విడుదల తేదీ : 5 మార్చి 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : కెవి ఆనంద్
నిర్మాత : అఘోరం, గణేష్, సురేష్
సంగీతం : హరీస్ జయరాజ్
నటీనటులు : ధనుష్, అమైరా దస్తూర్, కార్తీక్..
ఈ ఏడాది ‘రఘువరన్ బిటెక్’, ‘పందెం కోళ్ళు’ సినిమాలతో తెలుగులో హిట్ కొట్టిన ధనుష్, ఈ రోజు ‘అనేకుడి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘రంగం’ ఫేం కెవి ఆనంద్ దర్శకత్వం వహించడంతో డబ్బింగ్ సినిమా అయినా ‘అనేకుడి’పై ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా..? లేదా..? ఈ సమీక్ష చదివి తెలుసుకోండి.
కథ :
మధుమిత (అమైరా దస్తూర్) ప్రముఖ ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలో క్రియేటివ్ డిజైనర్. తన కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన అశ్విన్ (ధనుష్)తో మనది జన్మజన్మల ప్రేమకథ అని చెప్తుంది. తనకు గత జీవితాలలో జరిగిన సంగతులు గుర్తున్నాయంటూ… ఆ జన్మలో మనుషులు ఇప్పుడు కూడా జన్మించారంటూ.. ప్రేమకథలు చెప్పడం ప్రారంభిస్తుంది. ప్రతి ప్రేమకథలో ముగింపు విషాదమే. మధును ప్రేమించినా.. ఆమె చెప్పే కథలను అశ్విన్ విశ్వసించడు. 25 ఏళ్ళ కింద జరిగిన ప్రేమకథలో మధు చెప్పింది నిజమని తేలడంలో అశ్విన్ అసలు ఎం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇదే సమయంలో కొన్ని అనూహ్య ఘటనలు జరుగుతాయి.
ప్రతి జన్మలో వీరి ప్రేమకు అడ్డు పడుతుంది ఎవరు..? ఆన్ లైన్ గేమింగ్ కంపెనీ ఓనర్ కిరణ్ (కార్తీక్)కు, వీరి గత జన్మ ప్రేమకథకు సంబంధం ఏంటి..? ఈ జన్మలోనైనా వీరి ప్రేమకథ సుఖాంతం అయ్యిందా..? లేదా..? అనే ప్రశ్నలకు సమాధానం మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్ :
మూడు జన్మలకు సంబందించిన ప్రేమకథలలో ధనుష్, అమైరా దస్తూర్‌లు అద్బుతమైన నటన కనబరిచారు. వీరి నటన సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి పాత్రలోను వైవిధ్యం చూపారు. మాస్ కుర్రాడు కాళీ పాత్రలో ధనుష్ జీవించాడు. ప్రస్తుత ప్రేమకథలో స్టైలిష్ & ట్రెండీగా నటించాడు. అమైరాది ఎక్స్ ప్రెస్సివ్ పేస్. సన్నివేశానికి తగ్గట్టు హావభావాలను, ముఖ కవళికలను చూపిన తీరు బాగుంది. షీ ఈజ్ వెరీ క్యూట్. ఆమె అందం సినిమాకు అదనపు ఆకర్షణ. పాటల్లో కాస్త గ్లామర్ ఒలకబోసింది. ధనుష్, అమైరాల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పని ఒత్తిడి వలన యువత మానసిక స్థితి ఎలా ఉంటుంది. వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు. అనే అంశాలతో పునర్జన్మల ప్రేమకథను ముడిపెడుతూ కథను చాలా ఆసక్తికరంగా మలిచారు. స్క్రీన్ ప్లే బాగుంది. స్క్రీన్ ప్లే, హీరో హీరోయిన్ల నటన తర్వాత సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. వారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి సినిమాటోగ్రాఫర్ న్యాయం చేశాడు. గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. బర్మా ఎపిసోడ్ & పాటల్లో సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్ వర్క్ సూపర్బ్..
మైనస్ పాయింట్స్ :
క్లైమాక్స్ ఎపిసోడ్, రెండున్నర గంటలకు పైగా సాగిన కథనం సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్. కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోతుంది. ట్విస్ట్ రివీల్ చేయడం వరకు చాలా పకడ్బందీ స్క్రీన్ – ప్లే రాసుకున్న దర్శకుడు, ఆ తర్వాత చేతులు ఎత్తేశాడు. అక్కడ నుండి క్లైమాక్స్ కు చేరుకోవడం కోసం చాలా సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ లో ఎం జరుగుతుందో ప్రేక్షకులు ఈజీగా ఊహించగలరు. అప్పుడు త్వరగా ముగించేయడం బెటర్. క్లైమాక్స్ ఎపిసోడ్ సాగదీసిన భావన కలుగుతుంది. ఇక్కడ ఎడిటర్ కత్తెరకు కాస్త పని చెప్తే బాగుండేది. సినిమాలో వినోదం పాళ్ళు కాస్త తక్కువ. కామెడీ కోసం అక్కడక్కడా చేసిన ప్రయత్నం సఫలం కాలేదు.
సాంకేతిక విభాగం :
హారీస్ జయరాజ్ తన మ్యూజిక్ తో మేజిక్ చేశాడు. సంగీతం, నేపధ్య సంగీతం రెండూ బాగున్నాయి. పాటలను తెరపై చిత్రీకరించిన తీరు అదరహో. విజువల్స్ పరంగా భారితనం కనబడుతుంది. దర్శకుడు గతంలో సినిమాటోగ్రాఫర్ అయితే సినిమాలో ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేసే అంశం ఇదే. తెరపై ఓ బ్యూటిఫుల్ పెయింటింగ్ చూస్తున్నట్టు ఉంటుంది.
కథ బాగుంది. ప్రారంభం నుండి పకడ్బందీ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆసక్తికరంగా మలిచిన దర్శకుడు క్లైమాక్స్ చేరుకునే సరికి ప్రేక్షకులను విసిగించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో టెంపో కంటిన్యూ చేయడంలో మిస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన సస్పెన్స్ సెకండ్ హాఫ్ లో లేదు.
తీర్పు :
ప్రతి సినిమాలో మంచి కథ, డిఫరెంట్ స్క్రీన్ – ప్లేలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే కెవి ఆనంద్, తాజాగా ‘అనేకుడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ధనుష్, అమిరాల అద్బుతమైన అభినయం తోడవడంతో సినిమా ప్రధమార్ధం ఆసక్తికరంగా సాగుతుంది. ద్వితీయార్ధంలో ఆ ఆసక్తిని దర్శకుడు కంటిన్యూ చేయలేకపోయాడు. ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత నుండి క్లైమాక్స్ వరకు సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ, ధనుష్, అమైరాల పెర్ఫార్మన్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. క్లైమాక్స్ ఎపిసోడ్, ద్వితీయార్ధంలో టెంపో మిస్ కావడం మైనస్ పాయింట్స్. ఈ వారంతంలో మీరు తప్పకుండా పూర్తి చేయవలసిన పనులు లేకపోతే ఈ ‘అనేకుడి’ని ఒకసారి చూడొచ్చు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం