుర్యం సాంగ్ లో స్పెషల్ హైలైట్. దేవీశ్రీ గిటార్, స్లో డౌన్ డ్రమ్ బీట్స్, కీ బోర్డ్ ని ఉపయోగించి మెలోడియస్ గా ఉండేలా ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చాడు. కానీ ట్యూన్ పరంగా మనకు కొత్తగా ఏమీ అనిపించదు, కొన్ని చోట్ల ఎక్కడో విన్నామనే ఫీలింగ్ ని కూడా ఇస్తుంది. ఇన్‌స్టంట్‌గా ఎక్కే పాట కాకపోయినా, వినగా వినగా పాట హాయిగా అనిపిస్తుంది. ఈ పాటలో మహేష్ – శృతి హాసన్ కెమిస్ట్రీని ఆన్ స్క్రీన్ చూసాక అందరూ ఈ పాటకి అడిక్ట్ అవుతారు.

33. పాట : చారుశీల
గానం : యాజిన్ నిజార్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

ఇంగ్లీష్ సాకీతో మొదలయ్యే ఈ మరో సోలో సాంగ్ ‘ఓ చారుశీల’. ఆడియో టీజర్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్‌ను ఈ పాట మొత్తం సాగుతుంది. ఈ బీట్ వినడానికి చాలా బాగుంది. హీరో హీరోయిన్ వెంటపడుతూ తనపై తన మదిలో కలిగిన ప్రేమ భావాలను చెప్పే ఈ పాటలో రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం డీసెంట్ గా ఉంది. ఆయన పాటల్లో అప్పుడప్పుడూ వినిపించే ఇంగ్లిష్ పదాల అల్లికను ఈ పాటలో చూడొచ్చు. టోటల్ వెస్ట్రన్ స్టైల్లో సాగే ఈ పాటలో దేవిశ్రీ ప్రసాద్ ఎలక్ట్రిక్ గిటార్స్, క్రేజీ డ్రమ్స్, పెర్క్యూషణ్ వాయిద్యాలని వాడిన తీరు సూపర్బ్. ఓవరాల్ గా ఈ పాట వింటున్నప్పుడు అక్కడక్కడా దేవీశ్రీ కొన్ని పాత పాటల చాయలు కనిపిస్తాయి. ఈ వెస్ట్రన్ సాంగ్ కి యాజిన్ నిజార్ వాయిస్ పర్ఫెక్ట్ గా అవ్వడమే కాకుండా తన ఎనర్జీ సాంగ్ లో ఊపు తెస్తుంది. మధ్య మధ్యలో వినిపించే ర్యాపోను రాసిందీ, పాడిందీ దేవిశ్రీయే కావడం ఈ పాట ప్రత్యేకత.

4. శ్రీమంతుడా..4
గానం : ఎమ్.ఎల్.ఆర్. కార్తికేయన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

‘శ్రీమంతుడు’లో వచ్చే ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ టైటిల్ సాంగ్ ‘శ్రీమంతుడా..’. ఇదొక బిట్ సాంగ్. సినిమాలో హీరో లక్ష్యాన్ని నిర్దేశించే పాటగా దీనిని చూడచ్చు. సినిమాలో ఓ బలమైన సందర్భంలో, మహేష్ బాబు లక్ష్యం ఏంటనేది ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యంలో పద ప్రయోగం చాలా పదునుగా ఉంది. ముఖ్యంగా ‘లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం.. ప్రేమై వర్షించనీ ప్రాణం’ అని వచ్చే లైన్ సింప్లీ సూపర్బ్. ఇక కార్తికేయన్ ఈ పాటను చాలా బాగా పాడాడు. ముఖ్యంగా పాట మధ్యలో వచ్చే కోరస్ పాటను మరింత ఎత్తులో నిలబెట్టింది. స్క్రీన్‌పై విజువల్స్‌, సందర్భంతో మరింత బాగా ఆకట్టుకునే పాటగా దీన్ని చూడొచ్చు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా పాట మూడ్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేసేలా ఉంది. వినగా వినగా ఈ పాటకి అడిక్ట్ అవుతారు.

55. జాగో..
గానం : రఘు దీక్షిత్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

