రజినీ తప్పుకోవడంతో విజయ్ మీద పడిపోతున్నారు


తమిళ సినిమా పరిశ్రమలో హీరోలకు అభిమానుల వైపు నుండి వినబడే ప్రధాన డిమాండ్ రాజకీయాల్లోకి రమ్మని. సినీ హీరోలను రాజకీయాల్లో చూడటం తమిళ ప్రజలకు మహా ఇష్టం. అందుకే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నవారిని సినిమాల్లోకి రావాలని తరచూ అడుగుతుంటారు. నిన్నటివరకు ఈ ఒత్తిడి సూపర్ స్టార్ రజినీకాంత్ మీద ఎక్కువగా ఉండేది. ఆయన పార్టీ పెడితే చూడాలని లక్షలాది మంది అభిమానులు అనుకున్నారు. రజినీ సైతం అన్నీ సిద్ధం చేసుకుని ఇంకో రెండు రోజుల్లో పార్టీని ప్రకటిస్తారు అనగా ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్టు చివరి క్షణంలో తెలిపారు. దీంతో తమిళ రాజకీయాల్లో రజినీ ప్రస్తావనకు తెరపడింది.

ఆయన అభిమానులైతే తీవ్ర నిరుత్సాహంతో వెనక్కి తగ్గారు. అయితే వెంటనే మరొక స్టార్ హీరో విజయ్ అభిమానులు హడావుడి మొదలుపెట్టారు. విజయ్ ను కూడ రాజకీయాల్లోకి రమ్మని ఆయన అభిమానులు ఎన్నాళ్లగానో కోరుతూ ఉన్నారు. విజయ్ సైతం తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని కానీ పార్టీ పెట్టనని కానీ ఎప్పుడూ చెప్పలేదు. కనుక ఆయనలో కూడ పొలిటికల్ ఎంట్రీ మీద ఆసక్తి ఉందనేది వాస్తవం. అందుకే ఆయన అభిమానులు రజినీ పార్టీ పెట్టబోరని తెలియడంతో విజయ్ ప్రస్తావన తీసుకొచ్చారు. త్వరలో విజయ్ పార్టీని ప్రకటిస్తారని సామజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాట నెలకొన్న పొలిటికల్ వాక్యూమ్ ను భర్తీ చేయగలిగేది విజయ్ ఒక్కరే అంటున్నారు. మరి ఈ ప్రచారం మీద విజయ్ పరోక్షంగానైనా స్పందిస్తారేమో చూడాలి.

Exit mobile version