యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్ హీరోగా అర్జున్ కూతురే ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా స్పెషల్ పాత్ర లో కనిపించనున్నారు . ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత, దర్శకుడు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం..
‘సీతా పయనం’ని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తుండటానికి గల కారణం ఏంటి?
నేను ఇంతకు ముందు ప్రతీ సినిమాని రెండు, మూడు భాషల్లోనే చేశాను. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ఏ భాషలో చేసినా, తీసినా, చూసినా అందరికీ రిలేట్ అవుతుంది. ఇదొక ఫీల్ గుడ్ సబ్జెక్ట్. అన్ని భాషల్లో వర్కౌట్ అవుతుంది. అందుకే నాలుగు భాషల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నాను.
మీ కూతురితోనే సినిమా తీయడం వల్ల బడ్జెట్ విషయంలో మార్పులు వచ్చాయా?
నా ఫ్యామిలీతోనే సినిమా తీయడంతో నాకు బడ్జెట్ మీద ఓ పట్టు ఉంటుంది. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి.. అనే విషయాన్ని నా చేతుల్లోనే పెట్టుకోగలను. నాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది.
తెలుగులోనే మీ అమ్మాయిని పరిచయం చేయాలని ఎందుకు అనిపించింది?
నాకు సినిమా పరిశ్రమ ఎంతో ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ప్రేమిస్తుంటారు. అందుకే ఐశ్వర్యని ఇక్కడి నుంచే లాంచ్ చేయాలని అనుకున్నాను.
‘సీతా పయనం’లో ఎలాంటి అంశాలుంటాయి?
ఇదొక మెచ్యూర్డ్ స్టోరీ. ఇందులో కేవలం ప్రేమ కాదు. ఇందులో ఎన్నో రకాల ఎమోషన్స్, అంశాలున్నాయి. ఈ సినిమాని చూస్తే అవేంటో ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఫ్యామిలీ, దేశాన్ని ప్రేమించడం కూడా ఓ దేశ భక్తి అవుతుంది.
సినిమా చూశాక సెన్సార్ మెంబర్లు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి?
సెన్సార్ బోర్డ్ మా సినిమాను చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. బయటకు వచ్చాక ఎంత మంచి సినిమా తీశారు అని నన్ను మెచ్చుకున్నారు. ఒక్క కట్ లేకుండా యు సర్టిఫికెట్ ఇచ్చారు.
‘సీతా పయనం’కి సంబంధించిన ఐడియా ఎప్పుడు? ఎలా వచ్చింది?
13 ఏళ్ల క్రితం ఈ సబ్జెక్టకి సంబందించిన ఐడియా వచ్చింది. అప్పటి నుంచి అలా నా మెదడులో మెదులుతూనే ఉంది. నా కూతురికి అప్పుడే ఈ పాయింట్‌ను చెప్పాను. అలా కథ మొత్తాన్ని ఫినిష్ చేశాను. ఇలాంటి ఓ మంచి కథతోనే నా కూతురిని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాను.
హీరో, హీరోయిన్ పాత్రల గురించి చెప్పండి?
కేవలం డ్యాన్స్ కోసం, గ్లామర్ కోసం రాసుకున్న పాత్ర కాదు. ఇందులోని ఏ పాత్ర కూడా అలా వచ్చి ఇలా వెళ్లదు. ఇందులో నటనకు ఎంతో స్కోప్ ఉంటుంది. ఐశ్వర్య, నిరంజన్ పాత్రల గురించి సినిమాను చూసి ఆడియెన్స్ చెబుతారు. ఇందులోని ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్‌ను అద్భుతంగా చూపించాం. ఇంత వరకు చూడనటువంటి ఎమోషన్‌ను చూపించబోతోన్నాను.
నటన, దర్శకత్వం.. రెండింటిలో ఏది కంఫర్ట్‌గా ఉంది?
నా వద్ద ఆరేడు స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. నటన కంటే దర్శకత్వం చేయాలనే ఉంది. నెక్ట్స్ నా నుంచి ఓ మాస్ యాక్షన్ మూవీ రాబోతోంది. అందులో ప్రేమ కథ, పాటలు వంటివి ఉండవు. పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్‌గా నా ఏజ్‌కు తగ్గ పాత్రలోనే కనిపిస్తాను.
‘హనుమాన్ జంక్షన్ 2’ వచ్చే అవకాశం ఉందా?
‘హనుమాన్ జంక్షన్ 2’ చేయాలని నాక్కూడా ఉంది. నిన్ననే జగపతి బాబుతో మాట్లాడాను. అతను కూడా అదే అన్నాడు. కానీ మంచి కథ సెట్ అవ్వాలి. ఎవరైనా మంచి కథతో వస్తే నేనే నిర్మిస్తాను, దర్శకత్వం వహిస్తాను.
మీరు నటించిన ఏ మూవీని రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు?
నా ‘జెంటిల్మెన్’ చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చేయాలని ఉంది. ఇప్పటికీ అప్పటికీ ఏమీ మారలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కూడా ‘జెంటిల్మెన్’ చిత్రం సరిపోతుంది. అందుకే ఆ మూవీని రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను.
ఈ మూవీ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు? ఆయనతో అనుభవం గురించి చెప్పండి?
పవన్ కళ్యాణ్ గారిని ఒక ఐదారు సార్లు మాత్రమే కలిశాను. కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలకు రావాలని అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. ఐదు నిమిషాలు అని వెళ్తే మూడు గంటలు ఆయనతో మాట్లాడాను. ఆయన ఎంతో నిజాయితీ గల వ్యక్తి. ఇలాంటి రాజకీయ నాయకుడు ఉండటం గొప్ప విషయం. ‘ఖుషి’ నుంచి నా ఇంట్లో అందరికీ ఆయనంటే ఇష్టం. ‘మీ కోసం మేం ఉన్నాం’ అని చెప్పేందుకు వచ్చాను అని పూజా కార్యక్రమాల్లో ఆయన అన్నారు.
మీరు రాజకీయాల్లోకి వస్తారా?
నాకు రాజకీయాలపై అంతగా అవగాహన లేదు. నాకు రాజకీయాలు పడవు. నేను ఇప్పుడు నటిస్తూ, దర్శకత్వం చేస్తూ బాగానే ఉన్నాను కదా (నవ్వుతూ). మంచి చేయాలనే ఉద్దేశం అయితే నాకు ఉంది. కానీ రాజకీయాలు అనేది సపరేట్ దారి.
ఫైనల్ గా ‘సీతా పయనం’ గురించి చెప్పండి?
‘సీతా పయనం’ మూవీని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను. జెన్ జీ నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ చూడదగ్గ చిత్రమిది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌కు వచ్చి చూసేలా మా సినిమా ఉంటుంది.
