సమీక్ష : రంభ ఊర్వశి మేనక – రొటీన్ ఫాంటసీ ఎంటర్ టైనర్!


విడుదల తేదీ : సెప్టెంబర్ 04 , 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అల్లరి నరేష్, సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్, నరేష్ వీకే తదితరులు.
దర్శకత్వం : చంద్రమోహన్ చింతాడ
నిర్మాతలు : రాజేశ్ దండా, నిమ్మకాల ప్రసాద్.
సంగీతం : చైతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం : రామ్ రెడ్డ
కూర్పు : చోటా కే ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

హీరో అల్లరి నరేష్, సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ నటించిన చిత్రం రంభ ఊర్వశి మేనక. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రాజమండ్రికి చెందిన సూరి (అల్లరి నరేష్)కి వంశ పారంపర్యంగా ఓ మ్యాజిక్ బుక్ ఉంటుంది. ఆ బుక్ పై సరిగ్గా ముగ్గు వేస్తే పైన నుంచి రంభ, ఊర్వశి, మేనక వస్తారు అని సూరికి అతని బాబాయ్ (వీకే నరేష్) చెబుతాడు. దాంతో దానిపై 25 ఏళ్లుగా ముగ్గు వేసి రంభ (రాశి సింగ్), ఊర్వశి (విష్ణుప్రియ), మేనక (ప్రిషా సింగ్) రప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు సూరి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సూరి ముగ్గు ప్రయత్నం ఫలించి ఆ ముగ్గురు దేవకన్యలు భూమిపైకి వస్తారు. ఇంద్రలోకం నుంచి వచ్చిన వారికి భూమి పై ఏం జరిగింది ?, సూరి వారి నుంచి ఏం కోరుకొన్నారు ?, ఈ మధ్యలో సూరికి చిన్ని (సురభీ)కి మధ్య ప్రేమ కథ ఎలా నడిచింది ?, వీరి పెళ్ళికి పెట్టిన షరతు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కొన్ని చోట్ల కామెడీ టచ్ బాగుంది. ఓపెనింగ్ నుంచి అల్లరి నరేష్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా నరేష్ కి, అతని బుక్ కి మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. రంభ, ఊర్వశి, మేనక ఇంద్రలోకం నుంచి భూమి మీదకు వచ్చాక నడిచే సన్నివేశాలు పర్వాలేదు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. హీరో పాత్రలో నటించిన అల్లరి నరేష్ తన పాత్రలో ఒదిగిపోయారు.

సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘సూరి’ పాత్రను అల్లరి నరేష్ చాలా బాగా పండించారు. ముఖ్యంగా వీకే నరేష్ డైలాగ్స్, ఆయన హావభావాలు బాగానే నవ్వు తెప్పించాయి. సురభీ నటన చాలా బాగుంది. రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ అందాల ప్రదర్శన సినిమాకి ప్లస్ అయ్యింది. ఇతర కీలక పాత్రల్లో నటించిన వెన్నెల కిషోర్, నరేష్ వీకే మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్లు:

ఈ రంభ ఊర్వశి మేనక సినిమా మెయిన్ పాయింట్ లో ఉన్న మ్యాటర్ కూడా.. సినిమాలో లేదు. దర్శకుడు చంద్రమోహన్ చింతాడ తాను తీసుకున్న పాయింట్ కి తగ్గట్టు సీన్స్ రాసుకోవడంలో విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం కామెడీతో ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో అది పూర్తిగా మిస్ అయింది. అటు అల్లరి నరేష్ పాత్రతో సహా మిగిలిన పాత్రలను డిజైన్ చేసుకోవడంలో కూడా దర్శకుడు ఆకట్టుకోలేకపోయాడు.

ఈ సినిమాకి కథనం ప్రధాన బలహీనత. ఓల్డ్ ఫార్ములాతో ప్లే సాగింది. ప్రేక్షకులు ఈ రకమైన కథను చాలాసార్లు చూశారు. అలాగే, ఈ సెటప్ నుండి కామెడీను ఆశించడం కూడా కష్టమే. పైగా స్లో నేరేషన్ కూడా ఈ సినిమాకు మరొక అడ్డంకిగా మారింది. మొదటి సగం ఏదో సాగినా, సినిమా రెండవ భాగం మాత్రం బాగా విసిగించింది. కథనాన్ని అనవసరంగా లాగారు.

సాంకేతిక విభాగం :

సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు పనితనం బాగనే ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాతలు రాజేశ్ దండా, నిమ్మకాల ప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు:

‘రంభ ఊర్వశి మేనక’ అంటూ వచ్చిన ఈ ఫాంటసీ ఫన్ డ్రామాలో.. మెయిన్ థీమ్, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, బోరింగ్ అండ్ సిల్లీ ప్లేతో సినిమా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్నిచోట్ల మాత్రమే ఫన్ బాగుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version