రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ తదుపరి షెడ్యూల్ ప్లాన్ లో ఉన్నారు. ఇటీవల విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన షెడ్యూల్ ముగియడంతో తదుపరి షెడ్యూల్ మొదలుకావడానికి కొంత సమయం ఉందని తెలుస్తుంది. ఈ విరామంలో ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీతో గడపడంతో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. రామ్ చరణ్ నేడు విజయవాడలో సందడి చేశారు. అక్కడ హాప్పీ మొబైల్ షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. చరణ్ రాకను తెలుసుకున్న అభిమానులు అక్కడికి చేరుకొని చరణ్ కు ఘనస్వాగతం పలికారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం రోల్ చేస్తున్న ఎన్టీఆర్ అప్పీ ఫిజ్జ్ వ్యాపార ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రముఖ శీతల పానీయాల సంస్థ పార్లీ ఆగ్రో ఉత్పత్తి అయిన అప్పీ ఫిజ్జ్ ప్రచార కర్తగా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వ్యాపార ప్రకటన షూటింగ్లో పాల్గొన్న ఎన్టీఆర్ బ్లాక్ జాకెట్ ధరించి..సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. ఇలా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విరామంలో ఈ హీరోలు తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాతగా 300కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ ఏడాది జులై 30న విడుదల కానుంది.
