సమీక్ష : విజిల్ – సందేశంతో సాగే స్పోర్ట్స్ డ్రామా

సమీక్ష : విజిల్ – సందేశంతో సాగే స్పోర్ట్స్ డ్రామా

Published on Oct 26, 2019 3:03 AM IST
Whistle movie review

విడుదల తేదీ : అక్టోబర్ 25, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : విజయ్,నయనతార,యోగి బాబు,వివేక్,జాకీ ష్రాఫ్,ఖదీర్ తదితరులు

దర్శకత్వం : అట్లీ

నిర్మాత‌లు : కళాపతి ఎస్ అఘోరం

సంగీతం : ఏ ఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫర్ : జి కె విష్ణు

ఎడిటర్ : రూబెన్

తలపతి విజయ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందిన విజిల్ నేడు విడుదలైంది.ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన విజిల్ మూవీలో విజయ్ సరసన నయనతార నటించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను విజిల్ మూవీ ఎంత వరకు అందుకుందో సమీక్షలో చూద్దాం.

 

కథ:

 

మైకేల్(విజయ్) తన చుట్టూ ఉన్న వారికి సాయం చేస్తూ స్థానికులలో మంచి పేరున్న ఓ యువకుడు. తన మంచితనం వలన మైకేల్ కి స్థానిక రౌడీ ముఠాలతో వైరం నడుస్తూ ఉంటుంది. ఫుట్ బాల్ లేడీ టీం కోచ్ అయిన మైకేల్ మిత్రుడు ఓ సంఘటన వలన తీవ్ర గాయాలకు లోనవుతాడు, దీనితో మైఖేల్ ఆ లేడీ ఫుట్ బాల్ టీం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. లోకల్ రౌడీగా చలామణి అవుతున్న మైకేల్ ఫుట్ బాల్ టీం కోచ్ ఎలా అయ్యాడు? అతన్ని ఆ జట్టు సభ్యులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసలు ఈ మైకేల్ గతం ఏమిటీ? అతని సారథ్యంలోని ఫుట్ బాల్ టీం లక్ష్యం సాధించిందా? అనే సమాధానాలు తెరపై చూసి తెలుసుకోవాలి…

 

ప్లస్ పాయింట్స్:

 

విజయ్ మాస్ ఇమేజ్ ని దర్శకుడు అట్లీ ఓ స్థాయిలో తెరపై ఎలివేట్ చేశారు. ఫుట్ బాల్ ప్లేయర్ గా మైదానంలో అతని వేగం, అలాగే ఎమోషనల్ సన్నివేశాలలో విజయ్ నటనతో కట్టిపడేస్తారు. యువకుడిగా , మధ్య వయస్కుడిగా రెండు భిన్న నేపధ్యాలతో నడిచే పాత్రలలో విజయ్ చూపించిన వైవిధ్యమైన నటన గురించి పొగడకుండా ఉండలేం. క్లైమాక్స్ లో జట్టులోని ప్రతి సభ్యురాలిని తన మాటలతో ప్రేరణ కలిగించి విజయం వైపు నడిపించే సన్నివేశాలలో విజయ్ నటన మూవికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కిన విజిల్ మూవీలో వి ఎఫ్ ఎక్స్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ చూస్తున్న భావన ప్రేక్షకుడికి కలిగేలా వారు చేయడం విజయం సాధించారు. ఫుట్ బాల్ మ్యాచ్ లలో జరిగే ఉత్కంఠ రేపే సన్నివేశాలను వాస్తవానికి దగ్గరగా తెరపై ఆవిష్కరించడంలో వి ఎఫ్ ఎక్స్ బాగా ఉపయోగపడింది.

ఇక విజయ్ ప్రేయసిగా చేసిన నయనతార తక్కువ నిడివిగల పాత్రలో గుడ్ అన్నట్లుగా నటించారు. విజయ్ స్నేహితుడు పాత్రలో ఖదీర్ నటన పర్వాలేదు.

రిచ్ విలన్ పాత్రలకు చక్కగా సరిపోయే బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన విలన్ పాత్రలో అలరించారు. అలాగే విజయ్ ప్రత్యర్థి టీం కెప్టెన్ పాత్ర చేసిన అర్జున్ బజ్వా నటన ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతమని చెప్పాలి, మూవీని ఈ సన్నివేశాలు మరో స్థాయికి తీసుకెళ్లాయి. టీం లోని ప్రతి సభ్యురాలి నేపధ్యం చెప్పిన విధానం, విజయం కోసం వారు తమను తాము మార్చుకున్న విధానం వంటి సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా అట్లీ చక్కగా తెరకెక్కించారు.

