సమీక్ష : సుప్రీమ్ – ‘జింగ్ జింగ్’ కామెడీ!

సమీక్ష : సుప్రీమ్ – ‘జింగ్ జింగ్’ కామెడీ!

Published on May 6, 2016 7:50 PM IST
Supreme review

విడుదల తేదీ : మే 05, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : అనిల్ రావిపూడి

నిర్మాత : శిరీష్

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘సుప్రీమ్’. ‘పటాస్‌’తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్, మంచి అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం..

కథ :

అనంతపూర్‌లో తరాలుగా జాగృతి ట్రస్ట్ సంస్థ పరిధిలోని వందల ఎకరాలను నమ్ముకొని వేలమంది జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ ట్రస్ట్ పరిధిలోని భూములను తన సొంతం చేసుకునేందుకు విక్రమ్ సర్కార్ (కబీర్ సింగ్) ప్లాన్ చేస్తాడు. అయితే ఆ ట్రస్ట్ ఓ రాజ కుటుంబీకులదనీ, వారి తరపు వారు ఇంకా బతికే ఉన్నారని తెలియడంతో విక్రమ్ సర్కార్ ప్లాన్‍కు అడ్డంకి పడుతుంది. ఇక ఈ కథకు ఏమాత్రం సంబంధం లేని బాలు (సాయిధరమ్ తేజ్), హైద్రాబాద్‌లో ట్యాక్సీ నడుపుకుంటూ తండ్రితో కలిసి జీవిస్తుంటాడు. అతడి జీవితంలోకి రాజన్ పేరుతో ఓ ఎనిమిదేళ్ళ బాలుడు వస్తాడు. రాజన్ వచ్చాక బాలు కథ పూర్తిగా మారిపోతుంది.

తనకే సంబంధం లేని జాగృతి ట్రస్ట్ కథలోకి బాలు ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. అసలు బాలుకి, అక్కడి ప్రజలకు సంబంధం ఏంటీ? ఈ రాజన్ అనే బాలుడెవరు? ఆ బాలుడికీ జాగృతి ట్రస్ట్‌కు ఏదైనా సంబంధం ఉందా? ఒక బాధ్యతను తనపై వేసుకున్న బాలు దాన్ని విజయవంతంగా పూర్తి చేశాడా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధానమైన అనుకూలాంశం అంటే హీరో పాత్రకు, ఓ ఎనిమిదేళ్ళ బాలుడికి మధ్యన ఉండే జర్నీ గురించే చెప్పుకోవాలి. ‘నా రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి’ అంటూ బాలుడితో చెప్పించే పాయింట్‌తో అసలు కథ నడుస్తూంటుంది. ఈ పాయింట్ చాలా బాగుంది. హీరో, ఈ బాలుడికి మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇక మొదట్నుంచీ చివరి వరకూ చిన్న కథే అయినా చెప్పాల్సిన పాయింట్‌ చుట్టూ అల్లుకున్న ఫన్ ఎలిమెంట్ ఈ సినిమాను నిలబెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ నుంచి పుట్టుకొచ్చే ఫన్, వీరిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.

ఇక ఎప్పట్లానే మంచి ఎనర్జీ ఉన్న క్యారెక్టర్‌లో సాయిధరమ్ తేజ్ అంతే ఎనర్జీతో నటించి సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్ళాడు. డ్యాన్సుల్లో, డైలాగ్ డెలివరీలో సాయిధరమ్ తేజ్ సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. రాశిఖన్నా ఓ ఫన్ పాత్రలో బాగా నటించింది. కథకు చాలా కీలకం అయిన పాత్రలో బాల నటుడు మైఖేల్ గాంధీ అద్భుతమైన ప్రతిభ చూపి కట్టిపడేశాడు. ఇక మిగతా నటీనటులంతా సినిమాకు అవసరమైనప్పుడల్లా కామెడీని పండిస్తూ అందరూ తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు.

సినిమా పరంగా చూసుకుంటే, ఫస్టాఫ్‌ను ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. సెకండాఫ్‌లో సింగిల్ పాయింట్‌లో నడిచే సినిమాకు ఎంటర్‌టైన్‌మెంటే ప్రధాన బలం. పృధ్వీ, ప్రభాస్ శీనుల ఎపిసోడ్, రఘుబాబు, వెన్నెల కిషోర్‍ల నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్, విలన్ రవిశంకర్ క్యారెక్టరైజేషన్ నుంచి పుట్టుకొచ్చే కామెడీ.. ఇలాంటివన్నీ సినిమాను ఎప్పటికప్పుడు ఫన్ ట్రాక్ తప్పకుండా మంచి ఫ్లోలో నిలబెడుతూ కాపాడడం సినిమా పరంగా ప్లస్ పాయింట్స్.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే అసలు కథంతా మొదటి పావుగంటలోనే తెలిసిపోవడం గురించి చెప్పుకోవాలి. ఇక ఈ చిన్న కథతోనే ఇంటర్వెల్ వరకూ సినిమాను పకడ్బందీగా తీసుకొచ్చినా, అక్కడొక ట్విస్ట్ రివీల్ అయ్యాక సినిమా మొత్తం సింగిల్ పాయింట్‌లో సాగిపోతూ అక్కడక్కడా నెమ్మదించినట్లు కనిపించింది. ఇక రాజన్ అనే బాలుడి పాత్ర ఎంట్రీ ఇచ్చేవరకూ సినిమాలో అన్ని సన్నివేశాలూ కావాలని అప్పటికప్పుడు కృతకంగా అల్లిన సన్నివేశాల్లా కనిపిస్తాయి. సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్ల ట్రాక్‌కు కూడా అవకాశం లేని కొన్ని పరిస్థితులు ముందునుంచే కల్పించడంతో అక్కడ వీరి ప్రయాణం పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

