హీరో రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రానికి ‘అ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను హీరో అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ పతాకాలపై కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ బిహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్లో రాహుల్ విజయ్ చేతిలో లాఠీ పట్టుకుని తీవ్రమైన భావోద్వేగంతో కూర్చుని ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్, నేలపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. టైటిల్ పోస్టర్‌పై అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ, అనుమానం, అమానుషం వంటి పదాలను పొందుపరిచారు. హైదరాబాద్ నగర నేపథ్యంలో తప్పిపోయిన యువతుల కేసులను ఛేదించే (మిస్సింగ్ గర్ల్స్ ఇన్వెస్టిగేషన్) కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ చిత్రంలో జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, మోనిష్ భూపతి రాజు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. కో-ప్రొడ్యూసర్‌గా ఉన్న అభినవ్ వి. కునపరెడ్డితో కలిసి గ్యారీ బిహెచ్ సంయుక్తంగా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర (పోస్ట్ ప్రొడక్షన్) పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
