తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై ఆర్. నారాయమూర్తి హాట్ కామెంట్స్

R Narayana Murthy

ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పులేదని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి అన్నారు. అదే సమయంలో హరిహర వీరమల్లు పేరుతో పర్సంటేజి సమస్యను పక్కదారి పట్టించారని ఆయన ఆక్షేపించారు.

రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించారు
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరిట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవార్డులు ప్రకటించడం నాకు మాములు ఆనందంగా లేదు. చాలా హ్యాపీ. ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆయన టీమ్ కు నా నమస్కారాలు. అలాగే అవార్డు గ్రహీతలకు నా అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగానైతే గద్దరు అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నంది అవార్డులు కూడా మన చంద్రబాబునాయుడు అక్కడ ప్రకటించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా.

పర్సంటేజి అంశాన్ని హరిహర వీరమల్లుకు ముడిపెట్టడం సరికాదు
ఇటీవల సినీ పరిశ్రమలో పర్సంటేజి విధానం కావాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ లో చర్చల జరుగుతున్నాయి. ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినీ పరిశ్రమలో పర్సంటేజి సిస్టమ్ వస్తుందా అని ఎదురుచూస్తున్ దశలో.. నా లాంటి సగటు నిర్మాతలందరికి తీరని విఘాతం జరిగింది. పర్సంటేజి ఇవ్వకపోతే హరిహర వీరమల్లు అనే సినిమాను ఆపడం కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ ప్రకటిస్తున్నారనే మాట రావడం చాలా దుర్మార్గం. అదంతా ఉత్తదే. అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది, ఆ కుట్ర దారులెవరో తెలుసుకోవాలని స్వయంగా పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా… ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమ యొక్క పాలన సంస్థలు. ఆ రెండు సంస్థలు ఎప్పుడు బంద్ ప్రకటిస్తామని ఎప్పుడు చెప్పలేదు. డిస్కన్షన్ ఆన్ గోయింగ్ అని చెప్పారు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్తం. ఎవరైనా సినీ పరిశ్రమలో బంద్ ప్రకటించే ముందు నిబంధనల ప్రకారం మూడు వారాల ముందుగా తెలియజేయాలి. ఒక సమస్య మీద మేం పోరాడుతున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు. కాబట్టి మేం బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియజేయాలేది నిబంధన. మూడు వారాల ముందు తెలియజేస్తే విడుదల తేదీ ప్రకటించుకున్నవాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. జూన్ 1న బంద్ ప్రకటిస్తే ఒకవేళ… జూన్ 12 అంటే రెండు వారాలు కూడా కావు కదా. ఏ రకంగా హరిహర వీరమల్లుకు బంద్ వర్తిస్తుంది. అది కరెక్ట్ కాదు.

25 ఏళ్లుగా రగులుతున్న రావణకాష్టం… పర్సంటేజి సమస్య
పర్సంటేజ్ సిస్టమ్ వల్ల సినీ పరిశ్రమకు చాలా మేలు జరుగుతుంది. ఆ విధానం లేకపోవడం వల్ల సగటు నిర్మాత తీవ్రంగా నష్టపోతున్నాడు. మాల్స్, మల్టీప్లెక్స్ లు వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్లకు ఉనికి లేకుండా పోతుంది. భారతదేశంలో సినీమా అనేది సామాన్య ప్రేక్షకుడికి వినోదం. అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తున్నాయి ఈ విధానాలు. సింగిల్ థియేటర్లను బతికించుకోవాలి. దానికి పర్సంటేజ్ విధానం కావాలి. పర్సంటేజ్ విధానం ఇవాళ్టి సమస్య కాదు. 25 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ఈ పర్సంటేజ్ విధానం కావాలని కోరిన వాళ్లలో నేను కూడా ఒకణ్ని. ఇది చాలా పెద్ద సమస్య. 25 ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. అలాంటిది ఇవాళ పర్సంటేజి సిస్టమ్ కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సమంజసంగా లేదు. పర్సంటేజ్ సమస్యను పక్కదారి పట్టించారు. హరిహర వీరమల్లును ఫోకస్ చేశారు.

పవన్ కళ్యాణ్… అది మీ వల్లే సాధ్యమవుతుంది
పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా సినీ పరిశ్రమ పెద్దలు సీఎంను కలిసి పలకరించవచ్చు కదా అని అడిగారు. మర్యాద పూర్వకంగా కలవొచ్చు కదా అని అడిగారు. వారు అడిగినట్లు కలువాలి. కలుస్తాం. పూర్వకాలంలోప్రజలకు ఏదైనా సమస్య వస్తే ధర్మగంట కొడితే రాజుల దగ్గరికి వెళ్లేవాళ్లు. దానికంటే ముందే రాజులే ప్రజల దగ్గరకు వెళ్లే వాళ్లు. రచ్చబండ పెట్టేవాళ్లు. ప్రజలకు ఏం సమస్యలున్నాయో చెప్పాలని అడిగేవాళ్లు. అక్కడిక్కడే తీర్పులు చెప్పేవాళ్లు. సమస్యలకు పరిష్కారం చూపేవాళ్లు. ప్రజలకు మేలు చేసేవాళ్లు. అలాగా మీ మంత్రులు కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు సినీ పరిశ్రమను పిలిచి మీకు ఏం సమస్యలున్నాయి, మీకేం చేయాలి అని అడిగితే మేం చాలా ఆనందపడేవాళ్లం. మేం మీ బిడ్డలం. మేం మీకు ఓట్లు వేసినోళ్లం. మిమ్మల్ని కుర్చీల్లో కూర్చోబెట్టినోళ్లం. మా బాధ్యత చూసుకోవాల్సింది మీరే. అదే సమయంలో ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా మాకుంది. పర్సంటేజి విధానాన్ని పక్కకు పెట్టొద్దు. సింగిల్ థియేటర్లు వాళ్లు మనోళ్లు, ఇక్కడోళ్లు. సినిమా అంటే అభిరుచితో థియేటర్లు కట్టుకున్నవాళ్లు. సినిమా తల్లినే నమ్ముకున్నవాళ్లు. సినిమా థియేటర్ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి.

ఆటో డ్రైవర్ తమ్ముడో ఏమన్నాడో తెలుసా….?
నేను ఆటోల్లో ప్రయాణిస్తుంటా. ఓ రోజు తమ్ముడు ఫలానా సినిమా చూశావా అని ఆటో డ్రైవర్ ను అడిగా. దానికి ఆ డ్రైవర్ తమ్ముడు ఏమన్నాడంటే… “సినిమా చూడాలని ఉంది. కానీ టికెట్ ధరలు చాలా ధరలు పెంచారు. ఆ సినిమా హీరో ఫేవరేట్ . నా దగ్గర డబ్బుల్లేవ్, అప్పు చేయాలంటే కష్టంగా ఉంది. చూడలేకపోతున్నాను” అన్నాడు.

మనది సంక్షేమ రాజ్యం
టికెట్ ధరలు పెంచితే సినిమాకు ఎంత నష్టం జరుగుతుందో చూడండి. ఎందుకు ధరలు పెంచుతారు. మన సిస్టమ్ ను, నిబంధనలను గౌరవించాలి. అన్నింటికి మించి మనది సంక్షేమ రాజ్యం. సగటు ప్రేక్షకుడికి భారతదేశంలో సినిమానే వినోదం. ఆ వినోదాన్ని ఈ రకంగా దూరం చేయొద్దు. భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు టికెట్ ధరల పేరుతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. వారిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అది సరైన పద్దతి కాదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబునాయుడు గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని నా విజ్ఞప్తి.

Exit mobile version