టాలీవుడ్ స్టార్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వైభవంగా వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లికి ముందే ఈ జంట ఒక ప్రొఫెషనల్ కమిట్మెంట్ను పూర్తి చేసే పనిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, విజయ్ మరియు రష్మిక కలిసి ఒక కొత్త యాడ్ షూట్లో నటించబోతున్నారు. గతంలో వీరు కలిసి ఒక సోప్ యాడ్‌లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.
ఈ కొత్త యాడ్‌కు సంబంధించిన వివరాలను ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినప్పటికీ, పెళ్లి వేడుకలకు ఆటంకం కలగకుండా ఈ షూటింగ్‌ను చాలా వేగంగా పూర్తి చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్రొఫెషనల్ విషయానికొస్తే, ఈ రీల్ అండ్ రియల్ లైఫ్ కపుల్ త్వరలో ‘రణబాలి’ అనే పీరియడ్ యాక్షన్ డ్రామాలో కలిసి నటించబోతున్నారు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
చాలా కాలంగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, ఈ పెళ్లి వార్తతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఉదయపూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని, అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం.
