విడుదల తేదీ : 18 జనవరి 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5 |
||
దర్శకుడు : శశాంక్ |
||
నిర్మాత : ఆక్న గౌడ్ | ||
సంగీతం : శ్రీధర్ |
||
నటీనటులు : అజయ్ రావు, రాధిక పండిట్ |
రెండు సంవత్సరాల క్రితం కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కృష్ణన్ లవ్ స్టొరీ’ అనే సినిమాని తెలుగులో ‘కృష్ణ లవ్స్ గీత’ అనే పేరుతో డబ్ చేసారు. విడుదల విషయంలో జాప్యం జరిగి ఆలస్యంగా ఈ రోజు విడుదలైంది. అజయ్ రావు, రాధిక పండిట్ జంటగా నటించిన ఈ సినిమాకి శశాంక్ దర్శకుడు. తెలుగులో ఆర్. కె ఆక్న గౌడ్ విడుదల చేసిన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
కృష్ణ (అజయ్ రావు) మిడిల్ క్లాస్ ఫామిలీలో పుట్టిన యువకుడు. గీత కూడా మిడిల్ క్లాస్ కుటుంబంలో పెరుగుతుంది. గీత తండ్రి కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోవడం, అన్న తాగుబోతు కావడంతో తల్లి కుటుంబాన్ని పోషిస్తుంది. కృష్ణ, గీతని (రాధిక పండిట్) మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తన కుటుంబ పరిస్థితి చూసి తనకి ప్రేమంటే నచ్చదు అంటుంది. మరోవైపు ధనవంతుల బిడ్డ అయిన నరేంద్ర (ప్రదీప్) కూడా గీతని ప్రేమిస్తున్నా అంటూ వెంట పడతాడు. గీత కుటుంబం ఆపదలో ఉన్న సమయంలో కృష్ణ, నరేంద్ర ఇద్దరూ ఆదుకుంటారు. గీత, కృష్ణని ప్రేమిస్తున్నానంటూ ఎవరికీ చెప్పకుండా నరేంద్రతో లేచిపోతుంది. రోడ్ ప్రమాదంలో నరేంద్ర చనిపోవడంతో మళ్లీ సొంత గూటికి చేరుకుంటుంది. గీత తప్పు చేసినా ఆమెని ఆదరించి పెళ్లి చేసుకోవడానికి కృష్ణ సిద్ధమవుతాడు. ఈ సమయంలో గీత ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అసలు గీత ఎవరికీ చెప్పకుండా నరేంద్రతో ఎందుకు వెళ్ళిపోయింది?
ప్లస్ పాయింట్స్ :
యదార్ధ ప్రేమ గాధకి కొంత సినిమాటిక్ మసాలా జోడించి ఈ సినిమాని తీసారు. అజయ్ రావు పర్వాలేదు బాగానే చేసాడు. తెలుగు వారికి పెద్దగా నచ్చకపోవచ్చు కానీ కన్నడంలో మంచి పేరున్న నటుడు మరి. రాధిక పండిట్ చూడడానికి బావుంది. యాక్టింగ్ కూడా బాగా చేసింది. కృష్ణతో ప్రేమ సన్నివేశాల్లో బబ్లీగా చేసింది. మిగతా వారిలో చెప్పుకోతగ్గ నటులు ఎవరూ లేరు. ఫస్ట్ హాఫ్ స్టొరీ అంతా కృష్ణ, గీత ప్రేమ కథ సన్నివేశాలు చూపిస్తూ బాగానే నడిపించాడు. కృష్ణ అమాయకత్వం వల్ల వేరే కామెడీ భాద్యత కూడా అతనే మోసాడు. పార్టీ ఇస్తానంటూ కాఫీ డేకి తీసుకెళ్ళే సీన్స్ కూడా బావున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా లవ్, కామెడీ సన్నివేశాలతో నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ దగ్గర మాత్రం అనుకోని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్ట్ తెలుగు ప్రేక్షకులకు మింగుడు పడదు. అప్పటి వరకు కృష్ణని ప్రేమిస్తున్నట్లు నటించి ఒక్కసారిగా నరేంద్రతో లేచిపోవడం అస్సలు మింగుడు పడదు. దీనికి తోడు సెకండ్ హాఫ్ అంతా డల్ గా నడిపించాడు. గీత, నరేంద్రతో ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పేలోపు సగం సినిమా ఐపోయింది. పోనీ ఆ కారణం అయినా బావుందా అంటే ఆమె చెప్పిన కారణం చూసాక ఆమె పాత్ర మీద ఉన్న జాలి కాస్తా ద్వేషంగా మారింది. సెకండ్ హాఫ్ అంతా గీత పిచ్చి దానిలా ప్రవర్తించడం, ఆమె ఏం చేసినా నేను అంగీకరిస్తా అనడం ఇవన్ని సినిమాటిక్ గా ఉన్నాయి. చివరికి కథ సుఖాంతం అయిందా అంటే అదీ లేదు. అనవసరమైన విషాదమైన ముగింపు ఇచ్చాడు. పైన చెప్పుకున్నవన్నీ తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించని అంశాలు.
సాంకేతిక విభాగం :
శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ కన్నడ సినిమాల స్థాయిలోనే ఉంది. సినిమా అంతా డల్ మూడ్ లో ఉంది. శ్రీధర్ అందించిన సంగీతంలో హృదయమే పాట ఒక్కటి వినసొంపుగా ఉంది. మిగతావన్నీ వచ్చి వెళ్ళిపోయాయి. నేపధ్య సంగీతం మాత్రం కృష్ణ, గీత మధ్య ప్రేమ సన్నివేశాల్లో బావుంది. కన్నడ సినిమాలన్నీ లో బడ్జెట్ తో ఉంటాయి. లో బడ్జెట్ అవడం వల్ల ఖర్చు విషయంలో మరీ మొహమాట పడి మరీ సింపుల్ గా తీసారు.
తీర్పు :
ప్రేక్షకుడు సినిమాకి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోరుకుని. సరదాగా ప్రేమ కథ అని స్టార్ట్ చేసి అర్ధం పర్ధం లేని ట్విస్టులు ఇస్తూ అవసరం లేని విషాదమైన ముగింపునిచ్చిన ఈ సినిమా ధియేటర్ దాకా వెళ్లి చూడాల్సిన అవసరం లేదు. పోనీ కొత్తగా ఏమైనా ఉందా అంటే అదీ లేదు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
అశోక్ రెడ్డి .ఎమ్