70 శాతం షూటింగ్ పూర్తయిన ‘అప్పూ’… ది క్రేజీ బోయ్
Published on Jan 22, 2015 11:00 am IST

appu
ఎనిమిదేళ్ల బాలుడు అప్పూకి ఏనుగుని చూడాలనే చిన్ని కోరిక ఉంటుంది. ఆ బాలుడి కోరిక తీర్చడానికి తల్లిదండ్రులకు తీరిక ఉండదు. ఎవరి వృత్తిలో వాళ్లు బిజీగా ఉంటారు. తన చిన్ని కోరికను తీర్చుకోవడానికి అప్పూ ఏం చేశాడు? తద్వారా తల్లిదండ్రులకు దూరమయ్యే అప్పూ క్షేమంగా ఇంటికి చేరుకుంటాడా? తన స్నేహితులతో కలిసి అప్పూ చేసిన సాహసం ఏంటి? అనే కథాంశంతో రూపొందుతున్న బాలల చిత్రం ‘అప్పూ’. టైటిల్ రోల్ లో మాస్టర్ సాయి శ్రీవంత్ నటిస్తుండగా కావ్య, లోహిత్ కుమార్, బండ జ్యోతి, జ్వాలా చక్రవర్తి, ఫణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై కె. మోహన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఉపశీర్షిక ‘ది క్రేజీ బోయ్’. ఇప్పటివరకూ జరిపిన షూటింగ్ తో ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ప్రముఖ సంగీతదర్శకుడు శ్రీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను లహరి మ్యూజిక్స్ ద్వారా త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా డైరెక్టర్ కె. మోహన్ మాట్లాడుతూ – ”దర్శకులు కె. రాఘవేంద్రరావు దగ్గర సహాయదర్శకునిగా చేయడంతో పాటు, ఇతర దర్శకుల దగ్గర కొన్ని చిత్రాలకు కో-డైరెక్టర్ గా వర్క్ చేసాను. తొలి ప్రయత్నంగా ఓ మంచి చిత్రాన్ని అందించాలనే ఆకాంక్షతో ‘అప్పూ’ చిత్రం చేస్తున్నాను. అప్పూ పాత్రను సాయి శ్రీవంత్ అద్భుతంగా చేస్తున్నాడు. ఇతర కీలక పాత్రలను సాయి అభిషేక్, జాషువా, లాస్య, ఆదా, మేఘన, మనోజ్ఞ, చిరుహాస్ తదితర బాలలు చేస్తున్నారు. ఓ అతిథి పాత్రను ఒక ప్రముఖ నటి చేయనున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం పిల్లలను, పెద్దలను అలరించే విధంగా ఉంటుంది. ఈ చిత్రానికి శ్రీ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 20శాతం షూటింగ్, మూడు పాటలు మినహా చిత్రం పూర్తయ్యింది. ఆదిలాబాద్ జిల్లా కుంతాల జలపాతంలో రెండు పాటలు చిత్రీకరించనున్నాం. త్వరలో ఈ చిత్రీకరణ ఆరంభం కానుంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.

 
Like us on Facebook