
‘అష్టాచమ్మా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాని.. ఆ తర్వాత అనతికాలంలోనే వరుస హిట్లతో దూసుకువచ్చాడు. కొన్నాళ్ళ నుంచి ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ అనుకున్నంత స్థాయిలో ఆ సినిమాలు సక్సెస్ సాధించట్లేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని, ఉగాదికి ‘ఎవడే సుబ్రమణ్యం’తో మన ముందుకు వస్తున్నాడు. విచిత్రమేంటంటే నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇప్పటికీ విడుదలకు నోచుకోని సినిమా కూడా ‘ఎవడే సుబ్రమణ్యం’తో పాటే విడుదల కానుండడం. ఆ సినిమాయే.. ‘జెండాపై కపిరాజు’. ఈ రెండు సినిమాలూ ఉగాదికే విడుదలకు సిద్ధమవ్వడం ఆసక్తికరమైన అంశం.
నాగ అశ్విన్ దర్శకత్వంలో, ప్రియాంక్ దత్ నిర్మించిన ‘ఎవడే సుబ్రమణ్యం’.. ఎన్నో ప్రయాసలకోర్చి నిర్మించబడింది. ఈ సినిమాను ఉగాదిగి తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలతో ఆగిపోయిన జెండాపై కపిరాజుకు చివరకు విడుదల మోక్షం కలిగింది. ఇప్పుడీ రెండు సినిమాల్లో ఏదైనా ఒకటి వాయిదా పడుతుందా ? లేదా రెండూ ఒకేసారి పోటీ పడతాయా అన్నది తెలియాలి. జెండాపై కపిరాజు తమిళ వెర్షన్, గత నెల్లోనే విడుదలై సూపర్ హిట్ కొట్టింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తమిళంలో నాని ప్లేస్‌లో జయం రవి నటించారు.