సమీక్ష : మామ మంచు అల్లుడు కంచు – ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే మామ అల్లుళ్ళు

Mama-Manchu-Alludu-Kanchu telugu review

విడుదల తేదీ : 25 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి

నిర్మాత : మంచు విష్ణు

సంగీతం : కోటి, అచ్చు, రఘు కుంచె

నటీనటులు : మోహన్ బాబు, అల్లరి నరేష్, పూర్ణ, రమ్యకృష్ణ, మీనా..


చాలా రోజుల తర్వాత పద్మశ్రీ డా. మోహన్ బాబు టాలీవుడ్ కామెడీ కింగ్ అయిన అల్లరి నరేష్ తో కలిసి చేసిన సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’. పూర్ణ తో పాటు రమ్యకృష్ణ, మీనా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్. మంచు విష్ణు నిర్మించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఏ మేరకు తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

సిటీలోనే టాప్ బిజినెస్ మాన్ భక్తవత్సలం నాయుడు(డా. మోహన్ బాబు). అందరికీ తెలిసిన నిజం ఆయన ఏకపత్నీ వ్రతుడు, కానీ ఆయనకి మాత్రమే తెలిసిన నిజం ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. మొదటి భార్య సూర్యకాంతం(మీనా) వీరి కుమార్తె శృతి(పూర్ణ). రెండవ భార్య ప్రియంవద(రమ్యకృష్ణ) వీరి కుమారుడు గౌతమ్(వరుణ్ సందేశ్). ఈ ఇద్దరి భార్యల విషయాన్ని మేనేజ్ చేస్యడం కోసం భక్తవత్సలం ఇస్మాయిల్(అలీ) సహకారం తీసుకుంటూ ఉంటాడు. ఒకే రోజు పుట్టిన రోజు కావడం వలన భక్తవత్సలం నాయుడు గౌతమ్ అండ్ శృతిలకు గిఫ్ట్స్ పంపిస్తాడు. కానీ ఇస్మాయిల్ ఇటుది అటు, అటుది ఇటు పంపిస్తాడు. దాంతో జరిగిన తప్పు వలన గౌతమ్ – శృతిలు తమ గిఫ్ట్స్ మార్చుకోవడం కోసం కలవాలనుకుంటారు.

గౌతమ్ శృతి పైన వేరే విధమైన ఆసక్తి ఆడు.. కానీ వారు వరసకి అన్నా చెల్లెళ్ళవుతారు. దాంతో భక్తవత్సలం నాయుడు గౌతమ్ ప్లేస్ లో బాలరాజు(అల్లరి నరేష్)ని ప్రవేశపెట్టి గౌతమ్ మీద నెగటివ్ ఒపీనియన్ వచ్చేలా చేయాలనుకుంటాడు. అలా నుకునే వెళ్ళిన బాలరాజు శృతిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి, వచ్చిన పనినిపక్కన పెట్టి శృతిని ప్రేమలో పడేసే పనిలో పడతాడు. దాంతో భక్తవత్సలం నాయుడు – బాలరాజు మధ్య జరిగిన వార్ ఏంటి? బాలరాజు మీద భక్తవత్సలం ఎత్తులు ఏంవేసాడు ? వాటిని తిప్పికొట్టే ఎత్తులు బాలరాజు ఏం వేసాడు? మధ్యలో ఇద్దరు పెళ్ళాల దగ్గర భక్తవత్సలం ఎలా దొరికిపోయాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

చాలా రోజుల తర్వాత మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా, అలీ లాంటి సీనియర్ యాక్టర్స్ తో పాటు అల్లరి నరేష్, పూర్ణ లాంటి తారలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తూ ఉండడం చూసే వారికి ఓ మంచి ఫ్యామిలీ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ఇస్తుంది. ఇక ఈ సినిమాని మొదటి నుంచి చివరి దాకా మొసుకెల్లింది మాత్రం మోహన్ బాబు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. చాలా రోజుల తర్వాత తన మార్క్ టిపికల్ డైలాగ్ డెలివరీతో, తన 90ల మానరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇద్దరు భార్యల మధ్యా నలిగిపోయే కొన్ని సన్నివేశాల్లో హావ భావాలను బాగా పలికించి, నవ్వించాడు. ఇక ఆయనకి అల్లరి నరేష్ మంచి సపోర్ట్ ఇవ్వడమే కాకుండా సెకండాఫ్ లో వీరిద్దరూ కలిసి నవ్విస్తారు.

