
2005 వ సంవత్సరం నుండి భారతీయ సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి అక్కినేని అవార్డును ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 2013 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ప్రధానం చేయనున్నారు. శనివారం శిల్పకళా వేదికలో జరిగిన 100 రోజుల వేడుకలో అక్కినేని అవార్డు కమిటీ చైర్మన్ టి.సుబ్బిరామి రెడ్డి ప్రకటించారు. త్వరలో ఇదే వేదికపై అమితాబ్ కు పురస్కారం అందజేస్తామని చెప్పారు.
ఈ పురస్కారం కింద 5 లక్షల రూపాయల నగదుతో పాటు ప్రసంశాపత్రం ఇచ్చి సత్కరిస్తారు. ప్రతి ఏడాది ఆరంభంలో ఈ అవార్డును ప్రధానం చేసేవారు. అక్కినేని మరణం కారణంగా ఈ ఏడాది అవార్డు ఎంపికలో జాప్యం జరిగింది. వచ్చే ఏడాది నుండి అక్కినేని జయంతి రోజున(సెప్టెంబర్ 20న) అవార్డును ఇస్తామని గతంలో అక్కినేని పెద్ద కుమారుడు వెంకట్ ప్రకటించారు. గతంలో దేవానంద్, షబానా అజ్మి, అంజలి దేవి, లతా మంగేష్కర్, వైజయంతి మాలా, బాలచందర్, హేమమాలిని, శ్యాం బెనగల్ తదితరులు అందుకున్నారు.