
టాలీవుడ్‌లో ఆరడుగులకు పైనే పొడవు, అందుకు తగ్గట్టుగానే కండపుష్టి కలిగిన హీరోల్లో రానా మొదటి స్థానంలో ఉంటారు. తన ఫిజిక్, యాక్టింగ్‌తో ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ దేశమంతటికీ పరిచయస్థుడైపోయారు. తాజాగా ఆయనో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాన్‌వెజ్‌కి పూర్తిగా దూరమవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇకపై కేవలం వెజివెజిటేరియన్ ఆహారానికి మాత్రమే పరిమితం కానున్నారు.
తాను పూర్తి వెజిటేరియన్‌గా మారిన విషయాన్ని రానా తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. వెజిటేరియన్‌గా మారినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. జీవ హింసను నిరోధించడానికి ఏర్పాటైన పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ అనిమల్స్) సంస్థ రానాకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఓ ప్రత్యేక బహుమతిని అందజేసింది. ప్రస్తుతం రానా నటించిన ప్రతిష్టాత్మక సినిమాలు ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ సినిమాలు విడుదలకు సిద్ధమౌతుండగా, ‘బెంగళూర్ డేస్’ తమిళ రీమేక్‌లో రానా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.