ఆది సాయికుమార్ కొత్త సినిమా ‘ఈగో రాజా’ ఫస్ట్ లుక్ విడుదల

1 6

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హీరో ఆది సాయికుమార్ కొత్త సినిమా ‘ఈగో రాజా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతోనే ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆది సాయికుమార్ గాయాలతో, చేతిలో సిగరెట్‌ పట్టుకుని అగ్రెసివ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. చుట్టూ రౌడీలతో ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే, సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ‘శంబాల’ సినిమాతో హిట్ అందుకున్న ఆదికి ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కానుంది. ఇందులో ప్రముఖ నటుడు సతీష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ సంగీతం, దురైరాజ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు.

Exit mobile version