మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సరికొత్త వెర్షన్‌తో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా రీలోడెడ్ (కొత్త సీన్లు జోడించిన) వెర్షన్‌ను నేటి నుంచే థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సరికొత్త వెర్షన్లో దాదాపు 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల అదనపు దృశ్యాలను జత చేశారు. ఇందులో ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని సీన్స్‌తో పాటు, సీనియర్ నటుడు జగపతి బాబు నటించిన ఒక కీలకమైన సన్నివేశాన్ని యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐదున్నర నిమిషాల ఎక్స్ట్రా ఫుటేజ్ సినిమాకు ఏ మేరకు అదనపు బలాన్ని ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ భారీ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ కొత్త సీన్ల జోడింపుతో ‘పెద్ది’ రీలోడెడ్ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో, ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
