
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయాన్ని విరమించుకున్న సంగతి తెలిసిందే. దీంతో లక్షలాది మంది అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. డిసెంబర్ 31న రజినీ పార్టీని ప్రకటిస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో ఇలా జరగడంతో నొచ్చుకున్నారు. రాజకీయ వర్గాల్లో సైతం రజినీ నిర్ణయం సంచలనం రేపింది. ఇక నాలుగు రోజుల్లో పార్టీని ప్రకటించాల్సి ఉండగా ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు సూపర్ స్టార్. ఆ పరిణామంతో కఠినమైన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఆయన.
రజినీ నిర్ణయం పట్ల ఆయన అభిమానులే కాదు రజినీకి అత్యంత సన్నిహితుడు, నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. రజినీ నిర్ణయం తనను కూడ నిరుత్సాహపరిచిందని కానీ అన్నింటికంటే రజినీ ఆరోగ్యమే తనకు ముఖ్యమని అన్నారు. ప్రస్తుతం రాజకీయ ప్రచారంలో ఉన్న ఆయన అది పూర్తవగానే రజినీని కలుస్తానని చెప్పారు. పోతే కమల్ హాసన్ వచ్చే తమిళనాడు ఎన్నికల్లో వీలైతే రజినీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని అనుకున్న సంగతి విథితమే.