ముఖ్య అంశాలు
- చెన్నై నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ అద్భుత విజయంతో గుజరాత్ టైటాన్స్‌తో పాటు హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
- ఛేదనలో సన్‌రైజర్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (70 పరుగులు), మిడిలార్డర్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (47 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు.
- అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 180/7 స్కోరు చేసింది. డెవాల్డ్ బ్రేవిస్ (44), కార్తీక్ శర్మ (32) రాణించగా, హైదరాబాద్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లతో చెలరేగాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కంటిన్యూ చేస్తోంది. ప్లేఆఫ్స్ రేసులో అత్యంత కీలకమైన 63వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంతగడ్డపైనే చిత్తు చేసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ పోరులో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, దర్జాగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అటు బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్, ఇటు బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, క్లాసెన్ సత్తా చాటడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగుల పోరాడే స్కోరు సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15) నిరాశపరిచినా.. సంజు శాంసన్ (27), యువ ఆటగాళ్లు డెవాల్డ్ బ్రేవిస్ (44), కార్తీక్ శర్మ (32) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో శివమ్ దూబే (26) మోస్తరుగా రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన మార్క్ బౌలింగ్‌తో 3 కీలక వికెట్లు పడగొట్టి చెన్నై టాప్ ఆర్డర్‌కు చెక్ పెట్టగా.. సాకిబ్ హుస్సేన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఇక 181 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (6) వికెట్ కోల్పోయి కాస్త తడబడింది. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ వీరుడు హెన్రిచ్ క్లాసెన్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇషాన్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతనికి తోడుగా క్లాసెన్ కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 47 పరుగులు బాది విజయానికి బాటలు వేశాడు. అభిషేక్ శర్మ కూడా 26 పరుగులతో తన వంతు సహకారం అందించాడు.
చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి 2 వికెట్లు తీసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి (11), సలిల్ అరోరా (10 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేయడంతో హైదరాబాద్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ అద్భుత విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ సరసన ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన చెన్నైకి ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
