ఓటీటీ సమీక్ష : బ్యాచ్‌మేట్స్ (4 ఎపిసోడ్స్) – జియో హాట్‌స్టార్‌లో తెలుగు వెబ్ సిరీస్

Batchmates Reiew

ఓటీటీ స్ట్రీమింగ్ తేది : ఏప్రిల్ 30, 2026
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : జియో హాట్ స్టార్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సాయి శ్రీరామ్ వెంపరాల, సింధు రెడ్డి, గీర్వాణి రెడ్డి, ఆంథోని కార్తీక్, బిందు మాధవి తదితరులు
దర్శకుడు : శ్రీ హర్ష శెట్టి
నిర్మాతలు : సకమూరి నారాయణ స్వామి, నితిన్ సాయి చల్లాగుల్ల
సంగీతం : సాయి దేవా హర్ష
ఛాయాగ్రహణం : సాయి తేజ కళ్ల
ఎడిటింగ్ : రాగం సత్య నితేష్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో హాట్‌స్టార్‌లో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘బ్యాచ్‌మేట్స్’ అనే తెలుగు వెబ్ సిరీస్ నేటి నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, ఈ వెబ్ సిరీస్ నుంచి ప్రస్తుతానికి నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి కాలేజీ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

సిద్(సాయి శ్రీరామ్ వెంపరాల), సామ్మి(సింధు రెడ్డి), మిల్కీ మహేష్(ఆంథోని కార్తీక్) బీటెక్ కాలేజీలో కొత్తగా చేరుతారు. అక్కడ వారు ఎదుర్కొన్న పరిస్థితులు, పరిచయం అయిన కొత్త స్నేహితులు, వారి మధ్య ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి.. అనేది ఈ వెబ్ సిరీస్ కథగా మనకు చూపెట్టారు. అయితే, కేవలం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్‌కు రావడంతో ఇప్పటివరకు సాగిన కథ చాలా రొటీన్ టెంప్లేట్‌గా అనిపిస్తుంది. మిగతా ఎపిసోడ్స్ వస్తే, అందులో ఏదైనా క్యూరియాసిటీ ఎలిమెంట్ ఉంటుందేమో చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ముగ్గురు స్నేహితులు కాలేజీ పూర్తి చేసి బీటెక్‌లో జాయిన్ కావడం.. అక్కడ వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు.. అనే పాయింట్ చాలా రొటీన్ అయినప్పటికీ, యూత్‌ను ఎంగేజ్ చేయగల ఒక్క స్పార్క్ తగిలితే ఇలాంటి కథలకు మంచి రెస్పాన్స్‌లు లభించాయి. ఇక ఈ వెబ్ సిరీస్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య ఉండే స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్, వారి మధ్య సాగే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. బిందు మాధవి పాత్ర ఉన్న కొంతసేపు ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా మిల్కీ మహేష్ పాత్ర చేసే కామెడీ ఈ సిరీస్‌కు బలంగా నిలిచింది. అతని పాత్రను రాసుకున్న తీరు బాగుంది. కాలేజీ లైఫ్‌లో ఎదురయ్యే సీన్స్ మరోసారి మన కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. ఇక సీనియర్స్, జూనియర్స్ మధ్య వచ్చే సీన్స్ కూడా యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. కేవలం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నప్పటికీ ఇందులోని కంటెంట్ ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేసేలా కట్ చేసుకున్నారు మేకర్స్. ఇక ఈ సిరీస్‌కు మరో అసెట్ బీజీఎం అని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

కాలేజీ లైఫ్ చుట్టూ తిరిగే స్టోరీస్ టాలీవుడ్‌లో ఇప్పటికే బోలెడన్ని వచ్చాయి. ఏదైనా కొత్తదనం ఉంటేనే ఈ కాలేజీ కథలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. కానీ, ఇప్పటివరకు ఉన్న ‘బ్యాచ్‌మేట్’ సిరీస్ ఎపిసోడ్స్‌లో అలాంటి ఆసక్తికర అంశం లేకపోవడం మైనస్. దీంతో ఈ సిరీస్ చాలా రొటీన్ టెంప్లేట్‌గా కనిపిస్తుంది.

ఇక ఈ వెబ్ సిరీస్‌లో కొత్త యాక్టర్స్ ఉండటంతో ప్రేక్షకులకు ఇది కనెక్ట్ కావడానికి సమయం పడుతుంది. మెయిన్ లీడ్ యాక్టర్స్ తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా వారి డబ్బింగ్, లిప్ సింకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవు. కథ చాలా ఫ్లాట్‌గా వెళ్తుండటం కూడా ప్రేక్షకులను ఇర్రిటేట్ చేస్తుంది.

సీనియర్స్-జూనియర్స్ మధ్య వచ్చే క్లాష్ సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. ఇక హీరో అండ్ గ్యాంగ్‌కు సీనియర్స్ ఇచ్చే టాస్క్.. దానిని పూర్తి చేసే క్రమం కూడా ఆకట్టుకోదు. కాలేజీ సీన్స్ కొంతవరకు మాత్రమే వర్కవుట్ అయ్యాయి.

సాంకేతిక వర్గం :

దర్శకుడు శ్రీ హర్ష శెట్టి ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్ అందించే ప్రయత్నంలో ఒక ఫ్లాట్ కథను ఎంచుకోవడంతో ఆయన దానిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. కథలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోవడంతో ఈ సిరీస్ చాలా రొటీన్‌గా సాగుతుంది. పేస్ కూడా స్లోగా సాగడంతో దర్శకుడు సైతం ఏమీ చేయలేకపోయాడు. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. సంగీతం పరంగా బీజీఎం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘బ్యాచ్‌మేట్స్’ అంటూ వచ్చిన నాలుగు ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ ఎలాంటి కొత్తదనం లేని కథతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాలేజీ లైఫ్ చుట్టూ సాగే కొన్ని సీన్స్ బాగున్నాయి. ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఫ్లాట్‌గా సాగే కథనం, బోర్ కొట్టించే సీన్స్ మైనస్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్‌ను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

Exit mobile version