పెద్ద హీరోల సినిమా షూటింగ్ అంటే పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటం జరుగుతుంటుంది. ఇదే ఒక్కోసారి ఇబ్బందులకు దారితీస్తుంటుంది. అత్యుత్సాహంతో ఫ్యాన్స్ తీసే చిత్రీకరణనూ ఫోన్ల ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో వదులుతుంటారు. దీని మూలంగా నటీనటుల లుక్స్, కొన్ని సన్నివేశాల సారాంశాలు ముందుగానే తెలిసిపోతుంటాయి. తాజాగా ఈ సమస్య విజయ్ చేస్తున్న ‘మాస్టర్’ చిత్రానికి తలెత్తింది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. ఇందులో విజయ్ సేతుపతి కూడా పాల్గొంటున్నారు. ముందుగా సేతుపతి లుక్ ను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు టీమ్. కానీ షూటింగ్ చూడటానికి వచ్చిన జనంలో కొందరు సేతుపతి కెమెరా ముందు నటిస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఆయన లుక్ కాస్త రివీల్ అయిపోయింది.
దీంతో చిత్ర బృందం నిరుత్సాహానికి గురైంది. ఇకపై ఇలా జరగకుండా ఉండేందుకు సెక్యూరిటీనీ టైట్ చేసి లొకేషన్లలోకి ఎవరూ సెల్ ఫోన్లు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది.