ఇక సినిమాలో పెద్దగా లాజిక్ అన్న అంశానికి చోటే లేదు. పూర్తిగా ఫన్ ఎలిమెంట్‌నే నమ్ముకొని కొన్నిచోట్ల ఎమోషన్‍ను కుదించడం కూడా పెద్దగా ఆకట్టుకోదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాలను ప్రస్తావించుకుంటే, మొదట దర్శక, రచయిత అనిల్ రావిపూడి గురించి చెప్పుకోవాలి. అనిల్ ఒక మంచి పాయింట్ చుట్టూ అల్లుకున్న అసలు కథ చాలా చిన్నది. అయితే ఆ చిన్నకథలోనే ఎమోషన్‌ను, ఫన్ ఎలిమెంట్‌ను బాగా వాడుకుంటూ ఒక మంచి స్క్రీన్‌ప్లేనే రాశాడని చెప్పాలి. దర్శకుడిగానూ అనిల్ రావిపూడి ఒక కమర్షియల్ సినిమాకు అవసరమైన అంశాలను పొందిగ్గా పేర్చుకున్న విధానం బాగా ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్క ఒడిశా నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో మినహాయిస్తే మేకింగ్ పరంగా పెద్దగా మెరుపులేమీ లేవు. హీరో-బాలుడి మధ్యన వచ్చే జర్నీని కథలోని ఎమోషన్‌కు కలపడం ఈ సినిమా విషయంలో దర్శకుడిగా అనిల్ చూపిన చక్కటి ప్రతిభగా చెప్పుకోవచ్చు.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు టెక్నికల్‌గా ఓ బలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఒడిశా నేపథ్యంలో వచ్చే ఓ ఛేజ్ సీన్ సినిమాటోగ్రాఫర్ పనితనానికి ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాయి కార్తీక్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలన్నీ సాదాసీదాగానే ఉన్నాయి. ‘ఆంజనేయుడు నీ వాడు’ అనే పాట బాగుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ బాగుంది. కొన్నిచోట్ల ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్‌లో వేగం తగ్గించాల్సింది. దిల్‌రాజు బ్యానర్ నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

తీర్పు :

తెలుగు సినిమాల్లో ఇప్పుడొస్తున్న కమర్షియల్ సినిమాలకు ప్రధానమైన అంశం ఫన్ ఎలిమెంట్. కథ చిన్నదైనా, అందులో ఉన్న ఎమోషన్ చిన్నదైనా, దానికి కామెడీ టచ్ ఇచ్చి సినిమాగా చెప్తే ప్రేక్షకుడి దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనేది ఈమధ్య కాలంలో చాలా సినిమాలే ఋజువుచేశాయి. తాజాగా అదే కోవలో వచ్చిన మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్, ‘సుప్రీమ్’. సాయిధరమ్ తేజ్ తనకు బాగా కలిసివచ్చిన ఈ జానర్‌నే మళ్ళీ నమ్ముకొని ఈసారి కూడా మెప్పించాడనే చెప్పుకోవచ్చు. హీరో క్యారెక్టరైజేషన్, కథలోని చిన్న పాయింట్, హీరోతో ఓ బాలుడి ప్రయాణం, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, మొదట్నుంచీ చివరివరకూ సినిమాను నిలబెట్టేలా ఉండే కామెడీ ఎపిసోడ్స్ లాంటివన్నీ ఈ సినిమాకు అనుకూలాంశాలు. ఇకపోతే లాజిక్ అంటూ లేకపోవడం, అసలు కథ మొదట్లోనే తెలిసిపోవడం లాంటి ప్రతికూలాంశాలు ఉన్నా ఓ కామెడీ సినిమాగా మాత్రం చూస్తే, ఈ ‘సుప్రీమ్’ బాగా ఆకట్టుకుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమాలోనే చెప్పినట్టు ‘జింగ్ జింగ్’ కామెడీతో హాయిగా నవ్వించే సినిమా ‘సుప్రీమ్’!

123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు