
కెరీర్లో తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అని వస్తున్న వార్తలను ఖండించారు దర్శకుడు కొరటాల శివ. ఫస్ట్ మూవీ ‘మిర్చి’తో సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాల శివ మహేష్ బాబును డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమయింది. మహేష్ బాబు సెప్టెంబర్ నుండి షూటింగ్లో పాల్గొంటారు. ప్రస్తుతం ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు.
ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని సోషల్ మీడియాలో దర్శకుడు చెప్పారు. అలాగే సినిమా టైటిల్ ‘కన్నయ్య’ కాదని స్పష్టం చేశారు. ఇంకా టైటిల్ నిర్ణయించలేదని, టైటిల్ కన్ఫర్మ్ కాగానే వెల్లడిస్తామని చెప్పారు. ‘1 నేనొక్కడినే’ తర్వాత మరోసారి మహేష్ బాబు సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2015 వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.