మాస్ పాటలకు ఉండే క్రేజే వేరు. పాట బాగుంటే ఆ పాటను చూడటం కోసమైనా మళ్లీ మళ్లీ సినిమాకు వస్తుంటారు ప్రేక్షకులు. అంత అట్రాక్షన్ ఉంటుంది ఆ పాటల్లో. ఈమధ్యే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’చిత్రంలోని ‘దిమ్మాక్ ఖరాబ్’ పాట కూడా అలాంటిదే.
మణిశర్మ సంగీతం అందించిన ఈ పాట ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. థియేటర్లో బీ, సీ సెంటర్ల చేత స్టెప్పులు వేయించిన ఈ పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్ కలిసి వేసిన మాస్ స్టెప్స్,
లిరిక్స్, సంగీతం, చిత్రీకరించిన విధానం అన్నీ చక్కగా కుదరడంతో పాటకు బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్.
మూడు రోజుల క్రితమే అధికారికంగా పాటను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు. మూడు రోజుల్లో పాటకు 10 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఇంకా పాట ట్రెండింగ్లోనే ఉంది. మొత్తానికి పాట సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత కూడా ప్రేక్షకుల దిమ్మాక్ ఖరాబ్ చేస్తూనే ఉంది.
