ఇంటర్వ్యూ : దేవిశ్రీ ప్రసాద్ – ‘సింగ్ గీతం’ ఒక వైవిధ్యమైన అనుభూతిని ఇస్తుంది..!

Devi-Sri-Prasad

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా బమ్రూ లీడ్ రోల్స్‌లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా టీజర్, పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో డీఎస్పీ విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నాడు.

సింగీతం గారితో సినిమా అనగానే మీ ఫీలింగ్ ఏంటి?

నేను సింగీతం గారికి వీరాభిమానిని. గతంలో పవన్ కళ్యాణ్ గారితో జీసస్ సినిమా అనుకున్నప్పుడు కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ సమయంలోనే సింగీతం గారు మా స్టూడియోకు వచ్చి ‘సింగ్ గీతం’ ఐడియా చెప్పారు. ఆ కథ వినగానే నాకు చాలా థ్రిల్‌గా అనిపించి, ఎప్పటికైనా ఈ సినిమా చేయాలనిపించింది.

మాటలే పాటలుగా చేసిన అనుభవం?

నా కెరీర్‌లోనే ఇది అత్యంత ఛాలెంజింగ్ మరియు వినూత్నమైన సినిమా. ఇందులో ప్రతి డైలాగ్‌ను సంగీతంగా మార్చాల్సి రావడంతో, రెగ్యులర్ ఫార్మాట్ పక్కన పెట్టి సరికొత్త విధానంలో మ్యూజిక్ కంపోజ్ చేశాను. సాధారణ చిత్రాల్లా కాకుండా, ఇందులో డైలాగ్ మారితే స్కేల్ మారిపోతుంది కాబట్టి ప్రతిదీ ముందే మ్యూజికల్‌గా రికార్డ్ చేసి, దాని ప్రకారమే షూట్ చేశారు. నటీనటులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ పాడించామని, జీవితంలో మళ్లీ రాని ఈ అద్భుతమైన అవకాశం కోసం 24 గంటలూ ఎంతో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను.

సినిమా చూశాక మీ రెస్పాన్స్..?

నిన్ననే మేమంతా స్టూడియోలో ఈ సినిమా చూశాం. సింగీతం గారి అద్భుతమైన విజన్‌కి, ఆలోచనల గొప్పతనానికి మరోసారి ముగ్ధుడనయ్యాను. ప్రతి డైలాగ్ మ్యూజికల్‌గా సాగినప్పటికీ, అది చాలా సహజంగా ఉండి ప్రేక్షకులను ఆ గ్రామంలో ఒక భాగం చేస్తుంది. స్క్రిప్ట్ స్థాయిలోనే అద్భుతమైన భావోద్వేగాలు, గూస్‌బంప్స్ మూమెంట్స్ కుదిరాయి. నాకు ఎంతో వర్క్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ అందించినందుకు సింగీతం గారికి హ్యాట్సాఫ్.

ఆడియన్స్‌కు ఈ సినిమా చూస్తే ఎలా అనిపిస్తుంది..?

ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త విభిన్నమైన సినిమా చూసిన అనుభూతిని ఇస్తుంది. సినిమా చూసి థియేటర్ల నుండి బయటకు వచ్చేటప్పుడు వారు కూడా సరదాగా మాటల్ని పాటల్లా పాడుకుంటూ వెళ్తారని నమ్ముతున్నాను. ముఖ్యంగా 94 ఏళ్ల వయసులో కూడా ఇంత కొత్త ఆలోచనతో, ఉత్సాహంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సింగీతం గారిని చూసి ప్రేక్షకులు ఎంతో స్ఫూర్తి పొందుతారు. ఇందులో కథతో ముడిపడి ఉన్న మరికొన్ని మంచి పాటలను ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. ఇక లెజెండరీ నటుడు కమల్ హాసన్ గారు మా స్టూడియోకి వచ్చి ఈ సినిమా చూసి చాలా సంతోషించారు. ‘ఇలాంటి ప్రాజెక్ట్‌లో నేను కూడా భాగం కావాల్సింది’ అని ఆయన అనడం మాకు దక్కిన అతిపెద్ద ఆనందం.

మీరు హీరోగా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ గురించి?

సినిమాకు సంబంధించి చాలా వరకు పని పూర్తయింది. ఇప్పటికే కొన్ని పాటలతో పాటు ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కంపోజ్ చేశాను. మ్యూజిక్, నటన విషయాల్లో పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాం. నిర్మాత దిల్ రాజు గారు నెలకు పది రోజుల చొప్పున సమయం ఇవ్వమని చెప్పారు, ఆయన వర్కింగ్ స్టైల్ నాకు చాలా నచ్చింది. ప్రస్తుతానికి కథ గురించి ఎక్కువ విషయాలు చెప్పలేను కానీ, ఇది పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అద్భుతమైన కథ.

Exit mobile version