ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) గారు వృద్ధాప్య సమస్యల కారణంగా ఈరోజు(మార్చి 30) ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలియగానే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రకాష్ రాజ్‌కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
సువర్ణలత గారి అంత్యక్రియలు నేడు సాయంత్రం బెంగళూరులో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తల్లితో ఎంతో అనుబంధం ఉన్న ప్రకాష్ రాజ్, ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన ఎదుగుదలలో తల్లి పాత్ర ఎంతో ఉందని ఆయన గతంలో పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. ప్రకాష్ రాజ్ తల్లిగారి మరణ వార్త తెలిసిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్‌కు తన సంతాపం ప్రకటించారు.
దక్షిణాది సినీ రంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాశ్ రాజ్, ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ విషాద సమయంలో ఆయనకు ధైర్యాన్ని ప్రసాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
