‘బాహుబలి’ ని అందుకునే ప్రయత్నంలో ‘దంగల్’ !


‘బాహుబలి – ది కంక్లూజన్’ విడుదలై ఎన్ని సంచలనాలు సృష్టిస్తోందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఇండియాలో ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలుకొట్టేసిన ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా ఏ భారతీయ చిత్రం వసూలు చేయని మొత్తాన్ని రాబట్టింది. మొదటి 19 రోజుల్లో రూ. 1450 కోట్లు రాబట్టిన ఈ సినిమా త్వరలోనే రూ. 1500 కోట్ల క్లబ్ ను చేరుకోనుంది.

ఇదిలా ఉండగా కలెక్షన్ల్ పరంగా బాహుబలి తర్వాతి స్థానంలో ఉన్న అమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రం ఈ మధ్యే చైనాలో విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. నిన్నటి తేదీ మే 17 వరకు ఈ సినిమా చైనా, తైవాన్లలో రూ. 530 కోట్లు వసూలు చేసింది. పాత కలెక్షన్లకు ఈ మొత్తం కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 1275 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి బాహుబలిని అందుకునే ప్రయత్నంలో ఉంది. మరి క్లోజింగ్ సమయానికి ‘దంగల్’ ఈ ఫీట్ ను సాధిస్తుందో లేదో చూడాలి.