‘శ్రీమంతుడు’పై అందరికీ ఓ అవగాహన కల్పించిన మొదటి టీజర్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ బీట్ తో ‘జాగో’ అనే మరో సోలో సాంగ్ మొదలవుతుంది. ఈ పాటను కూడా సినిమాపై మనకో అవగాహన కల్పించే పాటగానే చెప్పుకోవచ్చు. ‘నేల నేల నేలా.. నవ్వుతోంది నాలా..’ అంటూ సాగే ఈ పాట కచ్చితంగా అంతటా మారుమోగిపోయే పాటగా చెప్పుకోవచ్చు. పాత మధ్యలో వచ్చే ‘జాగో జాగోరే జాగో.. ‘ అంటూ వచ్చే లైన్స్ పాటలో టెంపోని హై లెవల్ కి తీసుకెళ్ళడమే కాకుండా వినేవాళ్ళు కూడా హమ్ చేసేలా చేస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ను, అతడి జీవితంలో వచ్చే మార్పులకు అద్దం పట్టేలా సాగే ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం తన స్థాయిని మరోసారి నిరూపించేలా ఉంది. రఘు దీక్షిత్ వాయిస్ పాటకి పర్ఫెక్ట్ గా సరిపోవడమే కాకుండా పాడిన విధానం కూడా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటని మొదట స్ట్రాంగ్ డ్రమ్ బీట్స్ తో మొదలు పెట్టి, ఆ తర్వాత ఎలక్ట్రిక్ గిటార్, పెర్క్యూషణ్ వాయిద్యాలతో పీక్స్ స్టేజ్ కి తీసుకెళ్ళి ఓ సరికొత్త ఫీల్‌ ని ఇచ్చారు.

6. దిమ్మతిరిగే..6
గానం : సింహ, గీతా మాధురి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
‘దిమ్మ తిరిగే’ పాటను శ్రీమంతుడు ఆల్బమ్‌లో ఓ నికార్సైన టాలీవుడ్ అండ్ దేవీశ్రీ మార్క్ మాస్ పాటగా చెప్పుకోవచ్చు. ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో ఆడే నా మొగుడు..’ అంటూ సాకీతో మొదలయ్యే ఈ పాటని స్పెషల్ గా బి, సి సెంటర్ ఆడియన్స్ ని కంపోజ్ చేసారు. కచ్చితంగా ఆన్ స్క్రీన్ ఈ పాట మాస్ ఆడియన్స్ చేత డాన్స్ వేయిస్తుందని చెప్పాలి. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన రామజోగయ్య వారికి కనెక్ట్ అయ్యే పదాలని అల్లిన విధానం బాగుంది. ఆయన సాహిత్యానికి సింహ, గీతా మాధురిల మాస్ స్టైల్ మరియు ఎనర్జీ లెవల్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. మాస్ సాంగ్ లో ఉండాల్సిన బీట్స్ తో దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటని కంపోజ్ చేసాడు. వినగానే మాస్ ఆడియన్స్ కి నచ్చేసే ఈ పాట చార్ట్ బస్టర్‌లలో ప్లేస్ కొట్టేస్తుంది. మహేష్ బాబుకి ఇలాంటి ఓ ఫుల్ మాస్ బీట్ సాంగ్ కాస్త కొత్త అని చెప్పాలి. సో ఆన్ స్క్రీన్ మహేష్ బాబు మాస్ గెటప్స్ లో అలరిస్తాడని చెప్పచ్చు.

తీర్పు :

‘1-నేనొక్కడినే’ లాంటి సూపర్ హిట్ ఆల్బమ్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన మ్యూజిక్ ఆల్బమ్ ‘శ్రీమంతుడు’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆడియో కూడా ప్రేక్షకుల మన్ననలు పొంది మహేష్ – దేవీశ్రీ కాంబోలో మరో హిట్ ఆల్బమ్ అవుతుంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో ఎక్కువగా సందర్భానికి తగ్గట్టుగా ఒకదానితో ఒకటి సంబంధం లేని డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చాడు. ట్యూన్స్ పరంగా ఇప్పటివరకూ చేసిన సినిమాలతో పోల్చుకుంటే స్టైల్‌లో కొత్తదనమేమీ లేకపోయినా, తన ఓల్డ్ స్టైల్ లోనే ఓ మంచి ఆడియోను ఇచ్చాడు. ఈ ఆడియోలో ముఖ్యంగా అన్ని రకాల అభిరుచులున్న వారికి తగ్గ పాటలున్నాయి. శ్రీమంతుడు ఆల్బంలో ది బెస్ట్ అండ్ వినగానే ఎక్కేసే సాంగ్స్ గురించి చెప్పాలంటే.. ‘రామ రామ’, ‘జాగో’, ‘శ్రీమంతుడా’. ఇక దేవీశ్రీ మార్క్ మెలోడీ ‘జత కలిసే..’ వినసొంపుగా ఉంటే, ‘దిమ్మ తిరిగే’ అనే మాస్ సాంగ్ మాస్ ఆడియన్స్ చేత స్టెప్స్ వేయించేలా ఉంది. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక స్టార్ హీరో సినిమాలో అందరూ కోరుకునే అన్ని రకాల పాటలనూ సమతూకంలో వేసి వండేయడమనే పద్ధతినే ‘శ్రీమంతుడు’ ఆడియోకి కూడా ఫాలో అయ్యారు, సక్సెస్ కూడా అయ్యారు. తెలుగు సినిమా ఆడియో ఫార్మాట్‌కు ఫిక్సైన ఆడియన్స్‌కు ‘శ్రీమంతుడు’ ఓ సూపర్ హిట్ ఆల్బమ్.

శ్రీమంతుడు ఆడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు