మరో సరికొత్త లుక్‌లో ఎన్టీఆర్..!

Jr_NTR
ప్రస్తుతం తెలుగు హీరోలంతా ‘లుక్’ జపం చేస్తున్నారు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్ల విషయంలో కొత్త పంథాను అందిపుచ్చుకుంటూనే లుక్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. గోపీచంద్ ఇంతకుముందెన్నడూ కనిపించనంత అందంగా ‘జిల్’ సినిమాలో కనిపించాడంటే అది ఈ మార్పులో భాగంగానే చెప్పుకోవచ్చు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అతీతుడు కాడు. తాజాగా విడుదలైన ఆయన సినిమా ‘టెంపర్’లో స్టైల్, లుక్ విషయంలో ఎంత జాగ్రత్త పడ్డారన్నది తెలుస్తూనే ఉంది. టెంపర్ విజయంలో ఎన్టీఆర్ న్యూ లుక్ చాలా ఉపయోగపడిందనే చెప్పాలి.

టెంపర్ తర్వాత ఎన్టీఆర్ నటించనున్న కొత్త సినిమాలోనూ సరికొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. సరికొత్త కథాంశాలు, మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్‌‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విలక్షణ కథలను తెరకెక్కించే సుకుమార్, హీరోల లుక్ విషయంలోనూ పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకూ అలానే చేస్తున్నాడట. కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు.

తాజాగా ఈ సినిమాకు ఓ మంచి టైటిల్ పెట్టడం విషయమై సినిమా యూనిట్ భావిస్తోంది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు ‘దండయాత్ర’ అనే పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ‘ఇది దండయాత్రా.. దయాగాడి దండయాత్రా..’ అంటూ ఎన్టీఆర్ టెంపర్‌లో చెప్పిన డైలాగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే! అందరి నోళ్ళలో నానుతున్న ఈ పేరునే సినిమాకు పెట్టడం బాగుంటుందని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ టైటిల్ దాదాపుగా అందరికీ ఓకే అయినట్టు సమాచారం. ఇక ఏప్రిల్ 17న లండన్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా మరో కొత్త గెటప్‌లో దర్శనమివ్వనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version