సమీక్ష: ఏ మంత్రం వేసావె – ఈ మంత్రం పనిచేయలేదు

సమీక్ష: ఏ మంత్రం వేసావె – ఈ మంత్రం పనిచేయలేదు

Published on Mar 10, 2018 1:09 AM IST
Ye Mantram Vesave movie review

విడుదల తేదీ : మార్చి 09, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : విజయ్ దేవరకొండ, శివానీ సింగ్

నిర్మాత : శ్రీధర్ మర్రి

సంగీతం : అబ్దస్ సమద్

సినిమాటోగ్రఫర్ : శివ రెడ్డి

ఎడిటర్ : ధర్మేంద్ర కాకర్ల

‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలో నటించిన చిత్రం ‘ఏ మంత్రం వేసావె’. శ్రీధర్ మర్రి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పలు వాయిదాల తరవాత ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
నిఖిల్ (విజయ్ దేవరకొండ) ఇంట్లోంచి బయటి వెళ్లకుండా ఎప్పుడూ వీడియో గేమ్స్, సోషల్ మీడియా అంటూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులను కూడ బాధపెడుతుంటాడు. అలాంటి అతను సోషల్ మీడియా ద్వారా రాగమాలిక (శివానీ సింగ్) అనే అమ్మాయిని ఇష్టపడి ఆమెకు దగ్గరవ్వాలనుకుంటాడు.

కానీ రాగమాలిక మాత్రం నిఖిల్ మెంటాలిటీని అంచనా వేసి తనని కలవాలంటే ఒక గేమ్ ఆడాలని అతనికి ఛాలెంజ్ విసురుతుంది. ఆ గేమ్ ఏంటి, నిఖిల్ దాన్ని ఎలా ఆడాడు, చివరికి ఆమెను ఎలా చేరుకున్నాడా లేదా, అసలు రాగమాలిక, నిఖిల్ కు అలాంటి ఛాలెంజ్ ఎందుకు విసిరింది అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో అన్నిటికన్నా కొంత ఎక్కువగా ఆకట్టుకున్న అంశం విజయ్ దేవరకొండ. సోషల్ మీడియాకు, ఆన్ లైన్ వీడియో గేమ్స్ కు అడిక్ట్ అయిన కుర్రాడిగా అతని నటన బాగుంది. ముఖ్యంగా హీరోయిన్ కోసం వెతికే సందర్భాల్లో అతని ప్రయత్నాలు, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. ఇక దర్శకుడు శ్రీధర్ మర్రి నేటి సోషల్ మీడియా, గ్యాడ్జెట్స్ అనేవి యువత యొక్క జీవితాలను ఎలా పెడదోవపట్టిస్తున్నాయి, వాళ్ళను సమాజం నుండి ఎలా దూరం చేస్తున్నాయి అనే అంశాన్ని తీసుకుని సినిమా చేయాలనుకోవడం అభినందించదగిన విషయం.

హీరోయిన్ హీరోను మంచిగా మార్చాలనుకోవడం, అందుకు అతని దారినే ఎంచుకోవడం, అతనికో రియాలిటీ గేమింగ్ టాస్క్ ఇవ్వడం అనే విషయాలు కూడా బాగున్నాయి. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే అనిపించింది. హీరోయిన్ శివానీ సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ కొంత వరకు ఇంప్రెస్ చేసింది.

మైనస్ పాయింట్స్ :

హీరో విజయ్ దేవరకొండను ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాల్లో చూసిన తరవాత ఈ చిత్రంలో చూడటం కొంత నిరుత్సాహంగానే అనిపిస్తుంది. మంచి పెర్ఫార్మర్ అయినప్పటికీ బలమైన పాత్రను, కదిలించే సన్నివేశాలను రాయకపోవడంతో అతను కూడా సినిమాను చేతుల్లోకి తీసుకుని కాపాడలేకపోయాడు. సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా సరైన కథనం, ఆలోచింపజేసే సీన్లు లేకపోవడంతో అది బలంగా ప్రేక్షకుడ్ని చేరుకోలేకపోయింది.

సన్నివేశాలను చిత్రీకరించిన తీరు కూడ కొంత తక్కువ స్థాయిలోనే ఉంది. కొందరు నటీ నటులకు డబ్బింగ్ సరిగా కుదరలేదు. కొందరి పెర్ఫార్మెన్స్ ఇబ్బందికరంగా కూడ అనిపించింది. సినిమా సెకండాఫ్ అయితే మరీ నాటకీయంగా ఉంది. దర్శకుడు చాలా చోట్ల ప్రేక్షకుల గురించి ఆలోచించకుండా ఎక్కువ స్వేచ్ఛను వాడేసుకుని, తనకు వీలైనట్టు సన్నివేశాలను, మలుపుల్ని రాసేసుకోవడం అసంతృప్తిని కలిగిస్తుంది.

ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ రెండూ కూడ రొటీన్ గా, సులభంగా ఊహించదగినవిగా ఉండటంతో పెద్దగా ఎగ్జైట్మెంట్ కలగదు. ఇక మధ్యలో వచ్చే పాటలు అస్సలు ఆకట్టుకోలేకపోయాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు శ్రీధర్ మర్రి చెప్పనుకున్న పాయింట్ మంచిదే, సమాజానికి అవసరమైనదే అయినా ఆసక్తికరమైన కథనం, సన్నివేశాలు క్వాలిటీ టేకింగ్ లేకపోవడంతో అది ప్రేక్షకుల్ని సరైన రీతిలో తాకలేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా పాటల సంగీతం ఆకట్టుకోలేకపోయింది.
ద్వితీయార్థంలో ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీలో ఇంకాస్త క్వాలిటీ పాటించి ఉండే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

తీర్పు :

విజయ్ దేవరకొండ హిట్ సినిమాలను చూసి ఆ స్థాయి కంటెంట్, పెర్ఫార్మెన్స్ ఆశించి గనుక ఈ చిత్రానికి వెళితే నిరుత్సాహం తప్పదు. చాలా కాలం క్రితమే పూర్తై ఇప్పుడు విడుదలైన ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్, విజయ్ నటన మినహా పెద్దగా కట్టుకునే వేరే అంశాలేవీ లేవు. కాబట్టి ప్రేక్షకుల మీద ఏ మాత్రం పనిచేయలేకపోయిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడటం కన్నా టీవీల్లో ప్రసారమమైనప్పుడు చూడటం బెటర్.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు