
భారతీయుడు.. 1996లో విడుదలైన ఈ సూపర్‌హిట్ సినిమా, శంకర్ అనే దర్శకుడిని స్టార్ డైరెక్టర్‌గా మార్చితే, తెలుగులో స్టార్ నిర్మాత అయిన ఏ.ఎమ్.రత్నంకు తమిళంలో ఓ సుస్థిర స్థానాన్ని తెచ్చిపెట్టింది. తన అద్భుతమైన నటనతో కమల్ హాసన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాలో స్పృషించిన అంశం సమాజంలో ఉన్నదే. సమాజంలో మాసిపోని లంచం, అవినీతిలను ఓ బలమైన కథతో తెరకెక్కించిన విధానం ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది.
భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందించడం విషయమై నిర్మాత ఏ. ఎమ్. రత్నం తన అభిప్రాయాలను తెలుపుతూ.. “భారతీయుడు సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. ఈ మధ్యే ఈ విషయం గురించి శంకర్‌తో మాట్లాడా. ఆయన కూడా ఈ విషయం పట్ల చాలా ఆసక్తి కనబరిచారు. అయితే ఇదే సమయంలో ఆయన ‘రోబో 2’ సినిమా కోసం సిద్ధమవడంతో, ‘భారతీయుడు 2’ను కొన్నాళ్ళు పక్కనపెట్టా. ‘రోబో 2’ పూర్తవగానే ఈ సినిమా గురించి ఆలోచిస్తా. భారతీయుడుకి సీక్వెల్ మాత్రం కచ్చితంగా ఉంటుంది” అని అన్నారు.
ఏ.ఎమ్. రత్నం తాజాగా తెరకెక్కించిన ఎన్నై అరిందాళ్ తెలుగులో ‘ఎంతవాడు గానీ’ పేరుతో విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన భారతీయుడు 2 గురించి తెలిపారు. గౌతమ్ మీనన్ ఈ సినిమా దర్శకత్వం వహించారు.