
‘కెజిఎఫ్’ సాధించిన విజయంతో సినీ పరిశ్రమలన్నీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వైపే దృష్టి పెట్టాయి. స్టార్ హీరోలు, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా చేయాలని తహతహలాడిపోతున్నారు. అయితే ఆయన్ను ముందుగా రీచ్ అయింది టాలీవుడ్ పెద్దలే. ‘కెజిఎఫ్’ హిట్టవగానే సంప్రదింపులు మొదలుపెట్టిన మైత్రీ మూవీస్ లాంటి నిర్మాణ సంస్థలు ఆయన్ను లాక్ చేసుకున్నాయి. ప్రభాస్, ఎన్టీఆర్ లతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ సెట్టయ్యాయి. అయితే ఈ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి, ముందుగా ప్రభాస్ సినిమానా లేకపోతే ఎన్టీఆర్ సినిమానా అనే విషయాల్లో ఎంతకీ క్లారిటీ రావట్లేదు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక నెటిజన్ తెలుగులో ముందుగా ప్రభాస్ సినిమా చేస్తారా లేకపోతే ఎన్టీఆర్ సినిమా చేస్తారా అని అడగ్గా ప్రశాంత్ నీల్ ఏ ప్రాజెక్ట్ అయినా ముందుగా ‘కెజిఎఫ్ 2’ బాధ్యతలు నెరవేర్చాకే చెబుతానని సమాధానం ఇచ్చారు. అంటే ‘కెజిఎఫ్ 2’ విడుదల తర్వాతే ప్రశాంత్ నీల్ తన తెలుగు ప్రాజెక్ట్ ఎవరితో అనేది అనౌన్స్ చేస్తారన్నమాట. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఉంది. బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరిపితే సినిమా ముగుస్తుంది. ఇంకొద్దిరోజుల్లో విడుదల మీద కూడ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.