మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామిడీ ఎంటర్టైనర్ను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ ‘మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’ పేరుతో సక్సెస్ మీట్‌ను నిర్వహిస్తోంది. రేపు (ఆగస్టు 11) సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో ఈ వేడుక జరగనుంది.
ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వరుణ్ తేజ్‌తో పాటు చిత్ర బృందాన్ని నేరుగా అభినందించేందుకు ఆయన ఈ వేడుకకు వస్తుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
రాయలసీమ నేటివిటీకి కొరియన్ ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో వరుణ్ తేజ్ నటనతో పాటు సత్య కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ విజయోత్సవ వేడుక ద్వారా చిత్రబృందం తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోనుంది.
