
నాని సినిమా అంటే తెలుగు సినీ అభిమానులకు ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఓ మంచి కథ, ఆసక్తికరమైన సాఫ్ట్ కామెడీ నాని సినిమాల్లో సాధారణంగా కనిపిస్తూంటాయి. ఈ ప్రత్యేకతలే తెలుగు సినీ పరిశ్రమలో నానికి హీరోగా ఓ గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా నాని, చిన్న సినిమాల్లో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ‘మారుతి’తో కలిసి చేసిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకంపై మొదటి సినిమాగా రూపొందిన ఈ సినిమాపై మొదట్నుంచీ ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా నిన్న పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఇక అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోతో కలుపుకొని ఇప్పటివరకూ 234,591 డాలర్లు వసూలు చేసింది. ఇండియన్ రూపాయాల్లో ఈ మొత్తం 1.5కోట్ల రూపాయలు. నాని సినిమాకు అమెరికాలో ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి. నాని బ్రాండ్ కామెడీ టైమింగ్, మారుతి క్లీన్ కామెడీ, మతిమరుపు ప్రేమికుడి పాట్లు ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నాయి. నాని సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గోపీసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు బాగా కలిసివచ్చింది.