ఇక అలనాటి ముద్దుగుమ్మలైన రమ్యకృష్ణ, మీనాలు వారి వారి పాత్రల్లో బాగా చేసారు. ఇక మోహన్ బాబు, నరేష్ లకి సపోర్టర్ గా అలీ అడపాదడపా నవ్వించాడు. పూర్ణ ఇచ్చిన పాత్రలో బాగా చేసింది. వరుణ్ సందేశ్, సోనియాలు చిన్న చిన్న రోల్స్ లో ఓకే అనిపించారు. ఇక సినిమా పరంగా చూసుకుంటే.. సినిమాలో మోహన్ బాబు పాత్ర క్రియేట్ చేసే కొన్ని కన్ఫ్యూజన్స్ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా కొన్ని సార్లు అల్లరి నరేష్ మోహన్ బాబుకి క్రియేట్ చేసే టిపికల్ సందర్భాలు, సెకండాఫ్ లో షాపింగ్ మాల్ సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మామ మంచు అల్లుఅదు కథ కోసం అల్లరి మొగుడు సినిమాకి కంటిన్యూషన్ అనేలా కథని సిద్దం చేసాడు. కానీ ఆ కథని చాలా రెగ్యులర్ ఫార్మాట్లో రాసుకోవడం మైనస్ అయ్యింది. కథ రెగ్యులర్ అయినా పర్లేదు కానీ కథనం మీద కూడా శ్రీనివాస్ రెడ్డి సరైన జాగ్రత్త తీసుకోలేదనిపిస్తుంది. ఎందుకంటే చాలా సీన్స్ మరియు ట్విస్ట్ లని ప్రేక్షకులు ఊహించేయగలరు. దానికి తోడు సినిమా నెరేషన్ చాలా స్లోగా ఉంది. ఎక్కడా సినిమాని వేగవంతంగా నడిపించాలనే ప్రయత్నం కనిపించలేదు.మెయిన్ గా కథనం – నేరేషన్ మీద ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అల్లరి నరేష్ ఓకే అనిపించాడు, కానీ పాత్రకి ఇంకాస్త ప్రాధాన్యత ఉంది ఉంటే బాగుండేది.

ఇకపోతే సినిమాలో కామెడీ ఉంది.. కానీ కథ ప్రకారం సినిమాలో ఇంకా ఎక్కువగా కామెడీ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ డైరెక్టర్ ప్రయత్నం చేయలేదు. దానివలన ఆడియన్స్ కామెడీ ఇంకా స్కోప్ ఉన్నా ఆ అవకాశాన్ని డైరెక్టర్ ఎందుకు మిస్ అనే ఆలోచనలో పడతారు. ఇకపోతే సినిమా రన్ టైంని కూడా మొత్తం మీద ఓ 10 నిమిషాలు తగ్గిస్తే సినిమా ఇంకాస్త వేగంగా తయారవుతుంది. కథనం వీక్ అవ్వడం వలన సెకండాఫ్ ముగింపుకు చేరుకునే సరికి మరింత ఊహాజనితంగా మారుతుంది. క్లైమాక్స్ ని కూడా చాలా సింపుల్ గా ముగించేసారు, ఇంకాస్త ఎమోషనల్ గా రాసుకొని ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

బాలమురుగన్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఆయనకి ఇచ్చిన లొకేషన్స్ ని చాలా కలర్ఫుల్ గా, గ్రాండ్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కోటి, అచ్చు, రఘు కుంచే కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. సాంగ్ బాలేకపోయినప్పటికీ నేపధ్యంలో వాడుకున్న పాటలు బాగున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్ద చెప్పుకునే స్థాయిలో లేదు. గౌతంరాజు ఇంకాస్త స్పీడ్ గా ఉండేలా సినిమాని ఎడిట్ చేయాల్సింది. శ్రీధర్ సీపాన డైలాగ్స్ లో సగం పేలితే సగం మాత్రం పేలలేదనే చెప్పాలి.

ఇక శ్రీనివాస్ రెడ్డి రాసుకున్న కథనంఫస్ట్ హాఫ్ పరంగా బాగానే అనిపించినా, సెకండాఫ్ పరంగా పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక డైరెక్టర్ గా నటీనటుల నుంచి మంచి నటనని రాబట్టుకోవడంలో, లాగే కొన్ని సీన్స్ లో సందర్భానుసారంగా వచ్చే కామెడీని మెప్పించగలిగాడు. కానీ ఆధ్యంతం ఆసక్తిని క్రియేట్ చేసి ఆడియన్స్ ని కూర్చో పెట్టడంలో కొంతమేరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. మంచి విష్ణు నిర్మాణ విలువలు మాత్రం సినిమాకి గ్రాండియర్ ని తెచ్చి పెట్టాయి.

తీర్పు :

మంచు మోహన్ బాబు చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసి ప్రేక్షకులను నవ్వించే సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’. మోహన్ బాబు కామెడీ టైమింగ్, ఆయన పంచ్ లు, హావ భావాలతో సినిమాని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. మోహన్ బాబు నటన, అల్లరి నరేష్ సపోర్ట్, స్టార్ నటీనటులు, మరియు అక్కడక్కడా నవ్వించే కామెడీ సినిమాకి ప్రధాన హైలైట్స్ అయితే, ఓల్డ్ ఫార్మాట్ లో అనిపించే కథ, కథనం లతో పాటు స్లోగా సాగే నెరేషన్, ఇంకాస్త బెటర్ గా కామెడీ ఉంటే బాగుండు అనిపించడమే ఈ సినిమాకి మైనస్. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేయదగిన సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version