తమన్నా కెరీర్లో చేసిన అతి పెద్ద సినిమాలు ‘బాహుబలి, సైరా’. వీటిలో ‘సైరా’ కంటే ‘బాహుబలి’ చిత్రమే భారీ చిత్రం. కానీ తమన్నాకు మంచి పేరు తీసుకొచ్చింది మాత్రం ‘సైరా’ చిత్రమే. ‘బాహుబలి’లో తమన్నా సెకండ్ హీరోయిన్ అయినా, రెండు భాగాల్లో కనిపించినా ఆమె పాత్ర నిడివి తక్కువ కావడం, సాదాసీదాగా ఉండటంతో అనుష్క పాత్రకు వచ్చినంత గుర్తింపు ఆమెకు రాలేదు.
కానీ ‘సైరా’లో అలా కాదు. ఆమెకు చిరుకు మద్యన లవ్ ట్రాక్, కథానాయకుడి ఆశయాల కోసం ఆమె చేసే త్యాగం, పాత్రలో నటించడానికి ఎక్కువ స్కోప్ ఉండటం, అన్నిటికీ మించి కొన్నాళ్లపాటు పాత్ర గుర్తుండిపోయేలా ఆమె నటించిన తీరు అన్నీ కలిసి తమన్నాకు కెరీర్లోనే బెస్ట్ కాంప్లిమెంట్స్ దక్కేలా చేశాయి.
అసలు సినిమాలో చిరు తర్వాత అంత మంచి పెర్ఫార్మెన్స్ తమన్నాదే అంటున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంతటి వ్యక్తే ప్రత్యేకంగా ఆమెను పొగిడారు. మొత్తానికి మిల్కీ బ్యూటీ ‘బాహుబలి’తో కొంచెం నిరుత్సాహపడినా ‘సైరా’తో అంతకు పదింతల ఫలితాన్ని అందుకుంది. అంతేకాదు చారిత్రక నేపథ్యం ఉన్న కథలకు అమె చక్కగా సరిపోతుందనే అభిప్రాయం దర్శక నిర్మాతల్లో ఈపాటికే ఏర్పడే ఉంటుందనటంలో సందేహం లేదు.
