పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం తన సినిమాను వెనకేసుకొస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు, ఫ్యాన్ మీట్స్‌లో పాల్గొంటూ సినిమాను అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై ఆయన ఘాటుగా స్పందించారు. తన తల్లిదండ్రులే తనను మొదట ట్రోల్ చేశారని, డైరెక్టర్ అవుతానన్నప్పుడు వారు కూడా నమ్మలేదని హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆన్‌లైన్ ట్రోలర్ల గురించి మాట్లాడుతూ.. ‘వాళ్లు ఎవరో, ఎక్కడి నుండి వస్తారో తెలియదు. వాళ్లకు కనీసం తమ గుర్తింపును బయటపెట్టే ధైర్యం కూడా లేదు. అలాంటి వారిని నేను అస్సలు సీరియస్‌గా తీసుకోను’ అని హరీష్ స్పష్టం చేశారు. ఒకవేళ తాను ట్రోల్స్‌ను పట్టించుకుని ఉంటే ఈపాటికే సోషల్ మీడియా నుండి తప్పుకునేవాడినని చెప్పారు. ఎవరైనా హద్దు మీరి అసభ్య పదజాలం వాడితే బ్లాక్ చేయడమే కాకుండా, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.
అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ, సినిమాను సకాలంలో థియేటర్లలోకి తీసుకురావడమే తన అతిపెద్ద విజయం అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అవుట్‌పుట్ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని, ప్రేక్షకులు ఈ యాక్షన్ డ్రామాను ఆస్వాదిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
