బిగ్ రిలీజ్ దగ్గరపడుతున్న ప్రతిసారీ దర్శకులు నిద్రలేకుండా గడుపుతున్నారని, రోజుల తరబడి ఇంటి మొహం చూడట్లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు రావడం ఈ మధ్య బాగా ఎక్కువైంది. అయితే, ఒకప్పుడు ప్రేక్షకుల్లో కొంత సానుభూతిని నింపిన ఇలాంటి కథనాలపై ఇప్పుడు నెటిజన్ల నుంచి పూర్తి భిన్నమైన రియాక్షన్లు కనిపిస్తున్నాయి. అంకితభావం పేరుతో చివరి నిమిషంలో పడే ఒత్తిడిని ప్రమోట్ చేయడంపై ఆడియన్స్ సూటిగానే కౌంటర్లు వేస్తున్నారు.
అంకితభావమా.. ప్లానింగ్ లోపమా?
సినిమా కోసం దర్శకుడు శ్రమించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, విడుదల సమయానికి పరుగులు పెట్టే బదులు సరైన ప్రణాళికతో ముందే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకోవచ్చు కదా అనేది నెటిజన్ల ప్రధాన ప్రశ్న. చేతిలో కావాల్సినంత సమయం, భారీ బడ్జెట్ ఉన్నప్పుడు చివరి 40 రోజులు నిద్ర లేకుండా పనిచేస్తున్నామని చెప్పుకోవడం ప్రణాళికా లోపమే తప్ప గొప్పతనం కాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
కంటెంటే అసలైన ప్రచారం
ఇలాంటి ‘లాస్ట్ మినిట్ స్టంట్స్’ వల్ల సినిమాపై కొత్తగా హైప్ పెరగకపోగా, లేనిపోని అనుమానాలు తలెత్తుతున్నాయని సినీ ప్రియులు పెదవి విరుస్తున్నారు. తెరపై కంటెంట్ బలంగా ఉండి ప్రేక్షకుడికి నచ్చితే సినిమా దానంతట అదే ఆడుతుంది. అంతేకానీ, దర్శకుల వ్యక్తిగత శ్రమను సింపతీ కార్డులా ప్రచారానికి వాడటం వల్ల థియేటర్లకు జనం రారనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.