తమిళ నేటివిటీ కి దగ్గరగా ఆ పరిస్థితులను ప్రతిబింబిస్తూ స్త్రీ సాధికారత గురించి చెప్పిన విధానం బాగుంది. ఇక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ అందించిన పాటలు, బీజీఎమ్ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. ఆయన తన సంగీతంతో మూవీని మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో బీజీఎమ్ కట్టిపడేస్తుంది.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ మూవీ ప్రధాన బలహీనత అందరికి తెలిసిన గత చిత్రాలను తలపించే కథను ఎంచుకోవడం. గతంలో వచ్చిన అనేక స్పోర్ట్స్ డ్రామాలకు విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ జోడించి అట్లీ తెరకెక్కించాడు. విమెన్ టీం ఫుట్ బాల్ కోచ్ గా విజయ్ మరియు జట్టు సభ్యుల మధ్య వచ్చే సన్నివేశాలు షారుక్ ఖాన్ నటించిన ‘చెక్ దే ఇండియా’ మూవీని తలపిస్తాయి.

చాలా స్లోగా నడిచే మొదటి సగం మూవీ ఇంటర్వల్ వరకు వేగం అందుకోదు. ఇంటర్వెల్ కి కానీ ప్రేక్షకుడికి మూవీపై ఒక అవగాహన రాదు. విజయ్ హీరోయిజం మరియు మాస్ ఎలిమిమెంట్స్ తెరపై పేలినా, నయనతారతో వచ్చే లవ్ ఎపిసోడ్ ఏమాత్రం ఆసక్తి కలిగించవు. నిరుత్సహాంగా సాగే ఈ లవ్ డ్రామా మూవీకి అంతగా ఉపయోగపడలేదు.

ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫుట్ బాల్ మ్యాచెస్ కూడా ఆలోచనలకు అందేటట్లు గా ఏమంత ఆసక్తిగా సాగవు. గతంలో అనేక సినిమాలలో ఎలాంటి సన్నివేశాలు చూసిన ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగదు.

 

సాంకేతిక విభాగం:

 

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక విష్ణు కెమెరా వర్క్ అత్యద్భుతంగా ఉంది. ఫుట్ బాల్ మ్యాచెస్ ని ఆయన తెరపై చక్కగా బంధించారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా డబ్బింగ్ మరియు పాటలలో లిరిక్స్ బాగున్నాయి. ఇక ఎడిటింగ్ పరవాలేదు అన్నట్లుగా ఉంది. ఓ పది నిమిషాల సన్నివేశాలు తగ్గిస్తే బాగుండు అనే భావన కలిగింది.

దర్శకుడు అట్లీ మరో మారు ఈ చిత్రంతో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. విజయ్ లాంటి స్టార్ హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా ఆయన కథలు ఎంచుకొనే విధానం, తెరపై చూపించే తీరు అద్భుతం. మాస్ పల్స్ కి దగ్గరా చిత్రాలు తీయడంలో అట్లీ కి ఉన్న విజన్ ని మెచ్చుకోవాల్సిందే. ఐతే తమిళ ప్రేక్షకుల నేటివిటీకి దగ్గరగా సాగే కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు. మొదటి సగంలో నెమ్మదిగా నడిపించినా రెండవ సగం లో మంచి ఉత్కంఠ కలిగే సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్నారు.

తీర్పు:

 

మొత్తంగా చెప్పాలంటే విజిల్ మూవీ మాస్ ఎలిమెంట్స్ మరియు ఎమోషనల్ కంటెంట్ తో సాగే స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆసక్తిగా సాగే సన్నివేశాలు, ఎమోషన్స్ తో ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది. మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ ని అట్లీ ఒక రేంజ్ లో తెరపై ప్రెసెంట్ చేశారు.తమిళ నేటివిటీ తో సాగే చాలా సన్నివేశాలు తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి అనడంలో సందేహం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులకు కొంచెం రొటీన్ అన్న భావన రావొచ్చు. ఐతే ప్రేక్షకుడిని నిరాశపరిచే చిత్రం ఐతే కాదు. ఏదేమైనా విజిల్ మూవీ అందరూ చూడదగ్గ చిత్రమే. విజయ్ ఫ్యాన్స్ చేత విజిల్ మూవీ విజిల్ వేయిస్తుంది అనడంలో సందేహం లేదు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు