స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తన కెరీర్లో ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే అలరించిన కాజల్, ఈ సినిమాలో శ్రేయాస్ తల్పాడేతో కలిసి ఒక సీరియస్, సందేశాత్మక పాత్రలో కనిపించబోతోంది.
దక్షిణాదిలో వరుస ఆఫర్లు ఉన్నప్పటికీ ఇలాంటి సీరియస్ కథను ఎంచుకోవడానికి గల కారణాన్ని కాజల్ తాజాగా వెల్లడించింది. తల్లి అయిన తర్వాత తన ఆలోచనా విధానం, కెరీర్ పట్ల దృక్పథం పూర్తిగా మారిపోయాయని ఆమె తెలిపింది. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని, ఒక తల్లిగా తన కుటుంబం మరియు కుమారుడు తినే ఆహారంపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, అందుకే ఈ కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నానని కాజల్ చెప్పుకొచ్చింది.
ఇకపై ఏడాదికి ఎనిమిది తొమ్మిది సినిమాలు కాకుండా, కేవలం మూడు నాలుగు నాణ్యమైన సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేసింది. రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా చిత్రాల కంటే క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలకే తన మొదటి ప్రాధాన్యత అని చెబుతూ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమాలో కూడా తాను అలాంటి ఒక విభిన్నమైన పాత్రే పోషిస్తున్నట్లు కాజల్ పేర్కొంది.
