
తమిళ స్టార్ హీరో విక్రమ్, సమంతలు హీరో హీరోయిన్లుగా తమిళంలో రూపొందుతోన్న క్రేజీ సినిమా ’10 ఎంద్రతుకుల్ల’. పది లెక్కెపెట్టే లోపు అంటూ థ్రిల్లింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఓ ఆసక్తికర రోడ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకోనుంది. ‘ఐ’ తర్వాత విక్రమ్ చేస్తోన్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై ఈ స్థాయి అంచనాలు ఉండడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక నిన్న సాయంత్రం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ చూశాక సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా ఛేజింగ్ సీన్స్, విక్రమ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, సమంత కొత్త లుక్ ఈ ట్రైలర్లో ఆకట్టుకునే అంశాలుగా నిలిచాయి. ఇక విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 5 లక్షలకు పైనే వ్యూస్ సాధించి ’10 ఎంద్రతుకుల్ల’ దూసుకుపోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.