తెలుగు సినీ పరిశ్రమలో చిన్న నిర్మాతలు కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యల పరిష్కారం కోసం తాము కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగ న్మోహన్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరామని నిర్మాత నట్టికుమార్ తెలిపారు. దాంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పరిశ్రమకు చెందిన ఓ బృందం ఏపీ సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో పరిశ్రమకు చెందిన కొందరు ఆహ్వానితులు భేటీ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ భేటీకి చిన్న నిర్మాతలను పిలవలేదని నట్టికుమార్ ఆ మధ్య ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో చిరంజీవి టీమ్ కు సెప్టెంబర్ 4వ తేదీ అపాయింట్ మెంట్ ఇచ్చారన్నట్టు మీడియాలో వార్తలు వస్తుండటంతో సోమవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో నట్టికుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ, చిరంజీవి బృందంలో తమ చిన్న నిర్మాతలకు ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని, వాస్తవానికి ఆయనను మేము ఎంతో గౌరవిస్తామని అన్నారు. చిన్న నిర్మాతల సమస్యలను ముఖ్యమంత్రిని కలిసినపుడు చిరంజీవి తీసుకుని వెళతారని విశ్వసిస్తున్నానని, ఒకవేళ ఆయన తమ సమస్యలను ఏకరువు పెడితే సంతోషమే అంటూ చెప్పుకొచ్చారు. అయినా చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ సమస్యలను 20 మందితో కూడిన బృందం వేరొకటి ఏపీ ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగామని, 35 జీవో అనేది చిన్న నిర్మాతల, అలాగే పరిశ్రమ పాలిట కల్పతరువు అని, ఎట్టి పరిస్థితులలో దానిని ఉపసంహరించరాదు అన్నది తమ విన్నపం అని అన్నారు. అలాగే టిక్కెట్ రేట్స్ 100 రూపాయలు మించరాదన్నది తమ మరో విజ్ఞప్తి అంటూ చెప్పుకొచ్చారు. ఇక బి. సి. సెంటర్స్ లో మరీ తక్కువగా ఉన్న టిక్కెట్ల రేట్లను ఇంకాస్త పెంచాలని, బ్లాక్ టిక్కెట్లు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని తాము సీఎంను కోరబోతున్నాం అని అన్నారు. కొందరు పెద్ద నిర్మాతలు, ఇంకొందరు సినీ ప్రముఖులు పరిశ్రమ మనుగడ కంటే వారి కోట్ల సంపాదనే చూసుకుంటున్నారని, చిన్న నిర్మాతలను ఏ రోజు వారు పట్టించుకోలేదని, ఈ తడవ అలాంటి కుయుక్తులకు అడ్డుకట్టవేయాలన్న సంకల్పంతో తాము సీఎంను కలవాలనుకుని నిర్ణయించుకున్నాం అని చెప్పారు.
