‘పైసా’ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న సాయి కార్తీక్, ఈ ఏడాది వరుస విజయాలందుకుంటూ బిజీబిజీగా మారిపోయారు. ఇప్పటికే ఈ ఏడాది పటాస్, అసుర సినిమాలతో రెండు హిట్స్ ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా కేటుగాడుతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. తేజస్, చాందిని హీరో హీరోయిన్లుగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) 2015లో చాలా బిజీ అయిపోయినట్టున్నారు. ‘కేటుగాడు’ సినిమా విశేషాలు చెప్పండి?
స) అవునండీ. ఈ ఏడాది నాకు పటాస్, అసుర, జేమ్స్‌బాండ్ లాంటి మంచి విజయాలు వచ్చాయి. కేటుగాడు సినిమా కూడా అదే కోవలో మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది. ఇదొక మంచి కమర్షియల్ సినిమా. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులూ ఉన్నాయి.
ప్రశ్న) ‘కేటుగాడు’ ఆడియోకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
స) కేటుగాడు ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘ఏమో ఏమైందో’ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒక కమర్షియల్ సినిమాకు ఎలాంటి పాటలు అవసరమో అలాంటి పాటలతో కేటుగాడు ఆడియోను రూపొందించాం.
ప్రశ్న) ఈ ఏడాది మీకు వరుస హిట్స్ వచ్చాయి. హిట్స్ వచ్చిన తర్వాత కెరీర్ ఎలా ఉంది?
స) హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఇప్పటివరకూ నా వంతుగా మంచి మ్యూజిక్ ఇచ్చే ప్రయత్నమే చేశా. మొదట్లో కొన్ని సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా, సంగీత దర్శకుడిగా నాకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అయితే సక్సెస్ తెచ్చే ఎనర్జీ మరోరకంగా ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది నాకు స్పెషల్ అనే చెప్పాలి.
ప్రశ్న) ఒక సినిమాకు ఆల్బమ్ రూపొందించాలంటే ఏయే అంశాలు పరిగణలోకి తీసుకుంటారు?
స) ఒక సినిమాకు ఆల్బమ్ రూపొందిస్తున్నామంటే మేజర్‌గా దర్శకుడికి కావాల్సిందేంటి? సినిమా ఏ జానర్‌లో నడుస్తుందీ?అనేది ప్రధానంగా చూస్తా. కమర్షియల్ సినిమాలకు ఒకలా, డిఫరెంట్ సినిమాకు మరోలా ఆల్బమ్ రెడీ చేస్తుంటాం. ఎక్కువగా దర్శకుల టేస్ట్‌కి తగ్గట్టుగా నా స్టైల్లో మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటా.
ప్రశ్న) మీదైన గుర్తింపు కోసం ఎటువంటి కృషి చేస్తుంటారు?
స) ప్రతీ సంగీత దర్శకుడూ ఒక దర్శకుడి ఆలోచన, సినిమా నేపథ్యానికి తగ్గ సంగీతాన్నే అందించాలి అనే విషయంలో సందేహం లేదు. అయితే ఇక్కడే మనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోవడం కూడా చాలా అవసరం. దర్శకులు కోరిన టైప్ పాటనే మనదైన స్టైల్లో, మన బ్రాండ్ ఉండే ట్యూన్‌తో రూపొందించాలి. అప్పుడే ఒక సంగీత దర్శకుడి పాటలకు ఓ ప్రత్యేక గుర్తింపు లభించేది. ఆ దిశగా నేను నా ప్రతీ సినిమాకూ కష్టపడుతూనే ఉన్నా.
ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాలకు సంగీతం అందిస్తున్నారు?
స) ప్రస్తుతం నారా రోహిత్ గారి రెండు సినిమాలకు సంగీతం అందిస్తున్నా. ఇవేకాక దిల్‌రాజు-అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నా. వారాహి సంస్థలో రానున్న మరో సినిమా కూడా ఒప్పుకున్నా. ఇంకా కొన్ని సినిమాలు వస్తున్నాయి. అన్నీ చూసుకొని సెలెక్ట్ చేస్తున్నా.
ప్రశ్న) చివరగా ‘కేటుగాడు’ గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?
స) కేటుగాడు ఒక మంచి కమర్షియల్ సినిమా. కొత్త నిర్మాత వెంకటేష్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి ప్రయత్నం చేశారు. దర్శకుడు కిట్టు కూడా ఈ సినిమాను అన్ని విధాలా అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ప్రేక్షకులు మా ఈ ప్రయత్నానికి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నా.
